మోగిన మునుగోడు నగారా

ABN , First Publish Date - 2022-10-04T06:29:21+05:30 IST

పలు అనుమానాలు, అపోహల నేపథ్యంలో ఎట్టకేలకు మునుగోడు ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. అసలు ఉప ఎన్నికకు బీజేపీ వెళ్లదని ప్రచారం జరగ్గా, ఎట్టకేలకు షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్‌ సోమవారం విడుదల చేసింది. దీంతో అధికారులు, నాయకులు అలర్టయ్యారు.

మోగిన మునుగోడు నగారా

ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారు

7నుంచి నామినేషన్ల స్వీకరణ, 14 చివరి తేదీ

నవంబరు 3న పోలింగ్‌, 6న ఫలితాలు

జిల్లాతోపాటు, యాదాద్రి జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి

ఏర్పాట్లు ముమ్మరం చేసిన అధికారులు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): పలు అనుమానాలు, అపోహల నేపథ్యంలో ఎట్టకేలకు మునుగోడు ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. అసలు ఉప ఎన్నికకు బీజేపీ వెళ్లదని ప్రచారం జరగ్గా, ఎట్టకేలకు షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్‌ సోమవారం విడుదల చేసింది. దీంతో అధికారులు, నాయకులు అలర్టయ్యారు. యుద్ధం తప్పదని తేలడంతో పండుగ తర్వాత పూర్తిస్థాయిలో రణరంగంలోకి దిగేందుకు నేతలు ఏర్పాట్లు చేసుకుంటుండగా, అధికారులు ఎన్నిక ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు పోలింగ్‌ బూత్‌ కేంద్రంగా పని ప్రారంభించగా, తాజాగా షెడ్యూల్‌ విడుదలవడంతో బూత్‌ వారీగా పని విభజన పూర్తిస్థాయిలో జరగనుంది. 


ఎన్నికల షెడ్యూల్‌ ఖరారు కావడంతో ఈ నెల 6వ తేదీ నుంచి రోడ్డు షోలు, బహిరంగ సభలు, ఆట, పాటలతో మునుగోడు నియోజకవర్గంలో నెల రోజుల పాటు ధూంధాం ఉండనుంది. కాంగ్రెస్‌ ఇప్పటికే అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించగా, దసరా రోజు టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ప్రకటించే అవకాశం ఉంది. 5 లేదా 6వ తేదీన బీజేపీ తన అభ్యర్థిగా రాజగోపాల్‌రెడ్డిని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.


రెండు జిల్లాల్లో ఎన్నికల కోడ్‌

మునుగోడు ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారు చేస్తూ ఎన్నికల కమిషన్‌ ఈనెల 3న షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 7న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 14వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం ఉందని, 15న నామినేషన్ల పరిశీలన, 17న నామినేషన్ల ఉపసంహరణ గడువు కాగా, పోలింగ్‌ నవంబరు 3వ తేదీన నిర్వహించి 6వ తేదీన కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. షెడ్యూల్‌ వెలువడడంతో ఈనెల 3 నుంచే యాదాద్రి జిల్లాతోపాటు జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. దీంతో నేతల స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయి. ఎన్నికల కోడ్‌కు సంబంధించి కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మోడల్‌ కోడ్‌ అమలులో ఉన్నందున ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలపై ఎటువంటి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన రాతలు రాయకూడదని, ప్రభుత్వ పథకాలు, కొత్తగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదన్నారు. ప్రభుత్వ అతిధి గృహాలు, వాహనాలు ఎన్నికల ప్రచారానికి వాడకూడదని తెలిపారు. నవంబరు 8 వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.


ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు

ఉప ఎన్నిక జిల్లా అధికారిగా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి వ్యవహరించనుండగా, నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారిగా ఆర్డీవో కేఎంవీ.జగన్నాథరావు వ్యవహరించనున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే జిల్లా అధికారులు ఈవీఎంల ప్రాథమిక స్థాయి చెకింగ్‌ (ఎఫ్‌ఎల్‌సీ)ని పూర్తిచేశారు. చండూరులో ఎన్నికల సామగ్రి డిస్టిబ్యూషన్‌ కేంద్రాన్ని ఖరారు చేశారు. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులను నల్లగొండ పట్టణం ఆర్జాలబావిలోని ఎఫ్‌సీఐ గోదాంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలకు తరలించనున్నారు. నవంబరు 6న ఓట్ల లెక్కింపు సైతం ఇక్కడే నిర్వహించనున్నారు. ఎన్నిక షెడ్యూల్‌ వెలువడటంతో రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ సీపీ మహే్‌షభగవత్‌ యాదాద్రి జిల్లా పరిధిలోని చౌటుప్పల్‌, నారాయణపురం పోలీ్‌సస్టేషన్లను సందర్శించి సమస్యాత్మక ప్రాంతాలు, అసాంఘిక శక్తుల వివరాలు తెలుసుకున్నారు.


పండుగ తర్వాత యుద్ధమే

మునుగోడు ఉప ఎన్నికకు సరిగ్గా నెల రోజుల వ్యవధి మాత్రమే ఉండగా, కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించనుంది. ఈ నెల 3న షెడ్యూల్‌ విడుదల కాగా, 5న దసరా పండుగ ఉండడంతో 6వ తేదీ నుంచి అన్ని పార్టీల నేతలు మునుగోడు బాటపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు అధికార టీఆర్‌ఎస్‌ అందరికంటే ముందుగా కసరత్తు ప్రారంభించింది. సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహించడంతోపాటు పార్టీ కుటుంబాలతో ఆత్మీయ సమ్మేళనాలు, దళితులు, గిరిజనులు, రైతులను, నేత కార్మికులను ఇలా సామాజిక వర్గాల వారీగా ఓటర్లందరినీ నాయకులు పలకరించారు. ప్రతీ ఎంపీటీసీ పరిధిలో ఒక మంత్రి లేదా ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పగించారు. రానున్న రోజుల్లో ప్రతీ 100మంది ఓటర్లకు ఒక బాధ్యుడిని కేటాయించి క్షేత్రస్థాయిలో వేగం పెంచాలని పార్టీ నిర్ణయించింది. దీంతో ఈనెల 6 నుంచి టీఆర్‌ఎస్‌ నేతలంతా మునుగోడుకు చేరనున్నారు.


భారీగా కాంగ్రెస్‌ సైన్యం

ప్రతీ పోలింగ్‌ బూత్‌కు 25 మంది బాధ్యులను కాంగ్రెస్‌ కేటాయించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వంటి దిగ్గజాలు మండలానికి ఒకరు చొప్పున బాధ్యత తీసుకోగా, కీలక నేతలకు ప్రతీ మండలంలో ఇద్దరు సహాయకులు ఉన్నారు. ప్రతీ గ్రామానికి పీసీసీ నుంచి ముగ్గురు సమన్వయకర్తలను నియమించారు. సమన్వయకర్తలు స్థానికంగా ఉన్న బూత్‌ బాధ్యులతో సమన్వయం చేసుకుంటూ నిత్యం ఎన్నిక పనిలో నిమగ్నం కానున్నారు.


ఓ వైపు పార్టీ, మరోవైపు ఇమేజ్‌

దక్షిణ తెలంగాణ జిల్లాలో ఎంట్రీ లేని బీజేపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ద్వారా విజయవంతంగా అడుగుపెట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. మునుగోడు ఉప ఎన్నికను అందుకు రిహార్సల్స్‌గా తీసుకుంది. ఇప్పటి వరకు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గాన్ని చుట్టిరాగా, తాజాగా బీజేపీ ఎన్నిక స్టీరింగ్‌ కమిటీ, మండల బాధ్యులను ఖరారు చేసింది. దసరా పండుగ తర్వాత ప్రతీ మండలానికి కేటాయించిన ముగ్గురు కీలక నేతలు ఆయా ప్రాంతాలకు చేరుకోనున్నారు. మాజీ ఎంపీ వివేక్‌ చైర్మన్‌గా ఏర్పాటైన స్టీరింగ్‌ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమైంది. తిరుగులేని ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయడంలో దేశంలో దిట్టగా పేరొందిన బీజేపీ రాష్ట్ర సంస్థాగత ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ మునుగోడుకు సంబంధించి నేరుగా పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రతీ పోలింగ్‌ బూత్‌కు రాష్ట్రస్థాయి నాయకుడిని నియమించారు. స్థానికులతో పాటు బయటి వారిని మొత్తం 15 మంది బృందంతో ఒక బూత్‌ పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. త్వరలో సామాజికవర్గాల వారీగా ఓటర్ల సమావేశాలు, భారీ సభలు కాకుండా గ్రామస్థాయిలో చిన్నపాటి సభలు పెద్ద సంఖ్యలో నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. అధికార టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై ప్రతీ ఇంటికి ఒక కరపత్రం, బీజేపీ ఎన్నికల చిహ్నం ఉన్న స్టిక్కర్‌ను పంపిణీ చేయనున్నారు.


ఉప ఎన్నికకు సిద్ధం : మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేట, మర్రిగూడ, అక్టోబరు 3: మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధంగా ఉందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని ఎరగండ్లపల్లి, లెంకెలపల్లి గ్రామాల నుంచి పలువురు హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. సూర్యాపేట జిల్లా కేంద్రం, హైదరాబాద్‌లో మాట్లాడుతూ, రెండు రోజుల్లో మునుగోడు అభ్యర్థిని సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తారని అన్నారు. దేశానికి ద్రోహం చేస్తూ, రైతులకు మీటర్లు పెడుతూ, నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన బీజేపీకి మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తుండడంతో తట్టుకోలేని బీజేపీ ఏవిధంగానైనా కేసీఆర్‌ ఢిల్లీకి రాకుండా ఆపాలని కుట్రలు చేస్తోందన్నారు. మునుగోడుకు ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డాతో పాటు ఎంతమంది బీజేపీ నాయకులు వచ్చినా టీఆర్‌ఎస్‌ గెలుపును ఆపలేరన్నారు. కార్యక్రమంలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, దంటు జగదీశ్వర్‌, నగేష్‌, మాధవరెడ్డి, పాల్గొన్నారు.


అధికారులతో అదనపు కలెక్టర్‌ ఎన్నికల సమీక్ష 

నల్లగొండ, చండూరు, అక్టోబరు 3 : మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో అధికారులతో అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు సోమవారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఆర్డీవో జయచందర్‌రెడ్డితో పాటు సూపరింటెండెంట్‌, చండూరు తహసీల్దార్‌, ఎన్నికల డీటీ పాల్గొన్నారు. అదేవిధంగా చండూరు మండల కేంద్రంలో, పట్టణంలోని డాన్‌బోస్కో కళాశాలలో ఏర్పాటుచేయనున్న ఈవీఎంల డిస్ర్టిబ్యూషన్‌, భద్రపరిచే గదులను ఆర్డీవో జగన్నాథరావు సోమవారం పరిశీలించారు.

Updated Date - 2022-10-04T06:29:21+05:30 IST