మోడల్‌ రైతు బజార్‌ నిర్వహణ అస్తవ్యస్తం

ABN , First Publish Date - 2022-11-28T00:04:47+05:30 IST

జిల్లా కేంద్రంలో ఆధునిక హంగులతో నిర్మించిన మోడల్‌ రైతు బజార్‌ సమస్యలకు నిలయంగా మారింది.

మోడల్‌ రైతు బజార్‌ నిర్వహణ అస్తవ్యస్తం
రైతు బజారు ప్రధాన గేటు వద్ద అస్తవ్యస్తంగా వాహనాల పార్కింగ్‌

ఎస్టేట్‌ అధికారి, సిబ్బంది లేక కొరవడిన పర్యవేక్షణ

స్టాళ్లలో కనిపించని ధరల పట్టిక

భువనగిరి రూరల్‌, నవంబరు 27: జిల్లా కేంద్రంలో ఆధునిక హంగులతో నిర్మించిన మోడల్‌ రైతు బజార్‌ సమస్యలకు నిలయంగా మారింది. రూ.1.56కోట్లతో నిర్మించిన మోడల్‌ రైతు బజార్‌ను స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌ రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌ 23న ప్రారంభించారు. ఇందులో ప్రస్తుతం 126 స్టాళ్లు ఉన్నాయి. వీటిలో 74వ స్టాల్‌లో కూరగాయలు, 52వ స్టాల్‌లో ఆకుకూరలు విక్రయించేందుకు అధికారులు వ్యాపారులకు కేటాయించారు. జిల్లా కేంద్రంలో ఆధునిక హంగులతో నిర్మించిన మోడల్‌ రైతు బజార్‌ సమస్యలకు నిలయంగా మారింది. రూ.1.56కోట్లతో నిర్మించిన మోడల్‌ రైతు బజార్‌ను స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌ రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌ 23న ప్రారంభించారు. ఇందులో ప్రస్తుతం 126 స్టాళ్లు ఉన్నాయి. వీటిలో 74వ స్టాల్‌లో కూరగాయలు, 52వ స్టాల్‌లో ఆకుకూరలు విక్రయించేందుకు అధికారులు వ్యాపారులకు కేటాయించారు. రైతు బజారుకు నిత్యం సుమారు 9వేలకు పైగా మంది వినియోగదారులు వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తుంటారు. గత సంవత్సరం నుంచి ఎస్టేట్‌ అధికారి లేకపోవడంతో మార్కెట్‌ కమిటీ సూపర్‌వైజర్‌ రాజీవ్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఒక సూపర్‌వైజర్‌, మూడు వాచ్‌మెన్‌ పోస్టులు ఖాళీగా ఉండడంతో రైతు బజార్‌ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. స్టాళ్లలో ధరల పట్టికను సక్రమంగా ఏర్పాటు చేయకపోవడంతో వినియోగదారులు కొంత మేర ఇబ్బందులకు గురవుతున్నారు. శానిటేషన్‌ సిబ్బంది కొరత ఉండడంతో పారిశుధ్య సమస్య తలెత్తుతోంది. జిల్లాకేంద్రం నడిబొడ్డులో రైతు బజారు ఏర్పాటు చేయడంతో వాహనాల పార్కింగ్‌ అస్తవ్యస్తంగా ఉంది. దీనికి తోడు జిల్లాలోని పలు ప్రాంతాలు, హైదరాబాద్‌ నుంచి కూరగాయలు దిగుమతి చేసుకునేందుకు డీసీఎం వాహనాలు, ఆటోలు రైతు బజార్‌లోనికి వచ్చిపోతుండడంతో రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా మార్కెట్‌ కమిటీ పాలకవర్గం, మార్కెటింగ్‌ శాఖ అధికారులు పట్టించుకుని రైతు బజారులో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రతి స్టాల్‌లో ధరల పట్టిక ఏర్పాటు చేయాలి

భువనగిరి రైతు బజారులో ప్రతిస్టాల్‌లో ధరల పట్టికను ఏర్పాటు చేయాలి. ధరలు తెలియక అధిక డబ్బులు వెచ్చించి కూరగాయలు కొనుగోలు చేస్తున్నాం. ప్రధాన గేటు వద్ద వాహనాలను అస్తవ్యస్తంగా పార్కింగ్‌ చేయండంతో ఇక్కడికి కూరగాయల కోసం వచ్చే మహిళలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతు బజారులో సిబ్బందిని నియమించి ప్రత్యేకమైన పార్కింగ్‌ను ఏర్పాటు చేసి, పారిశుధ్య చర్యలు కూడా ఎప్పటికప్పుడు చేపట్టాలి.

- రావి భాస్కర్‌రెడ్డి, వినియోగదారుడు నందనం

ఇబ్బందులు లేకుండా చూస్తాం

రైతు బజార్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. రెగ్యులర్‌ ఎస్టేట్‌ అధికారి, సూపర్‌వైజర్‌, ముగ్గురు వాచ్‌మెన్‌ల నియామకానికి మార్కెటింగ్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. కలెక్టర్‌,అదనపు కలెక్టర్‌కు సమస్యను నివేదించాం. ప్ర స్తుతం రైతు బజార్‌ పర్యవేక్షణ కోసం మార్కెట్‌ కమిటీ సూపర్‌వైజర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాం.

- సబిత, మార్కెటింగ్‌ డీఎం

Updated Date - 2022-11-28T00:04:50+05:30 IST