ధీరులకు మొగసాల వీరులకు కాణాచి

ABN , First Publish Date - 2022-09-17T06:13:39+05:30 IST

ఒకరా ఇద్దరా పల్లె పల్లెనా అమరులు

ధీరులకు మొగసాల  వీరులకు కాణాచి
సాయుధపోరాట సమయంలో బాలెంలలోని గ్రామవీధి

 జిల్లాలో సాయుధ పోరాటంలో అసువులు బాసిన వీరులు

 పోరాటాలకు నిలయంగా మునగాల పరగణ

 తిరగబడి తరిమిన బాలెంల  గ్రామస్థులు


బండెనక బండి కట్టి, పదహారు బండ్ల కట్టి ఏ బండ్లే వస్తవు

కొడుకో.. నైజాం సర్కారోడా అంటూ నినదించినా... 

ఊరంతా ఒక్కటై రజాకార్లను వారు వచ్చిన బండ్లలోనే  

పారిపోయేలా తెగువ చూపించినా... 

తుపాకులు చేబూనిన రజాకార్లను ఉట్టి చేతులతో ఎదురొడ్డి 

ఆ తూటాలకు తొలి అమరుడిగా నిలిచినా 

జిల్లాలోని తెలంగాణ పోరాట వీరులకే చెల్లింది. ఒకరా ఇద్దరా పల్లె పల్లెనా అమరులు ఎందరో..  సాయుధ పోరాటం ముగిసి స్వేచ్ఛా వాయువులు పీల్చే సమాజం నెలకొని నేటికి 75 వసంతాలు.. ఇప్పటికీ వారి రక్తతర్పణాలకు నివాళులర్పిస్తూనే ఉంది జిల్లా.. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూనే స్ఫూర్తిని మిగిలిస్తున్నారు జిల్లావాసులు. 

సూర్యాపేటరూరల్‌, సెప్టెంబరు 16 : తెలంగాణ సాయుధపోరాటంలో సూర్యాపేట మండలం బాలెంలకు ప్రత్యేక స్థానం ఉంది. సాయుధ పోరులో తొలి అమరుడు గ్రామవాసే అని ప్రచారంలో ఉంది. 1946 అక్టోబరు 18న ఉదయం తెల్లవారుజామున నిజాం సైన్యం పెద్దసంఖ్యలో గ్రామాన్ని చుట్టుముట్టింది. గ్రామంలోని ముఖ్యమైన వీధుల్లో తిరుగుతూ దొరికిన వారిని దొరికినట్లు కాల్చివేయడానికి సన్నద్ధమయ్యారు. ఈ విషయాన్ని ముందే గ్రహించిన బాలెంల గ్రామస్థులు వారి కంటే ముందు మేల్కొని వీధుల్లో కాపుకాశారు. గ్రామంలోకి వచ్చిన పోలీసులను అడ్డుకుంటూ ముందడుగు వేసిన గార్లపాటి అనంతరెడ్డి, పటేల్‌ మట్టారెడ్డి, సుంకు రంగయ్యతో పాటు మరికొంత మందిపై పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టారు. కాని వీరు అదరలేదు, బెదరలేదు,  అదే తుపాకులను వారి నుంచి అందుకుని వారికే ఎదురుతిరిగారు. బాహాబాహీ తలపడ్డారు. పోలీసులను వెంటపడుతూ తరిమి కొట్టడం మొదలుపెట్టారు. పోలీసులు అతికష్టం మీద ఆయుధాలు అందుకొని కాల్పులు జరుపుకుంటూ పరుగెత్తారు. ముందస్తుగా ప్రణాళికను సిద్ధం చేసుకున్న గ్రామస్థులు ఏమాత్రం వెనకడుగు వేయకుంటా తరిమికొట్టడం మొదలు పెట్టారు.  ప్రజానీకం మొత్తం పోలీసులను చుట్టుముట్టే ప్రయత్నంలో గ్రామస్థుల్లో కొంతమందికి గాయాలయ్యాయి అయినా తగ్గకుండా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇంతలో తెల్లవారింది. పోనియక్‌... దొంగ పోలీసులను అంటూ కేకలు వేసుకుంటూ వెంటపడ్డారు. ప్రజలను చూసిన పోలీసులు మరింత వేగం పెంచారు. సమయం మించితే తమ ప్రాణాలకే ప్రమాదం అని భావించిన పోలీసులు తుపాకులతో చిత్తుబొత్తుగా కాల్చడం మొదలుపెట్టారు. ఆ దాడిలో గార్లపాటి అనంతరెడ్డి, పటేల్‌ మట్టారెడ్డి వీరమరణం పొందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరుల రక్తపు మడుగుల్లో నుంచి అడుగులు వేసుకుంటూ గ్రామస్థులు పోలీసులను అందుకోవడానికి మరింత ముందుకు పరిగెత్తారు. సమాయానికి ఉన్న వారి వాహనాలు లారీలు, జీపులు ఎక్కి గ్రామస్థులకు అందకుండా తప్పించుకొని పోలీసులు తమ ప్రాణాలను కాపాడుకున్నారు.  ఈ తిరుగుబాటు నిజాం పాలకవర్గాన్నే గడగడ లాడించింది. స్వయంగా ఈ ఘటనపై విచారణ జరపాలని, గ్రామస్థులను ఓదార్చాలని నిజాం చక్రవర్తి తన కుమారుడినే బాలెంలకు పంపించడం ఈఘటన తీవ్రతకు సాక్ష్యం. అంతేకాదు మృతుల కుటుంబాలను పరామర్శించిన తర్వాత ఎక్స్‌గ్రేషియా చెల్లింపు పేరుతో అమరవీరుల కుటంబసభ్యులకు దోసిల్లలో పైసలు పోయడం బాలెంల రైతులు తిరుగుబాటుకు లభించిన నైతికమద్దతుగా గ్రామస్థులు, పూర్వీకులు తెలిపారు. 


వీరోచిత పోరాటంలో హుజూర్‌నగర్‌ వాసులు

హుజూర్‌నగర్‌ : తెలంగాణ సాయుధపోరాటంలో హుజూర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన నాయకులు కీలకపాత్ర పోహించారు. ఈ పోరులో అసువులు బాసిన వారిలో హుజూర్‌నగర్‌కు చెందిన దొంతిరెడ్డి శంభిరెడ్డి, మఠంపల్లికి చెందిన బొమ్మకంటి గోపయ్య, పొనుగోడుకు చెందిన దాసరి లింగన్న ఉన్నారు. 1948 ఫిబ్రవరి 22న మఠంపల్లి మండలం చింతలమ్మగూడెం వద్ద జరిగిన సాయుధపోరాటంలో హుజూర్‌నగర్‌కు చెందిన దొంతిరెడ్డి శంభిరెడ్డి, దాసరి లింగన్న, బొమ్మకంటి గోపయ్య అమరులయ్యారు. చింతలమ్మగూడెం వద్ద ముగ్గురిని రజాకార్లు చుట్టుముట్టి అతి కిరాతకంగా కాల్చి చంపారు. శంభిరెడ్డి తండ్రిని సైతం నాటి నైజాం పోలీసులు తీవ్రంగా గాయపర్చారు. వీరితో పాటు సాయుధపోరులో తుపాకులు పట్టిన వారిలో చింతలపూడి రాములు, పశ్య రామిరెడ్డి ఉన్నారు. చింతలపూడి రాములు హుజూర్‌నగర్‌ సర్పంచ్‌గా పనిచేయగా, జూన్‌ 2, 1984లో గుండె పోటుతో మృతి చెందారు. పశ్య రామిరెడ్డి మే 17, 2019 హుజూర్‌నగర్‌ పట్టణంలో అనారోగ్యంతో మృతిచెందారు. 1946లో ఆంధ్రామహాసభల సందర్భంగా హుజూర్‌నగర్‌లో వట్టికోట ఆళ్వారుస్వామి, వాసిరెడ్డి నర్సయ్యలను వేయిమందితో ఊరేగించినందుకు నైజాం పోలీసులు 30మందిని అరెస్ట్‌ చేయగా అందులో రాములు, పశ్య రామిరెడ్డి ఉన్నారు. సాయుధ పోరాటంలో రాములు, రాంరెడ్డి కుటుంబాలు కూడా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచాయి. సాయుధపోరాటాన్ని ఆపాలని 1946 డిసెంబర్‌ 1న మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన యరబోలు అప్పిరెడ్డిని కాల్చి చంపేశారు. దొడ్డా నర్సయ్య నాయకత్వంలో ఎంతోమంది సాయుధ పోరాట యోధులు గ్రామస్థాయిలో పనిచేశారు. ఒక్కో దళంలో 20 నుంచి 30 మంది ఉండేవారు. అదేవిధంగా చింతలపూడి రాములుతో పాటు ఆయన చెల్లెలు కోట తిరుపతమ్మ దళ సభ్యులుగా పనిచేశారు. ఆమె భర్త కోట నారాయణ దళ లీడర్‌గా పనిచేయగా, అతని ఆచూకీ కోసం తిరుపతమ్మను నిర్బంధించి ఇబ్బందులు పెట్టారు. 


రక్తతర్పణాలర్పించిన మునగాల పరగణా

నడిగూడెం : తెలంగాణ సాయుధ పోరాటానికి జమిందారీ వ్యతిరేక ఉద్యమానికి మునగాల పరగణా ఊపిరిపోసింది. 1326-1662 మధ్యకాలంలో కాకతీయ చక్రవర్తుల నుంచి స్వాతంత్రం సిద్ధించిన 1947 ఆ తరువాత పరిపాలించిన జమీందారుల వరకు చరిత్రకు ఎక్కిన అనేక ఉద్యమాల్లో ప్రాణత్యాగాలతో పరగణా పునీతమైంది. నడిగూడెం కేంద్రంగా మునగాల పరగణాను పరిపాలించిన జమీందారు వెంకటరంగారావు దత్తత చెల్లదని కీసర వారసులు వ్యాజ్యం వేయడం, వరంగల్‌, హైదరాబాదు, బందార్‌ కోర్టుల్లో ఏళ్లపాటు నడిచిన కేసు లండన్‌ కౌన్సిల్‌కు వెళ్లింది. 1931లో జమిందారు వ్యాజ్యం గెలిచినా ఖజానా ఖాళీకావడంతో దానిని భర్తీ చేసేందుకు సిస్తులు పెంచడం, జరిమానా విధించి క్రిమినల్‌ కేసులు ప్రయోగించి వెట్టిచాకిరి దౌర్జన్యాలతో ధనార్జనకు ఉపక్రమించడంతో ఈ ప్రాంత ప్రజలు, రైతులు ఎదురు తిరిగారు. దీంతో జమీందారు నిజాం నవాబులను ఆశ్రయించి గ్రామాల్లో రజాకార్లను పిలిచి ప్రజాఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో 1947 నుంచి 51 మధ్యకాలంలో సాగిన ఉద్యమంలో పరగణాకు చెందిన 20 మేజరు, 19 శివారు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఆ పోరాటంలో మునగాల మండలం జగన్నాథపురం, నేలమర్రి, కొక్కిరేణి, నర్సింహులగూడెం, రామసముద్రం, తలకోవ, నడిగూడెం మండలానికి చెందిన కరవిరాల, సిరిపురం, రామాపురం గ్రామాలకు చెందిన 33 మంది వీరమరణం పొందారు. 

గోపాల కృష్ణయ్య స్ఫూర్తిని మరవని కరవిరాల

సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటంలో అమరుడైన గట్టు గోపాలకృష్ణయ్య స్ఫూర్తిని కరవిరాల ప్రజలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన జ్ఞాపకార్థం గ్రామ నడిబోడులో నిర్మించిన స్మారక స్థూపానికి నివాళులర్పిస్తున్నారు. కట్టుబాట్ల ఇంటిలో పుట్టిన గోపాల కృష్ణయ్య బ్రాహ్మణుడైనప్పటికీ అణగారిన ప్రజల వైపు ఉంటూనే తనకు ఉన్న భూమిని పేదలకు పంచి ఉద్యమంలో పాల్గొన్నారు. అనేక రకాల పన్నులతో పాటు కిష్ణయ్యకు చెందిన మూగజీవాలపై కూడా జమీందారు పన్నులు విధించి వాటిని తన కోటకు తరలించినా వెనుకాడక సాహసంతో ప్రజా ఉద్యమాన్ని కొనసాగించారు.  Read more