పోచంపల్లి మునిసిపల్‌ కమిషనర్‌పై ఎఫ్‌ఐఆర్‌

ABN , First Publish Date - 2022-09-10T05:37:01+05:30 IST

అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు భూదానపోచంపల్లి మునిసిపల్‌ కమీషనర్‌పై బాధితుడు రచ్చ బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

పోచంపల్లి మునిసిపల్‌ కమిషనర్‌పై ఎఫ్‌ఐఆర్‌

భూదానపోచంపల్లి, సెప్టెంబరు 9 : అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు భూదానపోచంపల్లి మునిసిపల్‌ కమీషనర్‌పై బాధితుడు రచ్చ బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు రచ్చ బాలకృష్ణ మాట్లాడుతూ.. తాను టైలర్‌ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నానని, తాను జమచేసి కొనుక్కున్న ప్లాట్‌లో మునిసిపల్‌ కమిషనర్‌ అన్యాయంగా కడీలను తొలగించి, అక్కడ మొక్కలు నాటించారని ఆవేదన వ్యక్తం చేశాడు.  కమిషనర్‌ ఎస్‌.భాస్కర్‌రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. భూదానపోచంపల్లి పట్టణంలోని సర్వేనెంబర్‌ 523/అలో ప్లాట్‌ నెం. 29/ఎ, 307 చదరగజాల విస్తీర్ణం గల ప్లాటు లక్ష్మీ ఎనక్లేవ్‌లో డాక్యుమెంట్‌ నెం.5317/2022, 6178/2022, 5318/2022 ద్వారా కొనుగోలు చేశానని బాలకృష్ణ తెలిపాడు. అయితే ఇట్టి ప్లాట్‌ను అక్రమంగా, దౌర్జన్యంగా ప్రభుత్వ స్థలమని పేర్కొంటూ మునిసిపల్‌ కమిషనర్‌ తన సిబ్బందితో స్వాధీనపర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అతడిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని భూదానపోచంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మునిసిపల్‌ కమిషనర్‌ ఎస్‌.భాస్కర్‌రెడ్డిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ విషయయమై మునిసిపల్‌ కమిషనర్‌ ఎస్‌.భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణ పరిధిలోని ప్రభుత్వ స్థలాలను పరిరక్షంచే బాధ్యత తనపై ఉందని తెలిపారు. పట్టణంలోని కుబేరా టౌనషి్‌ప, లక్ష్మీఎనక్లేవ్‌ వెంచర్‌లో అప్పట్లో గ్రామపంచాయతీకి దారాదత్తం చేసిన స్థలాన్ని తాము ఆక్రమించుకున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలోని స్థలాన్ని ఆక్రమించుకున్న రచ్చ బాలకృష్ణపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. అయితే ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనపై ఎఫ్‌ఐఆర్‌ చేసిన పోలీసులు ముందుగా ప్రభుత్వ అధికారినైన తనకు నోటీసు జారీ చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఈ విషయంపై న్యాయపరంగా ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. పై అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని తెలిపారు.


Read more