చలో మునుగోడు

ABN , First Publish Date - 2022-08-12T06:09:38+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీలు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే నియోజకవర్గంలో ఓ బహిరంగ సభ నిర్వహించగా, బీజేపీ సభా ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ పార్టీ కీలకనేతలతో సమావేశమయ్యారు.

చలో మునుగోడు
హైదరాబాద్‌లో కార్యక్రమాల వివరాలు వెల్లడిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

జిల్లా కీలక నేతలతో నేడు తరుణ్‌చుగ్‌ భేటీ

రేపటి నుంచి కాంగ్రెస్‌ వరుస కార్యక్రమాలు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ): మునుగోడు ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీలు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే నియోజకవర్గంలో ఓ బహిరంగ సభ నిర్వహించగా, బీజేపీ సభా ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ పార్టీ కీలకనేతలతో సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పేరు ఖరారు పనిలో తలమునకలై ఉంది. అందుకు జిల్లా నాయకులతో సీఎం కేసీఆర్‌ సమావేశమైనట్లు తెలుస్తోంది. మొత్తానికి అన్ని పార్టీల నేతలు మునుగోడు బాటపట్టడం ప్రారంభించారు.


మునుగోడు అభ్యర్థి పేరుపై కసరత్తు చేస్తూనే నియోజకవర్గంలో కాంగ్రె్‌సకు తిరుగులేదన్న సంకేతాలు పంపేందుకు ఈ నెల 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వరుస కార్యక్రమాలకు పీసీసీ ప్రణాళిక సిద్ధంచేసింది. ఈ మేరకు నల్లగొండ, యాదాద్రి జిల్లాల పార్టీ అధ్యక్షులు శంకర్‌నాయక్‌, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మునుగోడు ఎన్నికల ఇన్‌చార్జి రాంరెడ్డి దా మోదర్‌రెడ్డితోపాటు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్‌ హైదరాబాద్‌లో గురువారం భేటీ అయ్యారు. ఆజాదీకా గౌరవ్‌ యాత్రలో భాగంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి భువనగిరి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించారు. ఈ నెల 13న ఆయన యాత్ర నారాయణపురం, చౌటుప్పల్‌ మండలాల్లో కొనసాగనుంది. మునుగోడు నియోజకవర్గంలోని ఈ రెండు మండలాల్లో నిర్వహించనున్న పాదయాత్రలో తాను పాల్గొంటానని, సంస్థాన్‌నారాయణపురం నుంచి చౌటుప్పల్‌ వరకు 15కి.మీ మేర పాదయాత్ర చేస్తానని, ఇది మునుగోడు ఉప ఎన్నికకు ఉపయోగపడుతుందని రేవంత్‌రెడ్డి సూచించడం, మిగిలిన సభ్యులు ఆమోదించడంతో షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 14వ నుంచి 17వ తేదీ వరకు వరుసగా మండలాలవారీగా పార్టీ నేతలతో పీసీసీ అధ్యక్షుడు సమావేశం కానున్నారు. ఈ నెల 14న నాంపల్లి, మర్రిగూడ, 15న విరామం ఇచ్చి 16న నాంపల్లి, చండూరు, 17న సంస్థాన్‌నారాయణపురం, చౌటుప్పల్‌ మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉదయం ఒక మండలం, సాయంత్రం మరో మండల నేతలతో పీసీసీ అధ్యక్షుడు, ఐదుగురు సభ్యుల కమిటీ నేతలు సమావేశం కానున్నారు. ఈ నెల 20వ తేదీన రాజీవ్‌గాంధీ జయంతిని మునుగోడు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో 175 గ్రామాలుండగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 మంది కాంగ్రెస్‌ కీలక నేతలకు ఒక్కో గ్రామాన్ని కేటాయించి వారి ఆధ్వర్యంలో గ్రామంలో ఒకరోజు పాదయాత్రకు షెడ్యూల్‌ ఖరారుచేశారు. ఈ కార్యక్రమంతో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలంతా మునుగోడులో ప్రత్యక్షంకానున్నారు.


21న చండూరులో రాజగోపాల్‌రెడ్డి సభ

ఉప ఎన్నికను బీజేపీ అధిష్ఠానంతోపాటు కోమటిరెడ్డి బ్రదర్స్‌ రాజకీయ జీవితానికి సవాల్‌గా మారడంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనులకు శ్రీకారంచుట్టారు. బీజేపీ కీలకనేతలు ఈటల రాజేందర్‌, వివేక్‌, జితేందర్‌రెడ్డి కీలక బాధ్యతలు తీసుకోనున్నారు. రాజేందర్‌ అత్తగారి ఊరు మునుగోడు మండలం పలివెల. ఈగ్రామం కేంద్రంగానే తన కార్యకలాపాలు నిర్వహించేందుకు రాజేందర్‌ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి బాధ్యతను మాజీ ఎంపీ వివేక్‌కు అప్పగించాల్సిందిగా రాజగోపాల్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర నేతలను కోరారు. ఎన్నికల నిర్వహణలో దిట్టగా పేరొందిన మహబూబ్‌నగర్‌ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి త్వరలో మునుగోడులో మకాం వేయనున్నారు. ఈ ముగ్గురితోపాటు మరో ఇద్దరితో కీలక కమిటీని త్వరలో బీజేపీ ఖరారు చేయనున్నట్లు తెలిసింది. 2లక్షల మందితో ఈ నెల 21వ తేదీన చౌటుప్పల్‌లో భారీ సమావేశం నిర్వహించాలని రాజగోపాల్‌రెడ్డి తొలుత నిర్ణయించుకున్నారు. చౌటుప్పల్‌ కంటే మునుగోడులో సభ నిర్వహిస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుందన్న ఆలోచనకు ఆయన వచ్చినట్లు తెలిసింది. మునుగోడులోనే సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని ఆ సమాచారాన్ని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో రాజగోపాల్‌రెడ్డి మంగళవారం పంచుకోగా, ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. 50 ఎకరాల్లో సభావేదిక ఏర్పాటుకు స్థలాన్ని ఖరారు చేసేందుకు ఈనెల 10వ తేదీన మునుగోడు, చండూరు మండలాల్లో బీజేపీ నేతలు గూడూరు నారాయణరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ కుంభం శ్రీనివా్‌సరెడ్డి పర్యటించనున్నారు. మిగతా చోట్ల పత్తి పంటలు పెద్దమొత్తంలో సాగులో ఉండడంతో చండూరు సమీపంలోనే 50 ఎకరాలు అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో కార్యకర్తలతో శుక్రవారం సమావేశం కానున్నారు.


కామ్రేడ్‌ల కసరత్తు

మునుగోడు నియోజకవర్గం ఏర్పడిన నాటినుంచి 12సార్లు ఎన్నికలు జరగ్గా ఐదుసార్లు సీపీఐ అభ్యర్థులు విజయం సాధించారు. ఉప ఎన్నిక నేపథ్యంలో  మునుగోడు నియోజకవర్గానికి చెందిన సీపీఎం కీలక నేతలతో ఈ నెల 10న ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం భేటీ అయ్యారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీఆర్‌ఎ్‌సకు విజయావకాశాలున్నాయని సీపీఎం నేతలు అంచనా వేసినట్టు సమాచారం. నియోజకవర్గంలో సీపీఎంకు సుమారు 9వేల ఓట్లు, సీపీఐకి సుమారు 13వేల ఓట్లు ఉంటాయని ప్రాథమికంగా గుర్తించారు. సీపీఎంకు ఐదుగురు సర్పంచ్‌లు, ఏడుగురు ఎంపీటీసీలు, నలుగురు కౌన్సిలర్లు ఉండగా, సీపీఐకి 12 మంది వరకు సర్పంచ్‌లు, 15 మంది వరకు ఎంపీటీసీలు ఉన్నట్లు సమాచారం. సీపీఐ, సీపీఎం కలిసే ఈ ఎన్నికల్లో దిగాలనే సూత్రప్రాయంగా ఓ అభిప్రాయానికి వచ్చారు. శుక్రవారం చండూరులో సీపీఐ నేతలతో భేటీ ఉండడంతో సమాచార సేకరణకు తమ్మినేని చౌటుప్పల్‌లో 10న సీపీఎం సమావేశాన్ని నిర్వహించారు. 13న సీపీ ఎం చౌటుప్పల్‌లో మరోమారు సమావేశం కానుంది. సీపీఐ, సీపీఎం కలిసి పోటీచే యాలని, ఎన్నిక నాటికి ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చి బీజేపీ బలం పుంజుకుంటే ఆ పార్టీని ఓడించే శక్తి దేనికి ఉంటుందో వాటికి మద్దతు తెలపాలని సీపీఎం నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లికంటి సత్యం పోటీకి ఆసక్తిగా ఉన్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. సీపీఐ, సీపీఎం మద్దతు కోసం టీఆర్‌ఎస్‌ నుంచి హరీ్‌షరావు ఇప్పటికే ఒక ప్రతిపాదన చేయగా, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం మద్దతివ్వాలని ఇరుపార్టీల నేతలను కోరారు.


జిల్లా నేతలతో సీఎం కేసీఆర్‌ భేటీ

పార్టీ అభ్యర్థి ఖరారు విషయంలో అధికార టీఆర్‌ఎ్‌సలో ఆందోళన మొదలైంది. మాజీ ఎమ్మెల్యే, మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వొద్దంటూ నియోజకవర్గానికి చెందిన సుమారు 40మంది ప్రజాప్రతినిధులు 20 రోజులుగా యుద్ధం చేస్తున్నారు. అధిష్ఠానం దృష్టికి సైతం సమస్యను తీసుకెళ్లారు. ఆయనతో ఎదురైన ఇబ్బందులను ఏకరువు పెట్టారు. అసమ్మతి నేతలను ప్రగతిభవన్‌లో సీఎంతో సమావేశ పరిచేందుకు బుధవారం రాత్రి ఏర్పాట్లు జరిగాయి. చివరి క్షణంలో సీఎం నిరాకరించడంతో వారంతా ఇంటిబాట పట్టారు. నల్లగొండ జిల్లాకు చెందిన కీలక నేతలు మంత్రి జగదీ్‌షరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ గురువారం సమావేశమయ్యారు. ప్రధానంగా అభ్యర్థి ఖరారు, ఇతర పార్టీల కదలికలు, కార్యాచరణ ప్రణాళికలపై వారితో సీఎం చర్చించినట్లు తెలిసింది.


బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిరసనలు

చండూరులో బీజేపీ ఈ నెల 21న భారీ సభ ఏర్పాటు చేస్తుండగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హాజరుకానున్నారు. అదే రోజు లేదా ముందు రోజు పెరిగిన వంటగ్యాస్‌ ధరలను నిరసిస్తూ ఖాళీ సిలిండర్లతో గ్రామగ్రామాన నిరసన వ్యక్తం చేసేలా కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్‌ పెద్దలు నిర్ణయించారు. అదేవిధంగా ఓటర్లను ఆకర్షించేందు కు నియోజకవర్గం లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పోడు భూముల సమస్య, కళాశాలల మంజూరు, నేత కార్మికుల ఆకలికేకలు, చర్లగూడెం నిర్వాసితులకు పరిహారం రాకపోవడం వంటి సమస్యలపై ఆందోళన నిర్వహించి జనంలోకి వెళ్లాలని పీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్‌ ప్రతిపాదించగా, సమావేశానికి హాజరైన సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రతీ మండలానికి, మునిసిపాలిటీకి అన్ని సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా ఐదు గురితో మండల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Read more