ఈ ఏడాది పెరిగిన రుణ ప్రణాళిక

ABN , First Publish Date - 2022-12-12T23:25:38+05:30 IST

గతేడాది కంటే జిల్లా రుణాప్రణాళిక మొత్తాన్ని రూ.425 కోట్లు పెంచినట్లు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత కేశవ్‌ తెలిపారు. గత ఏడాది జిల్లాకు రూ.4329.77కోట్లు కేటాయించగా,

ఈ ఏడాది పెరిగిన రుణ ప్రణాళిక
రుణ ప్రణాళిక బుక్‌లెట్‌ను విడుదల చేస్తున్న కలెక్టర్‌ పాటిల్‌ హేమంత కేశవ్‌

గతంకంటే రూ.425 కోట్లు అధికం : కలెక్టర్‌

సూర్యాపేట(కలెక్టరేట్‌), డిసెంబరు 12 : గతేడాది కంటే జిల్లా రుణాప్రణాళిక మొత్తాన్ని రూ.425 కోట్లు పెంచినట్లు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత కేశవ్‌ తెలిపారు. గత ఏడాది జిల్లాకు రూ.4329.77కోట్లు కేటాయించగా, ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ.4755.41 కోట్లుగా నిర్ణయించినట్లు వివరించారు. నాబార్డు వార్షిక రుణప్రణాళిక బుక్‌లెట్‌ను కలెక్టరేట్‌లో సోమవారం ఆవిష్కరించి, మాట్లాడారు. రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ఎక్కువ మొత్తంలో కేటాయించినట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి రూ.2977.23 కోట్లు కేటాయించగా అందులో వ్యవసాయ మౌలిక సదుపాయాలకు రూ.226.64 కోట్లు, వ్యవసాయ అనుబంధరంగాలకు రూ.774.65 కోట్లు కేటాయించామని తెలిపారు. అదేవిధంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.457.39 కోట్లు, విద్యారంగానికి రూ.36 కోట్లు, గృహ రుణాలకు రూ.180కోట్లు, పునరుత్పాదకశక్తి రంగానికి రూ.678.25 కోట్లు, సామాజిక, మౌలిక సదుపాయాలకు రూ.357కోట్లు కేటాయించామన్నారు. ప్రణాళిక మేరకు బ్యాంకర్లు సకాలంలో వివిధ రంగాలకు రుణాలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహనరావు, డీఆర్‌డీవో కిరణ్‌కుమార్‌, ఏడీఏ రామారావునాయక్‌, ఎల్‌డీఎం బాపూజీ, ఏవో శ్రీదేవి పాల్గొన్నారు.

‘ప్రజావాణి’ దరఖాస్తులను పరిష్కరించాలి : కలెక్టర్‌

ప్రజావాణి దరఖాస్తులను అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత కేశవ్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను ఆయన స్వీకరించి, మాట్లాడారు.

ప్రజావాణిలో ఫిర్యాదు, ఒకేసారి 16 నెలల పింఛన

ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధికారులు పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో మునగాలకు చెందిన కళాకారుడు కలెక్టర్‌కు పెట్టుకున్న అర్జీతో 16 నెలల పింఛన అందింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మునగాల మండల కేంద్రానికి చెందిన సొల్లేటి నారాయణ కళాకారుల పింఛన కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సుమారు 16నెలలు గడుస్తున్నా పింఛన రాకపోవడంతో ప్రజావాణిలో దరఖాస్తు చేసి తన ఆవేదనను కలెక్టర్‌ పాటిల్‌ హేమంత కేశవ్‌కు మొరపెట్టుకున్నాడు. స్పందించిన కలెక్టర్‌ సంబందిత దరఖాస్తును పరిశీలించి పింఛన వచ్చేలా చర్యలు తీసుకోవాలని డీపీఆర్‌వో రమే్‌షకుమార్‌ను ఆదేశించారు. దీంతో హైదరాబాద్‌లోని సాంస్కృతిక శాఖ అధికారులకు దరఖాస్తు పంపించి వారి అనుమతితో నారాయణకు 16 నెలలకు సంబంధించి నెలకు రూ.3016 చొప్పున మొత్తం రూ.48,256లను కళాకారుడి బ్యాంకు ఖాతాలో జమ చేయించారు. దీంతో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కళాకారుడు నారాయణ కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-12-12T23:25:38+05:30 IST

Read more