జంప్‌జిలానీ

ABN , First Publish Date - 2022-12-02T00:16:12+05:30 IST

నిన్న ఓ పార్టీ.. ఇవ్వాళ మరో పార్టీ.. రేపు ఇంకో పార్టీ. నియోజకవర్గంలో నెల రోజులుగా కొనసాగుతున్న రాజకీయ చిత్రాలు చూసేవాళ్లకు వింతగా అనిపిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక మొదలు ఈ జంపింగ్‌ జిలానీల పరంపర కొనసాగుతోంది.

జంప్‌జిలానీ

రోజుకో పార్టీ మారుతున్న నేతలు

వలసల జోరు పెంచిన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ

ముందస్తు ఎన్నికలపై రాజకీయవర్గాల్లో చర్చ

నిన్న ఓ పార్టీ.. ఇవ్వాళ మరో పార్టీ.. రేపు ఇంకో పార్టీ. నియోజకవర్గంలో నెల రోజులుగా కొనసాగుతున్న రాజకీయ చిత్రాలు చూసేవాళ్లకు వింతగా అనిపిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక మొదలు ఈ జంపింగ్‌ జిలానీల పరంపర కొనసాగుతోంది. అధికార టీఆర్‌ఎ్‌సతోపాటు కాంగ్రెస్‌, బీజేపీలు చేరికల కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వినిపిస్తుండడంతో రాజకీయ సమీకరణలు రోజురోజుకూకొత్త మలుపులు తిరుగుతున్నాయి.

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి)

అన్నిపార్టీలు వలసలపై జోరు పెంచాయి. టికెట్‌పై ఆశలు పెట్టుకున్న నేతలు అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపి, తమబెర్తును ఖరారు చేసుకుని... కదన రంగంలోకి దూసుకుపోయేందుకు సిద్ధమవుతున్నారు. మరోసారి ఎలాగైనా సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యేలు ఒకవైపు, ప్రతిపక్షాల నేతలు ఈసారి గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, టికెట్‌ ఆశిస్తున్న వారంతా చేరికలపైనే ప్రత్యేక దృష్టి సారించారు. అధికార టీఆర్‌ఎ్‌సతోపాటు కాంగ్రెస్‌, బీజేపీ నేతలు పలు పార్టీల నుంచి వచ్చేవారిని ఆహ్వానిస్తూ, పార్టీ కండువాలు కప్పుతున్నారు. జిల్లాలో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలు పూర్తిస్థాయిలో ఉండగా, మునుగోడు (చౌటుప్పల్‌, సంస్థాన్‌నారాయణపురం, తుంగతుర్తి (మోత్కురు, అడ్డగూడూరు), నకిరేకల్‌లో (రామన్నపేట)నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల మాదిరిగానే, పార్టీల్లోకి చేరికలు ఉంటున్నాయి. స్థానికంగా రాజకీయ పరిస్థితులు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన మునుగోడు ఎన్నికలో టీఆర్‌ఎస్‌, బీజేపీలు పలు పార్టీలనుంచి వలస వచ్చే నేతలను ప్రోత్సహిస్తూ బరిలో దిగారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రె్‌సకు చెందిన 90శాతం ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నేతలు టీఆర్‌ఎస్‌, బీజేపీలో చేరారు. ఇదే తరహాలో ఇతర నియోజకవర్గాల్లోనూ పలుపార్టీల నుంచి ప్రజాప్రతినిధులను, పలుకుబడి ఉన్న నేతలపై ప్రత్యేక దృష్టి సారించి.. పార్టీల్లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ఆలేరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు వలసలను ప్రొత్సహిస్తున్నారు. ఏ సమావేశం జరిగినప్పటికీ, ఆయా ప్రాంతాల్లోని ఆయ పార్టీలకు చెందిన నాయకులకు కండువాలను కప్పి, పార్టీల్లో చేర్చుకుంటున్నారు.

నేతల్లో కొత్త టెన్షన్‌

రాజకీయ నేతలు తమ అవకాశాలకోసం అన్ని పార్టీలను తిరిగి వస్తున్నారు. ఆయా పార్టీల నేతలు పూటకో పార్టీ మారడంతో రాజకీయ నేతల్లో పరేషాన్‌ నెలకొంది. గత నెల 26న ఉదయం యాదగిరిగుట్ట మునిసిపాలిటీకి చెందిన కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ సహా ముగ్గురు కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, తదితరుల సమక్షంలో అధికార పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్‌ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అదేరోజు రాత్రి కాంగ్రె్‌సలోనే కొనసాగుతామని ఇద్దరు కౌన్సిలర్లు ప్రకటించారు. తాము అభివృద్ధి పనులపై చర్చించేందుకు మాత్రమే మంత్రి కేటీఆర్‌ను కలిశామని, కాంగ్రెస్‌ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జీ బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలోనే పనిచేస్తామన్నారు. యాదగిరిగుట్టలో రెండురోజులపాటు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ నేతల మధ్య హైడ్రామా కొనసాగింది. అదేవిధంగా రాజపేట మండలం నుంచి కూడా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. మరుసటి రోజు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పనిచేస్తామని ప్రకటించారు. మరోవైపు బీజేపీ నేత, ఆలేరు మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పడాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎ్‌సతోపాటు ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు, నేతలు కమలం గూటికి చేరుకుంటున్నారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా, డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి సమక్షంలో యాదగిరిగుట్టలో నిత్యం పలు పార్టీల నుంచి టీఆర్‌ఎ్‌సలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రె్‌సనేత బీర్ల అయిలయ్య, బీజేపీ నేత పడాల శ్రీనివాస్‌ ఆయా మండలాలు, గ్రామాల్లో పర్యటిస్తూ... పలు సమావేశాల్లో ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులను చేర్చకుంటున్న సందర్భాలూ ఉంటున్నాయి. అన్ని పార్టీల నుంచి కూడా నిత్యం చేరికలకు ప్రాధాన్యం ఇస్నున్నారు. నేతలు పూటకో పార్టీలోకి చేరుతుండటంతో టికెట్‌ ఆశిస్తున్న నేతల్లో ఉత్కంఠం నెలకొంది. ఎన్నికలు వచ్చేసరికి ఎవరు ఎటువైపు ఉంటారో వేచి చూడాల్సిందే.

అభివృద్ధిపై అధికార పక్షం.. హామీలపై ప్రతిపక్షం ప్రచారం

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికార పార్టీ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పథకాలను పల్లెలు, పట్టణాల్లో జరిగే కార్యక్రమాల్లో వివరిస్తున్నారు. ఎనిమిదేళ్లలో నియోజకవర్గాలు అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చెందాయని అధికార పక్షం అంటుండగా... టీఆర్‌ఎస్‌, బీజేపీలు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంకంటే కూడా ఇతర పార్టీల నేతల కొనుగోలుపైనే శద్ధ్ర చూపుతుందని కాంగ్రెస్‌ నేతలు ఘాటైన విమర్శలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన పలు హామీలను నెరవేర్చలేదని, అభివృద్ధి పనులకు నిధుల లేమీతో కుంటుపడుతున్నాయని విమర్శలు వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని, ఇచ్చిన హామీలతో పాటు ప్రభుత్వ లోపాలను ప్రజలకు ఎత్తిచూపుతున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతుండటంతో, అన్నిపార్టీలు కూడా విమర్శలకు పదును పెంచాయి.

Updated Date - 2022-12-02T00:16:14+05:30 IST