వీఆర్‌ఏల మరణాలకు కేసీఆరే బాధ్యుడు

ABN , First Publish Date - 2022-09-12T05:17:26+05:30 IST

రాష్ట్రంలో 29 మంది వీఆర్‌ఏల మరణాలకు ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యుడని వైఎస్సాఆర్‌టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న అన్నారు. మండలంలోని ఉట్లపల్లిలో ఆత్మహత్య చేసుకున్న వీఆర్‌ఏ వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

వీఆర్‌ఏల మరణాలకు కేసీఆరే బాధ్యుడు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏపూరి సోమన్న

వైఎస్సాఆర్‌టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న


మిర్యాలగూడ, సెప్టెంబరు 11: రాష్ట్రంలో 29 మంది వీఆర్‌ఏల మరణాలకు ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యుడని వైఎస్సాఆర్‌టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న అన్నారు. మండలంలోని ఉట్లపల్లిలో ఆత్మహత్య చేసుకున్న వీఆర్‌ఏ వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 49రోజులుగా వీఆర్‌ఏలు వివిధ రూపాల్లో పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యోగం ఉంటుందో లేదో అనే ఆందోళనలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు, అసెంబ్లీలో సీఎం ఇచ్చిన హామీలకు ఉప్పొంగిన చిరు ఉద్యోగులు కేసీఆర్‌కు క్షీరాభిషేకాలు చేశారని అన్నారు. అయితే ఆ హామీలు కలగానే మిగిలాయని తెలిసి గుండెలు బాదుకుంటున్నారని అన్నారు. 54శాఖల సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేస్తూ అధికారులందరికీ గ్రామంలో చిరునామాగా మారిన వీఆర్‌ఏల న్యాయమైన కోర్కెలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పెద్ద దిక్కును కోల్పోయిన వీఆర్‌ఏ కుటుంబాల గోస టీఆర్‌ఎస్‌ నేతలను తప్పక వెంటాడుతుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించక పోతుడంటంతో ప్రజాచైతన్యం కోసం వైఎస్సార్‌టీపీ ఆధ్వర్యంలో 4,000కి.మీ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన వైఎస్‌ షర్మిల 2,000కి.మీ పూర్తి చేశారన్నారు. వీఆర్‌ఏల కుటుంబాలను వైఎస్సార్‌టీపీ అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి, నాయకులు దైద ప్రేమ్‌కుమార్‌, శ్రీనివాసులు, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


పోలీసు బందోబస్తు నడుమ ఆంత్యక్రియలు

మిర్యాలగూడ రూరల్‌: వీఆర్‌ఏ వెంకటేశ్వర్లు అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామం ఉట్లపల్లిలో పోలీసు బందోబస్తు నడుమ పూర్తయ్యాయి. అంత్యక్రియలకు వివిధ ప్రాంతాల నుంచి వీఆర్‌ఏలు భారీగా తరలివస్తారనే సమాచారంతో పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఆంక్షలున్నా రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు వీఆర్‌ఏలు అధిక సంఖ్యలో వెంకటేశ్వర్లు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కాగా, కొంతమందిని వాడపల్లి పోలీ్‌సస్టేషన్‌లో నిర్బంధించారు. కాగా, వెంకటేశ్వర్లు మృతదేహాన్ని జూలకంటి రంగారెడ్డి, ఏపూరి సోమన్న, వీఆర్‌ఏల రాష్ట్ర జేఏసీ నాయకుడు దాదేమియా తదితరులు సందర్శించి నివాళులర్పించారు. వారివెంట జేఏసీ నాయకులు వెంకటేశ్వర్లు, సైదులు, మాధవరావు, నాగరమేష్‌, జహంగీర్‌ ఉన్నారు.

Read more