పీఏసీఎ్‌సలో భారీ అవినీతి

ABN , First Publish Date - 2022-02-23T06:06:01+05:30 IST

మండల పరిధిలోని చిల్లేపల్లి ప్రాథమిక సహకార సంఘంలో భారీ అవినీతి వెలుగుచూసింది. రైతుల పేర్లతో ధాన్యం కొనుగోళ్లు చేసినట్టు కాగితాలు సృష్టించి కోటి రూపాయల మేర ప్రభుత్వ సొమ్మును కాజేసినట్లు చర్చసాగుతోంది.

పీఏసీఎ్‌సలో భారీ అవినీతి

కోట్ల రూపాయలు పక్కదారి

అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం?


నేరేడుచర్ల: మండల పరిధిలోని చిల్లేపల్లి ప్రాథమిక సహకార సంఘంలో భారీ అవినీతి వెలుగుచూసింది. రైతుల పేర్లతో ధాన్యం కొనుగోళ్లు చేసినట్టు కాగితాలు సృష్టించి కోటి రూపాయల మేర ప్రభుత్వ సొమ్మును కాజేసినట్లు చర్చసాగుతోంది. దీనిపై పూర్తిస్థాయి విచారణ నిర్వహిస్తే నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంది.


పెంచికల్‌దిన్న పీఏసీఎస్‌ పరిధిలో గత రబీ, ఖరీ్‌ఫలో ధాన్యం కొనుగోళ్లు చేశారు. రబీలో దొడ్డురకం ధాన్యం కొనుగోలు చేయగా, సాగైన పంటకు దీనికి పొంతన లేదు. మండల పరిధిలో నేరేడుచర్ల, పెంచికల్‌దిన్న, చిల్లేపల్లి ప్రాథమిక సహకార సంఘాలతో పాటు మేడారంలో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటుచేశారు. మండలంలో రబీలో 3653.43ఎకరాల్లో దొడ్డు రకం ధాన్యం సాగు కాగా, 1,31,523 క్వింటా ళ్ల దిగుమతి వచ్చినట్టు వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందులో ఒక్క చిల్లేపల్లి సహకార సంఘం 50,308 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి నాలుగు మిల్లులకు పంపినట్లు లెక్కలు చూపారు. దీంతో రూ.9, 49,37,94 డబ్బు 594 మంది రైతుల అకౌంట్లలో జమ చేశారు. చిల్లేపల్లి పీఏసీఎస్‌ పరిధిలో లేని గ్రామాల రైతుల అకౌంట్లలో కూడా నగదు జమైంది. సదరు రైతుల నుంచి సెల్ఫ్‌ చెక్కులు తీసుకొని వాటిని ఒకే వ్యక్తి డ్రా చేసినట్టు సమాచారం. రైతు పట్టాదారు పాస్‌పుస్తకం ఆధారంగా ఎకరాకు 90టిక్కీలు (ఒక్కో టిక్కీ 40కిలోలు) చొప్పున లెక్కగట్టి డబ్బు జమ చేయాలి. అయితే నేరేడుచర్ల మునిసిపాలిటీ పరిధిలో కొంత మంది రైతులకు రెండు నుంచి మూడు ఎకరాల భూమి ఉన్నా లక్షల రూపాయలు వారి అకౌంట్లలో ధాన్యం డబ్బు జమ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.


సొంత గ్రామంలో ఐకేపీ ఉన్నా

మేడారంలో ఐకేపీ సెంటర్‌ ఉండగా, ఈ గ్రామానికి చెందిన రైతులు మరో కేంద్రంలో ధాన్యం విక్రయించినట్టు పత్రాలు సృష్టించారు. మేడారం రైతులు చిల్లేపల్లి పీఏసీఎ్‌సలో ధాన్యం విక్రయించినట్టు చూపి వారి అకౌంట్లలో డబ్బు జమ చేశారు. అయితే కేంద్రాల నుంచి మిల్లులకు ట్రాక్టర్ల ద్వారా ధాన్యం రవాణా చేశారు. అంతా 40కిలోల బస్తాలు(టిక్కీ) ద్వారా మిల్లులకు ధాన్యం పంపాలి. కానీ 70కిలోల బస్తాల్లో ధాన్యం పంపినట్టు తెలిసింది.


పక్క రాష్ట్రం నుంచి ధాన్యం దిగుమతి చేశారా?

బయటి రాష్ట్రాల నుంచి ధాన్యం దిగుమతి చేసి ఇక్కడ విక్రయించిన ట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ రాష్ట్రంలోని పల్నాడు ప్రాంతం, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తదితర ప్రాంతాల నుంచి దొడ్డు రకాలను రూ.1200 నుంచి రూ.1400 వరకు కొనుగోలు చేసి లారీల ద్వారా ఆ ధాన్యాన్ని పీఏసీఎ్‌సలకు రాకుండానే ట్రక్‌ షీట్లు తయారు చేసి మిల్లర్ల సహకారంతో విక్రయించనట్టు ఆరోపణలు వినవస్తున్నాయి. దీంట్లో పీఏసీఎస్‌ అధికారులతోపాటు ప్రజాప్రతినిధుల ఉన్నట్టు తెలుస్తోంది.


డబ్బు డ్రా చేసిందెవరు?

దొడ్డు రకాలు సాగు చేయని రైతుల పేరున పత్రాలు సృష్టించి ధాన్యం సొమ్మును వారి అకౌంట్లలో జమ చేశారు. వారి నుంచి చెక్కులు తీసుకొని డ్రా చేసిన ఆ వ్యక్తి ఎవరనేది చర్చనీయాంశమైంది. సంబంధిత ప్రజాప్రతినిధులే వారి అనుయాయుల ద్వారా డబ్బు డ్రా చేశారా లేక స్వయంగా డ్రా చేశారా అనేది బ్యాంకుల్లో విచారిస్తే తేలుతుంది. అయితే ఏ సంబంధం లేకున్నా డబ్బు మీ అకౌంట్లలోకి వస్తుంది, ఆ తరువాత డ్రా చేసుకుంటానని ఓ ప్రజాప్రతినిధి తమను ఇరికించారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కొనుగోలు చేయకుండానే ట్రక్‌ షీట్లు

అసలు ధాన్యం కొనుగోలు చేయకుండానే, రవాణా చేయకుండానే మిల్లులో ధాన్యం దిగుమతి చేసినట్టు మిల్లర్లతో ములాఖతై ట్రక్‌ షీట్లు సృష్టించారు. ఆ తరువాత ప్రభుత్వం నుంచి వచ్చిన నగదు అకౌంట్లలో జమ చేయించుకున్నట్లు తెలిసింది. బయట ప్రాంతాల నుంచి ధాన్యం దిగుమతి చేయడం లేదా, పీడీఎస్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి సివిల్‌ సప్లై కేంద్రాలకు సరఫరా చేసేందుకు సన్నాహాలు చేసినట్టు తెలిసింది. అదేవిధంగా పీఏసీఎస్‌ సీఈవో కుటుంబ సభ్యుల పేరుమీద 2,000 టిక్కీలు కొనుగోలు చేసి సుమారు రూ.15లక్షలు వారి అకౌంట్లలో జమ చేసినట్లు సమాచారం.


పీఏసీఎస్‌ సీఈవో నాగరాజు వివరణ

భూమి తక్కువగా ఉంటే పెద్ద మొత్తంలో ధాన్యం దిగుబడి ఎలా వచ్చిందని పీఏసీఎస్‌ సీఈవో నాగరాజును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, తాను కౌలుకు భూమి తీసుకొని సాగుచేశానని చెప్పారు. ఎవరి పొలం కౌలుకు చేశారని, అగ్రిమెంటు ఉందా అని ప్రశ్నించగా తనకు చాలా భూమి ఉందని సమాధానం దాటవేశారు.

Read more