మట్టి గుట్టలపై మాఫియా పడగ

ABN , First Publish Date - 2022-11-24T00:44:30+05:30 IST

మండలంలోని మట్టి గుట్టలపై మాఫియా వాలింది. ప్రభుత్వ భూమి, పట్టా భూమి అనే భేదం లేకుంగా మట్టి గుట్టలను యథేచ్చగా తవ్వేస్తున్నారు. ఆధునిక యంత్రాలతో తవ్వి తరలిస్తున్నందున తెల్లారేసరికి మట్టి గుట్టలు మాయం అవుతున్నాయి.

మట్టి గుట్టలపై మాఫియా పడగ
శాంతినగర్‌ గ్రామ శివారులోని గుట్టలో గ్రావెల్‌ను తవ్వుతున్న, తరలిస్తున్న వాహనాలు

సామన్యుల నోట్లో ‘మట్టి’

అనంతగిరి, నవంబరు 23: మండలంలోని మట్టి గుట్టలపై మాఫియా వాలింది. ప్రభుత్వ భూమి, పట్టా భూమి అనే భేదం లేకుంగా మట్టి గుట్టలను యథేచ్చగా తవ్వేస్తున్నారు. ఆధునిక యంత్రాలతో తవ్వి తరలిస్తున్నందున తెల్లారేసరికి మట్టి గుట్టలు మాయం అవుతున్నాయి. మండలంలోని శాంతినగర్‌ గ్రామ శివారులోని మట్టి గుట్టలను అక్రమంగా రాత్రింబవళ్లూ ఎక్స్‌కవేటర్లతో తవ్వుతున్నారు. ఈ మట్టిని రోజుకు 20 నుంచి 30 ట్రిప్పులను టిప్పర్లతో కోదాడలోని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు తరలిస్తు న్నారు. ఒక్కో టిప్పర్‌ మట్టిని రూ.3,700 నుంచి రూ.4వేలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు మట్టి తరలిపోవడంతో ఇళ్లను నిర్మించుకునే సామాన్య ప్రజలకు మట్టి కొరత ఏర్పడింది. గతంతో ట్రాక్టర్‌కు కిరాయి (రూ.500 చెల్లిస్తే మట్టి ఇంటికి వచ్చేది. మట్టి దళారులు సిండికేట్‌గా ఏర్పడి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో సామా న్యులు ట్రాక్టర్‌ మట్టికి రూ.2వేల నుంచి రూ.2,500వరకు చెల్లిస్తున్నా సమయానికి రాని పరిస్థితి ఏర్పడింది.. మట్టిని అధిక ధరలకు విక్రయించేవారిపై చర్యలు తీసు కుంటామని ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ హెచ్చ రించారు. ఇంటి నిర్మాణాల కోసం పేద, మధ్య తరగతి ప్రజలు రెవెన్యూ శాఖ అధికారుల అనుమతి తీసుకుని మట్టిని తీసుకువెళ్లాలని ఆయన సూచిం చారు. దీంతో మట్టి మాఫియా కొన్నాళ్లు తమ కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే కొన్ని రోజులుగా అనంతగిరి మండ లంలో మట్టి మాఫియా మట్టి అక్రమ తవ్వకాలను ప్రారం భించింది. ఎమ్మెల్యే ఆదేశాలను మట్టి మఫియా ఖాతరు చేయకపోవ డంపై విస్మయం వ్యక్తమవుతోంది. అధికార పార్టీ నాయకుల కనుసన్న ల్లోనే మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తు న్నారు. ఈ తవ్వకాలను మైనింగ్‌, రెవెన్యూ శాఖ అధికారులు అడ్డుకోవడంలేదని ప్రజలు చెబుతున్నారు.

మట్టి అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలి

మట్టి దొరకక సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. మట్టిని కొందరు అక్రమంగా తవ్వి తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు లక్షల్లో గండి కొడుతున్నారు. అనంతగిరి మండలంలోని శాంతినగర్‌ గ్రామ శివారులో మట్టిని అక్రమంగా తరిలిస్తున్న వారిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి.

  • ముస్కు శ్రీనివాస్‌రెడ్డి, అనంతగిరి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు

తరలింపునకు అనుమతులు లేవు

మట్టి తరలింపునకు అనుమతులు లేవు. మట్టి గుట్టలను తవ్వాలంటే మైనింగ్‌ శాఖే అనుమతి ఇవ్వాల్సి ఉంది. మైనింగ్‌ శాఖ ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. మట్టిని అక్రమంగా తరలించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

సంతోష్‌కిరణ్‌, తహసీల్దార్‌, అనంతగిరి

Updated Date - 2022-11-24T00:44:32+05:30 IST