ఎన్నాళ్లీ ఎదురుచూపులు!

ABN , First Publish Date - 2022-09-19T06:05:32+05:30 IST

ఉమ్మడి జిల్లాలోని జిల్లా పరిషత్‌లలో కారుణ్య నియామకాల భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వారిని నియమించేందుకు ఖాళీలు ఏర్పడకపోవడంతో నియామకాలు జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పదవీ విరమణ వయసును పెంచడంతో ఖాళీ లు ఏర్పడటం లేదు.

ఎన్నాళ్లీ  ఎదురుచూపులు!
నల్లగొండలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు హాజరైన అభ్యర్థులు (ఫైల్‌)

జడ్పీలో కారుణ్య నియామకాల భర్తీలో జాప్యం

నల్లగొండలో 2015 నుంచి నిరీక్షణ

అటెండర్‌ పోస్టులపై అభ్యర్థుల నిరాసక్తత 


నల్లగొండ, సెప్టెంబరు 18 : ఉమ్మడి జిల్లాలోని జిల్లా పరిషత్‌లలో కారుణ్య నియామకాల భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వారిని నియమించేందుకు ఖాళీలు ఏర్పడకపోవడంతో నియామకాలు జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పదవీ విరమణ వయసును పెంచడంతో ఖాళీ లు ఏర్పడటం లేదు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మరణించిన వారి కుటుంబ సభ్యులు ఉద్యోగం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కారుణ్య నియామకాల భర్తీ ఇప్పట్లో జరిగే అవకాశాలు లేక అభ్యర్థుల తో పాటు కుటుంబసభ్యులు మనోవేదనకు గురవుతున్నారు. 2015 నుంచి దరఖాస్తులు చేసుకున్న 108మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలు 2016లో ఏర్పాటు కాగా అప్పటి నుంచి ఒక్క నియామకం కాలేదు. జిల్లాలో రెండు పోస్టులను మాత్రం వీఆర్‌ఏలతో భర్తీ చేశారు. నల్లగొండ జిల్లాలో 2015 నుంచి 42 మంది అభ్యర్థులు తమకు ఉద్యోగాలు దొరక్క వేచి ఉంటున్నారు. తమకు ఉద్యోగా లు ఎప్పుడు కల్పిస్తారంటూ ప్రతిరోజూ కార్యాలయం చుట్టూ, జిల్లా పరి షత్‌ అధికారులు చుట్టూ తిరుగుతుండడంతో విధి లేని పరిస్థితుల్లో ఇటీవల నల్లగొండ జడ్పీ సమావేశ మందిరంలో కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి, పోస్టుల ఖాళీ తదితర అంశాలపై అభ్యర్థులకు వివరించి, అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. అభ్యర్థులకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బండానరేందర్‌రెడ్డితో పాటు, అధికారులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.


అటెండర్‌ పోస్టులకు అభ్యర్థుల నిరాసక్తత

ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మరణించిన ఉద్యోగి వారసులకు కారు ణ్య నియామకం పథకం ద్వారా విద్యార్హత మేరకు జూనియర్‌ అసిస్టెం ట్‌, టైపిస్ట్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌గా నియమకాలు చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లా పరిషత్‌ యాజమాన్యం పరిధిలో లోకల్‌ బాడీ్‌సలో పనిచేస్తూ మరణించిన ప్రభుత్వ ఉద్యోగులు అంటే బోధన, బోధనేతర ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకం కింద పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. జూనియర్‌ అసిస్టెంట్‌గా నియామకం కోసం 2015 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అధికారుల వద్ద 42 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కారుణ్య నియామకం ద్వారా జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న ఈ అభ్యర్థులు ఆఫీస్‌ సబార్డినేట్‌గా (అటెండర్‌) చేరేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. వారంతా జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్టు పోస్టులే కావాలంటూ కోరుతుండడంతో నియామకాలు జరగడం లేదు. ప్రస్తుతం ఆ ఉద్యోగాల ఖాళీలు లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలా ఉంటే జడ్పీ పరిధిలో 138 ఆఫీస్‌ సబార్టినేట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులకు దరఖాస్తులు చేసుకుంటే రెండు, మూడు నెలల్లోనే ఉద్యోగ అవకాశం కల్పిస్తామని, అందుకు అభ్యర్థులు ముందుకు రావాలని జిల్లా పరిషత్‌లో జరిగిన కౌన్సెలింగ్‌లో సూచించారు.


ఖాళీలు లేకనే నియామకాలు ఆగాయి : బండా నరేందర్‌రెడ్డి, నల్లగొండ జడ్పీ చైర్మన్‌

జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్టు పోస్టులు ఇప్పట్లో ఖాళీ అయ్యే అవకాశాలు లేకపోవడంతో నియామకాలు జరగడం లేదు. ఆఫీస్‌ సబార్టినేట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే వారందరికీ రెండు, మూడు నెలల్లోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ప్రతి ఒక్కరూ జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్టు పోస్టులు కావాలనడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కౌన్సెలింగ్‌ ద్వారా అభ్యర్థులు అర్థం చేసుకుంటారనే ఏర్పాటుచేయడం జరిగింది.


Updated Date - 2022-09-19T06:05:32+05:30 IST