మునుగోడులో సీపీఎం ద్విముఖ వ్యూహం

ABN , First Publish Date - 2022-09-11T05:40:54+05:30 IST

పశ్చిమబెంగాల్‌, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో బీజేపీతో ఢీ అంటే ఢీ అన్నట్టు తలపడుతున్న సీపీఎం, తెలంగాణలో బీజేపీని నిలువరించేందుకు అవసరమైన వ్యూహాలు రూపొందిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా కమ్యూనిస్టుల ప్రభావం ఉన్న నల్లగొండ, ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టాలని బీజేపీ యోచిస్తుండగా ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో అనేక అపోహలు ఉన్నా అధికార టీఆర్‌ఎ్‌సకు అండగా నిలిచి కమలనాథులకు అవకాశం లేకుండా చేయాలనే ఎత్తుగడతో సీపీఎం నేతలు ప్రణాళికలు రూపొందించారు.

మునుగోడులో సీపీఎం ద్విముఖ వ్యూహం

డబ్బు, మద్యానికి దూరంగా కార్యక్రమాలు 

 ఉమ్మడి జిల్లా నేతలంతా మకాం

నల్లగొండ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పశ్చిమబెంగాల్‌, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో బీజేపీతో ఢీ అంటే ఢీ అన్నట్టు తలపడుతున్న సీపీఎం, తెలంగాణలో బీజేపీని నిలువరించేందుకు అవసరమైన వ్యూహాలు రూపొందిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా కమ్యూనిస్టుల ప్రభావం ఉన్న నల్లగొండ, ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టాలని బీజేపీ యోచిస్తుండగా ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో అనేక అపోహలు ఉన్నా అధికార టీఆర్‌ఎ్‌సకు అండగా నిలిచి కమలనాథులకు అవకాశం లేకుండా చేయాలనే ఎత్తుగడతో సీపీఎం నేతలు ప్రణాళికలు రూపొందించారు. ఉప ఎన్నికలో మద్దతుకు సంబంధించి అధికారిక ప్రకటన చేసిన నేతలు క్షేత్రస్థాయిలో పనివిధానానికి సంబంఽధించి ద్విముఖ వ్యూహాన్ని సిద్ధం చేశారు. బీజేపీని నిలువరించాలన్న యోచనతో టీఆర్‌ఎ్‌సతో చేతులు కలిపినా వారి అలవాట్లు, సంప్రదాయాలు పార్టీ క్యాడర్‌పై పడకుండా చూసుకోవాలని నిర్ణయించారు. అందుకు ఉప ఎన్నికలో నేరుగా డబ్బు, మద్యం పంపిణీ, రవాణా వంటి అంశాలకు పూర్తిగా దూరంగా ఉండాలి కార్యకర్తలకు ఆదేశించారు. టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు రాగానే వారితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించాలని, సీఎం భారీ సభ నిర్వహించిన సందర్భంలో కీలక నేతలు హాజరు కావాలని నిర్ణయించారు. సీఎం, ఇతర నేతల సభలకు జనసమీకరణ నేపథ్యంలో వాహనాలు, బైక్‌ ర్యాలీల సందర్భంలో పెట్రోల్‌ పోయించుకోవడం వరకే పరిమితం కావాలని నేతలకు సూచించారు. మరో వైపు ఉమ్మడి జిల్లాకు చెందిన క్రియాశీల నాయకత్వాన్ని అంతా మునుగోడులో గ్రామగ్రామాన దింపాలని, పార్టీ క్యాడర్‌ చెదిరిపోకుండా నేతలకు గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. పార్టీ నేతలు ప్రత్యేకంగా గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ మద్దతు ఇచ్చిన టీఆర్‌ఎస్‌ గెలుపునకు కీలక అంశాలు ఏంటో గుర్తించి ఎప్పటికప్పుడు నివేదించాలి తీర్మానించారు. 


రేపటి నుంచి వారోత్సవాలు

ఈనెల 12 నుంచి 17వరకు సాయుధపోరాట వారోత్సవాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని సీఎం నిర్ణయించింది. కమ్యూనిస్టుల విస్తరణను అడ్డుకునేందుకే నాడు కేంద్రం సైన్యాన్ని పంపి నిజాంను లొంగదీసుకుందన్న అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. వజ్రోత్సవాల పేరుతో బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు ఖరారు చేయగా, అసలైన వారసులం తామే అంటూ సీపీఎం నేతలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలకు షెడ్యూల్‌ ఖరారు చేశారు. సాయుధ పోరాటంలో పాల్గొని ప్రస్తుతం ఉన్న వారికి సన్మానం, మృతిచెందిన పోరాట యోధుడి భార్య ఉంటే వారికి సన్మానం, స్తూపాలకు నివాళులు అర్పించడంతోపాటు బైక్‌ ర్యాలీలు నిర్వహించేందుకు ప్రణాళిక ఖరారు చేశారు. నల్లగొండ మండలం అప్పాజిపేటలోని ఎర్రబోతు రాంరెడ్డికి సన్మానం, ఆ గ్రామంలో సభ, మిర్యాలగూడ నియోజకవర్గంలో రావులపెంట లేదా తడకమళ్ల గ్రామంలో, నకిరేకల్‌ నియోజకవర్గం కట్టంగూరు మండలం చెరువు అన్నారంలో ముస్కు, పసునూరి వెంకటరెడ్డికి నివాళులు అర్పించాలని నిర్ణయించారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గలోని అల్వాల క్రాస్‌ రోడ్డులో అల్వాల నర్సింహారెడ్డి, మునుగోడు మండలం పలివెలలో కొండవీటి గుర్నానాథరెడ్డికి నివాళులు, చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో సభలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాలో బాలెంల ఇతర గ్రామాల్లో నివాళులు, ర్యాలీ నిర్వహించనున్నారు. ఈనెల 17న ముగింపు ఘనంగా ఏర్పాటుచేయాలని నిర్ణయించి కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సూర్యాపేట జిల్లా అర్వపల్లి, నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సభ నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏచూరి జనగామ జిల్లా నుంచి అర్వపల్లికి అక్కడి నుంచి మాడ్గులపల్లి మండల కేంద్రంలో నూతన సీపీఎం కార్యాలయ ప్రారంభం, ఆతర్వాత మిర్యాలగూడలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. 

Read more