ఆగని వర్షం.. నీట మునిగిన పంటపొలాలు

ABN , First Publish Date - 2022-10-01T06:38:25+05:30 IST

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని చెరువులు, కుంటలు అలుగు పోస్తున్నాయి. వరి పొలాలు, పత్తి తోటలు వరద నీటిలో మునిగి చెరువులను తలపిస్తున్నాయి.

ఆగని వర్షం.. నీట మునిగిన పంటపొలాలు
మోతె మండలం నామవరం పెద్ద చెరువు అలుగు వద్ద వరద

మోతె, సెప్టెంబరు 30: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని చెరువులు, కుంటలు అలుగు పోస్తున్నాయి. వరి పొలాలు, పత్తి తోటలు వరద నీటిలో మునిగి చెరువులను తలపిస్తున్నాయి. నామవరం పెద్ద చెరువుకు వరద పెరగడంతో మూడు అడుగుల మేర అలుగు పారతోంది. అలుగువద్ద చేపలు వెళ్లకుండా ఏర్పాటుచేసిన ఇనుప కంచె వద్ద వరద పోటెత్తుతోంది. వరదకు చెరువు ఆయకట్టు కింద ఉన్న 350 ఎకరాలు నీటిలో మునిగాయి. పత్తితోటల్లోకి వరద నీరు చేరింది. నామవరం నుంచి గుంజలూరుకు వెళ్లే రోడ్డు ధ్వంసమైంది. దీంతో రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొది విభలాపురం గ్రామానికి వెళ్లే మార్గంలో గండ్ల చెరువు వాగుకు వరద పెరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సిరికొండ, రావిపహడ్‌ గ్రామాల్లో పత్తి, వరిపొలాలు నీట మునిగాయి.

మూసీకి పోటెత్తిన వరద.. 8 గేట్ల ద్వారా నీటి విడుదల

సూర్యాపేటరూరల్‌: ఉమ్మడి నల్గొండ జిల్లాలో అతిపెద్ద రెండో ప్రాజెక్టుగా పెరొందిన మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తుంది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు మరింత వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని మూసీ డీఈ చంద్రశేఖర్‌ తెలిపారు. ప్రస్తుతం 10429 క్యూసెక్కుల నీరు ఇన్‌ప్లో రాగా, ప్రాజెక్టు భద్రతా దృష్యా ఇన్‌ప్లో తక్కువున్న 8 క్రస్టు గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి 21217.01 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 643.04 అడుగలు (4.04టీఎంసీలు)గా ఉంది. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం బట్టి నీటి విడుదల ఉంటుదని మూసీ అధికారులు తెలిపారు.


Updated Date - 2022-10-01T06:38:25+05:30 IST