ఆరో రోజు మహాలక్ష్మీదేవిగా కనకదుర్గాదేవి

ABN , First Publish Date - 2022-10-02T05:48:47+05:30 IST

దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా కనకదుర్గాదేవిని జిల్లా వ్యాప్తంగా మహాలక్ష్మీదేవిగా శనివారం అలంకరించారు.

ఆరో రోజు మహాలక్ష్మీదేవిగా కనకదుర్గాదేవి
కోదాడలో పూజల్లో పాల్గొన్న భక్తులు,

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా కనకదుర్గాదేవిని జిల్లా వ్యాప్తంగా మహాలక్ష్మీదేవిగా శనివారం అలంకరించారు. జిల్లా కేంద్రంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ దేవాలయం, రామలింగేశ్వరస్వామి దేవాలయం, శ్రీవేదాంత భజనమందిరం, శ్రీసంతోషిమాత దేవాలయం, కనకదుర్గా దేవాలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పంచామృతాభిషేకాలు, చండీహోమం, రుద్రహోమం పూజలు నిర్వహించి లలితా పారాయణాలు పఠించారు.  అదేవిధంగా వేంకటేశ్వరస్వామి దేవాలయంలో సహస్త్ర నామార్చనలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు నల్లాన్‌ చక్రవర్తుల వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో తిరుమంజనం నిర్వహించారు. అనంతగిరి మండలం అమీనాబాద్‌లో దుర్గాదేవి విగ్రహం వద్ద అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ముత్తినేని కోటేశ్వరరావు, చిత్తలూరి వెంకటేశ్వర్లు, రామినేని శ్రీను, సత్యనారాయణ, గురవయ్య పాల్గొన్నారు. కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో కుంకుమపూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం జరిగింది. కార్యక్రమంలో కోట తిరుపయ్య, జూకూరి అంజయ్య, హనుమంతురావు, సత్యం, కృష్ణమూర్తి, చారి, వీరేపల్లి రామారావు పాల్గొన్నారు. మఠంపల్లి మండల కేంద్రంలో పాటు మఠంపల్లి ఎస్సీకాలనీ, జామ్లాతండా, యాతవాకిళ్ళ, పెదవీడు, మట్టపల్లి తదితర గ్రామాలలో ఏర్పాటు చేసిన కనుకదుర్గ అమ్మవారికి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేరేడుచర్లలో ని విజయదుర్గా దేవాలయం, స్థానిక శివాలయంలో మహాలక్ష్మీదేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. విజయదుర్గా దేవాలయంలో అమ్మవారికి మొదటిసారి పూర్తిగా వెండి ఆభరణాలతో అలంకరించారు. నోట్ల దండలతో అమ్మవారిని పూజించారు. వెండి చీరతో అలంకరించారు. నేరేడుచర్ల రెండవ వార్డులో అన్నదానం నిర్వహించారు.   అర్వపల్లి  మండలం జాజిరెడ్డిగూడెంలో దుర్గామాత విగ్రహాం వద్ద అన్నదానం చేశారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపెల్లి మధుకర్‌రెడ్డి, గుడిపెల్లి సోమిరెడ్డి, నర్సింగ కృష్ణమూర్తి, కోటమర్తి వెంకన్న, రింగుబాలయ్య, నరేష్‌, నసీర్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

హుజూర్‌నగర్‌లో పూజల్లో పాల్గొన్న ఎంపీ ఉత్తమ్‌ 

హుజూర్‌నగర్‌ పట్టణంలోని 25వ వార్డు, సీతారాంనగర్‌లో నెలకొల్పిన దుర్గామాత మండపాల్లో నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో సంపత్‌రెడ్డి, సులువ చంద్రశేఖర్‌, వరలక్ష్మి, నాగరాజు, వెంకటేశ్వర్లు, అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.Read more