50 పడకల బ్లాక్‌కు తాళం

ABN , First Publish Date - 2022-06-07T07:04:28+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు సౌకర్యాలు కల్పించాల్సిన అధికారే ఇష్టానుసారం వ్యవహరిస్తుండడంతో రోగులు ఇ

50 పడకల బ్లాక్‌కు తాళం
వరండాలో గర్భిణులు

మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వద్దే తాళాలు 

ఎమ్మెల్యే, అధికారులు అడిగినా తెరవని వైనం 

బెడ్స్‌ లేక రోగుల ఇబ్బందులు 

నల్లగొండ అర్బన్‌, జూన్‌ 6: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు సౌకర్యాలు కల్పించాల్సిన అధికారే ఇష్టానుసారం వ్యవహరిస్తుండడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 50పడకల బ్లాక్‌ను ఆక్రమించుకోవడంతో పడకలు సరిపోక రోగులు వరండాలో ఉండాల్సిన పరిస్థి తి నెలకొంది. జిల్లా మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నిర్వాకంతో మాతా శిశు ఆరోగ్యకేంద్రంలో పడకలు సరిపోని పరిస్థితి నెలకొంది. కాన్పు కోసం ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు ఆస్పత్రిలోని ఇరుకైన వరండాలో పడకలు వేశారు. ఈ విష యం ఆస్పత్రి అధికారులకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి ప్రతిరోజూ సుమారు 200 ఓపీ కేసులు, 30నుంచి 40వరకు ఇన్‌పేషంట్లు వస్తున్నారు. ప్రతిరోజూ 15నుంచి 20కాన్పులు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా ఈ ఆరోగ్య కేంద్రానికి కాన్పుల కోసం గర్భిణులు పెద్దఎత్తున వస్తున్నారు. వారి కోసం ప్రత్యేకంగా 150పడకలతో ఎం సీహెచ్‌ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. అధునాతన వైద్య సేవలు, సిబ్బం ది ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ప్రారంభమైన నాటి నుంచి గర్భిణులకు మెరుగైన వైద్యం అందడమే కాకుండా కాన్పుల సంఖ్య కూడా పెరిగింది. ఇంత రద్దీ ఉండే మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో ప్రిన్సిపాల్‌ నిర్వాకంతో పడకలు సరిపోని పరిస్థితి నెలకొంది. 

ప్రిన్సిపాల్‌ చేతిలో తాళాలు

మాతాశిశు ఆరోగ్య కేంద్రం మూడు ఫ్లోర్లతో కొనసాగుతోంది. మూడో ఫ్లోర్‌లో 50 పడకల వైశాల్యం గల బ్లాక్‌ మొత్తం ప్రిన్సిపాల్‌ ఆధీనంలో ఉంది. ఈ బ్లాక్‌కు తాళాలు వేసి ప్రిన్సిపాల్‌ వినియోగిస్తున్నట్లు ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. ఇటీవల నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. పడకలు సరిపోవడం లేదని పలువురు ఆయన దృష్టికి తీసు కొచ్చారు. ఎంసీహెచ్‌లో ఒక బ్లాక్‌ మొత్తం ప్రిన్సిపాల్‌ ఆఽధీనంలో ఉందని దీంతో రోగులకు పడకలు సరిపోవడం లేదని ఉద్యోగులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఎమ్మెల్యే ఆ బ్లాక్‌ను సందర్శించి తాళం వేసి ఉండడాన్ని గమనించి ఓపెన్‌ చేయాలని అడగగా అక్కడే ఉన్న ప్రిన్సిపాల్‌ తాళం తీయడానికి నిరాకరించినట్లు సమాచారం. మరోవైపు హెచ్‌ఆర్‌ఏ తీసుకుంటూ తనకోసం 50 పడకల బ్లాక్‌ను వాడుకోవడం ప్రిన్సిపాల్‌ వ్యవహార శైలిపై ఎంసీహెచ్‌ ఆస్పత్రి డాక్టర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పడకలు సరిపోక రోగులు ఇబ్బందులు ఒక బ్లాక్‌ మొత్తం ఆధీనంలోకి తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నా ప్రిన్సిపాల్‌ మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆస్పత్రి సిబ్బంది పేర్కొంటున్నారు. 

పడకలు సరిపోక అందని వైద్యం

మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో పడకలు సరిపోకపోవడంతో సరైన వైద్య చికిత్సలు అందని పరిస్థితి నెలకొంది. మొదటి, రెండో ఫ్లోర్‌లో గర్భిణులకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. మూడో ఫ్లోర్‌లో కొంత భాగం మెడికల్‌ కళాశాల విద్యార్థినులకు హాస్టల్‌ వసతి కల్పించారు. ఎంసీహెచ్‌ బ్లాక్‌లో ఇటీవల నూతనంగా గర్భిణులకు పలు వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. పడకలు సరిపోని కారణంగా ఈ సేవలను అనుకున్న మేర అందించలేకపోతున్నారు. యాంటినేటల్‌ వార్డు, ఫ్యామిలీ వార్డు, సెప్టిక్‌ వార్డుతో పాటు గర్భసంచికి సంబంధించిన వైద్య చికిత్సలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా సంతానం కోసం అధునాతన ఇన్‌ఫెర్టిలిటి సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. కానీ పడకలు సరిపోని కారణంగా ఈ వైద్య సేవలను అందించలేని పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులు స్పందించి ఎంసీహెచ్‌ ఆస్పత్రిలో గర్భిణులకు సరిపడా పడకలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. 

గతంలో ఉన్న ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశాల మేరకే 

గతంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్న శాంతాకుమారి ఆదేశాల మేరకే బ్లాక్‌ను అకాడమిక్‌ బ్లాక్‌గా ఏర్పాటుచేశాం. మెడికల్‌ కళాశాల బాలికల హాస్టల్‌ అనుసంధానంగా ఈ బ్లాక్‌ను కళాశాల ఆధీనంలో ఉంచాం. ఎంసీహెచ్‌ ఆస్పత్రిలో చాలా భాగం ఖాళీగా ఉంది. పడకలు సరైన ప్రదేశంలో అమర్చడంలో సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పడకలు అమర్చకుండా వరండాలో అమర్చుతున్నారు. అధికారులు దృష్టిసారించి పడకలను అమర్చాల్సి ఉంది. 

రాజకుమారి, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, నల్లగొండ 

Read more