క్షణ క్షణం ఉత్కంఠ

ABN , First Publish Date - 2022-09-08T06:29:15+05:30 IST

అప్పుడప్పుడే సూర్యుడు ఆస్తమిస్తున్న సమయం, అంతా ప్రశాంతంగా ఉంది. పచ్చ ని పొలాల్లో పనులు ముగించుకుని పోతు న్న కూలీలు, ఇళ్లకు చేరుకుంటున్న వారితో ఆహ్లాదంగా ఉంది.

క్షణ క్షణం ఉత్కంఠ
గండి పడి ప్రవహిస్తున్న వరద

 తెగిన సాగర్‌ ఎడమ కాల్వ 

నిడమనూరు, నర్సింహులుగూడెం గ్రామాల్లోకి వరద 

 నిలిచిన రాకపోకలు

అప్పుడప్పుడే సూర్యుడు ఆస్తమిస్తున్న సమయం, అంతా ప్రశాంతంగా ఉంది. పచ్చ ని పొలాల్లో పనులు ముగించుకుని పోతు న్న కూలీలు, ఇళ్లకు చేరుకుంటున్న వారితో ఆహ్లాదంగా ఉంది. ఇంతలో ఒక్కసారిగా నీళ్లు పొలాలను ముంచెత్తాయి. చూస్తుండగానే నీళ్లు ఊళ్లల్లోకి చేరి ఇళ్లల్లోకి చేరాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే అడుగుల మేర నీళ్లు కాళ్లపైకి వస్తుంటే ఏంచేయాలో అర్థంకాని పరిస్థితి. ఇది సాగర్‌ ఎడమకాల్వకు బుధవారం సాయంత్రం గండిపడటంతో నల్లగొండ జిల్లాలోని నిడమనూరు, నర్సింహులగూడెం గ్రామాల్లోని ప్రజలు క్షణక్షణం భయంభయంగా గడిపిన దుస్థితి. ఎటు నుంచి నీళ్లు వస్తున్నాయో అర్థం తెలుసుకునే లోపే రహదారిపై రాకపోకలు నిలిచిపోయేలా వరద ముంచెత్తింది. 

నిడమనూరు

తన సవ్వడులతో ఈ నేలను మాగాణాని చేసిన కృష్ణమ్మ ఒక్కసారిగా ఉగ్రరూపంతో ఊర్లో కి వస్తుంటే ఆ గ్రామస్థుల గుండెలు అదిరిపడ్డా యి. నిడమనూరు మండలం ముప్పారం వద్ద 5:30సమయంలో 32.109కి.మీ యూటీ వద్ద కా ల్వ తెగిందన్న సమాచారం నిడమనూరు, నర్సింహులగూడెం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. చూస్తుండగానే ఊళ్లలోకి నీరు వచ్చి చేరిం ది. ఎటువెళ్లాలో తెలియదు, ఎవరిని సంప్రదించా లో తెలియదు. ఓ దశలో కాల్వ నీటి ప్రవాహ సమీప ప్రాంతాల్లోని ప్రజలు పరుగులు పెట్టారు. నిడమనూరులోని మినీ గురుకులం లోతట్టులో ఉండటంతో నీరు చేరింది. దీంతో అక్కడి నుంచి విద్యార్థులను పునరావాస కేంద్రానికి తరలించారు. 


 పునరావాస కేంద్రాలకు

నిడమనూరు, నర్సింహులుగూడెం గ్రామాల్లోకి నీరు చేరడంతో అధికారులు అప్పటికప్పుడు స్థానిక ఫంక్షన్‌హాళ్లలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిడమనూరులోని మినీ గురుకులంలోని 87 మంది విద్యార్థులను స్థానిక బాలాజీ ఫంక్షన్‌హాల్‌కు, నర్సింహులగూడెం గ్రా మస్థులను శాఖాపురంలోని సాయిఫంక్షన్‌హాల్‌లోని పునరావాస కేంద్రానికి తరలించారు. అక్కడే వారిని భోజన సదుపాయాలు కల్పించారు.  


నిలిచిన రాకపోకలు

 ఎడమ కాల్వనీరు దేవరకొండ- మిర్యాలగూడ ప్రధాన రహదారిపై ఏడు అడుగుల మేర నీరు ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. 


అప్రమత్తం - కదిలిన యంత్రాంగం

సాగర్‌ ఎడమ కాల్వ యూటీ వద్ద పడిన గం డిని ఘటన సమాచారం అందుకున్న అధికారు లు అప్రమత్తమయ్యారు. కాల్వ ఎగువ నుంచి నీరు రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు స్థానికులను అప్రమత్తం చేయడంతో పాటు ఘటనా స్థలానికి చేరువలో ఎవరూ ఉండకుండ ప్రాణనష్టం జరుగకుండ జాగ్రత్తలు తీసుకున్నా రు.  కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఆర్డీవో రోహిత్‌సింగ్‌, డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ సురే్‌షకుమార్‌, ఎన్‌ఎ్‌సపీ డీఈ సంపత్‌, తహసీల్దార్‌ ప్రమీల, ఎస్‌ఐ శోభన్‌బాబు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.  అదేవిధంగా బాలాజీ ఫంక్షన్‌హాల్‌లోని పునరావాస కేంద్రంలోని విద్యార్థులతో మాట్లాడారు. 


అంధకారంలో గ్రామాలు

సాగర్‌ కాల్వ గండితో నిడమనూరు మండలకేంద్రంతో పాటు, నర్సింహులగూడెం గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. సూర్యాస్తమయం అవుతుండటం ఓ వైపు, మరోవైపు విద్యుత్‌ సరఫరా నిలి చి గ్రామాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో గ్రామాల్లోని ప్రజలు భయాందోళనతో నివాసాలను వదిలి వీధుల్లోకి చేరుకున్నారు. నీరు రాక అంతకంతకు అధికం అవుతుండటంతో ఏ క్షణాన ఏం జరుగుతోందనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. పట్టణంలోని రోడ్డు వెంటవున్న పెట్రోల్‌బంక్‌, ఎస్‌బీఐ, మినీగురుకులం, పలుదుకాణాలు, నివాసాల్లోకి భారిగా నీరు చేరింది. సుమారు వందల ఎకరాల్లో పంట నీటి మునిగింది. 

Read more