భువనగిరి పీఏసీఎస్‌లో అంతర్గత కలహాలు

ABN , First Publish Date - 2022-02-23T05:43:53+05:30 IST

భువనగిరి ప్రాథమిక వ్యవసా యపరపతి సంఘం (పీఏసీఎ్‌స)లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.

భువనగిరి పీఏసీఎస్‌లో అంతర్గత కలహాలు

అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదుతో వెలుగులోకి

యాదాద్రి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): భువనగిరి ప్రాథమిక వ్యవసా యపరపతి సంఘం (పీఏసీఎ్‌స)లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. సొసైటీలో అవకతవకలపై ఒక డైరెక్టర్‌ కలెక్టర్‌కు ఈ నెల 21న ఫిర్యాదుచేయగా, నిరాధార ఆరోపణలు చేసినందున అతడిని సస్పెండ్‌ చేస్తూ పాలకవర్గం మంగళవారం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.

భువనగిరి పీఏసీఎ్‌సలో చైర్మన్‌తో పాటు మెజార్టీ డైరెక్టర్లంతా అధికార పార్టీకి చెందినవారే ఉన్నారు. పీఏసీఎ్‌సలో అవినీతి, అక్రమాలు జరిగాయని, డైరెక్టర్లకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని చైర్మన్‌ నోముల పరమేశ్వర్‌రెడ్డితో పాటు సీఈవో రామాచారిపై పలువురు డైరెక్టర్లు కలెక్టర్‌కు ఈ నెల 21న ఫిర్యాదు చేశారు. దీనిపై నిగ్గు తేల్చాని జిల్లా సహకారశాఖ అధికారికి కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. విచారణ నిర్వహించేందుకు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ స్థాయి అధికారిని డీసీవో పరిమిళాదేవి నియమించారు. ఇదిలా ఉండగా పీఏసీఎస్‌ పాలకవర్గం మంగళవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన నమాత్‌పల్లి డైరెక్టర్‌ జిట్టా లక్ష్మారెడ్డిని సస్పెండ్‌ చేస్తూ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. నమాత్‌పల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఎక్కువ తూకం వేసి దానికి సంబంధించిన సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకున్నారని ఫిర్యాదు అందిందని, దీనిపై ఈ నెల 18న త్రిసభ్య కమిటీ విచారణ నిర్వహించిందని  చైర్మన్‌ పరమేశ్వర్‌రెడ్డి తెలిపారు. విచారణలో రైతుల వాంగ్మూలం ఆధారంగా డైరెక్టర్‌ అవినీతికి పాల్పడినట్టు పాలకవర్గం అభిప్రాయపడటంతో అతడిని సస్పెండ్‌ చేస్తూ ఏకగ్రీవంగా ఆమోదించినట్టు చైర్మన్‌ తెలిపారు. ప్రాథమిక సభ్యత్వం రద్దు చేస్తున్నట్టు తెలిపారు.

మెజార్టీ డైరెక్టర్లంతా అధికార పార్టీ వారే..

పీఏసీఎస్‌ చైర్మన్‌తోపాటు మెజార్టీ డైరెక్టర్లంతా అధికార పార్టీ టీఆర్‌ఎ్‌స కు చెందిన వారే ఉన్నారు. అయినా ఒకరిపై ఒకరు అవినీతి, ఆరోపణలపై ఫిర్యాదు చేసుకుంటుండటంతో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. సహకార సంఘం ఎన్నికల నుంచే భువనగిరి నియోజకవర్గంలోని ముఖ్య నేతల మధ్య వర్గపోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చైర్మన్‌, సీఈవో వారికి అనుకూలంగా ఉన్న డైరెక్టర్లతో సమావేశాలు నిర్వహించి, కీలక అంశాలపై అనుకూలంగా తీర్మానాలు చేసుకుంటున్నారని డైరెక్టర్లు జిట్టా లక్ష్మారెడ్డి, ఎం.మల్లేషం, ఎలిమినేటి నర్సిరెడ్డి, జి.ఎల్లమ్మ, ఎ.ప్రేమలత కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 2020, ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు చైర్మన్‌ నోముల పరమేశ్వర్‌రెడ్డి, సీఈవో రామాచారి కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పన పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద తేమ, ధాన్యం కొనుగోలు యంత్రాలు, టార్పాలీన్లను భువనగిరి మార్కెట్‌ కమిటీ ఉచితంగా ఇచ్చినా, వాటిని కొనుగోలు చేసినట్టు చూపి రూ.6,98,150 జేబుల్లో వేసుకున్నారని, ఇటీవల రిజిస్ట్రేషన్‌ కోసం, కార్యాలయం మరమ్మతులు, ఫర్నిచర్‌, మౌలిక వసతులు పేరుతో రూ.15లక్షల అవినీతి పాల్పడ్డారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం రచ్చకెక్కింది.

Updated Date - 2022-02-23T05:43:53+05:30 IST