పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

ABN , First Publish Date - 2022-08-15T06:08:29+05:30 IST

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో నాలుగు రోజులుగా 26 క్రస్ట్‌ గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో పర్యాటకుల సందడి నెలకొంది.

పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
ప్రాజెక్ట్‌ నుంచి కిందికి ప్రవహిస్తున్న కృష్ణమ్మ

నాలుగో రోజూ 26 క్రస్ట్‌ గేట్ల నుంచి నీటి విడుదల 

పర్యాటకుల సందడి

నాగార్జునసాగర్‌, ఆగస్టు 14: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో నాలుగు రోజులుగా 26 క్రస్ట్‌ గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో పర్యాటకుల సందడి నెలకొంది. ఎగువన ఉన్న  శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్‌కు మొత్తం 3,76,383 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 584.90 అడుగులుగా(297.1467 టీఎంసీలు) ఉంది. సాగర్‌ నుంచి కుడి కాల్వ ద్వారా 8604 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 8629 క్యూసెక్కుల నీటిని ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 33130 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, వరద కాల్వ  ద్వారా 300 క్యూసెక్కులు, 26 క్రస్ట్‌ గేట్ల నుంచి 2,60,316 క్యూసెక్కులు మొత్తంగా 3,13,379 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరుస సెలవు దినాలు, నాగార్జునసాగర్‌ 26 క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో సాగర్‌ అందాలను తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. దీంతో సాగర్‌లో కొత్తవంతెన, బుద్ధవనం, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. 


మూసీకి నిలకడగా ఇన్‌ఫ్లో.. గేట్ల మూసివేత

కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వచ్చే వరద ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. గత 10 రోజులుగా ఎత్తి ఉంచిన ప్రాజెక్టు గేట్లను ఆదివారం మూసివేశారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు 507 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 645 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం కలిగిన మూసీ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 638.35అడుగులుగా ఉంది. 4.46టీఎంసీల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యంగల ప్రాజెక్టులో 2.85టీఎంసీల నీరు ఉంది.  

Updated Date - 2022-08-15T06:08:29+05:30 IST