ధాన్యం లక్ష్యానికి దూరంగా..

ABN , First Publish Date - 2022-12-10T00:52:50+05:30 IST

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పినా పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్లకు జిల్లా అధికార యంత్రాంగం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు.

ధాన్యం లక్ష్యానికి దూరంగా..
తాళ్లఖమ్మంపహాడ్‌ ధాన్యం కొనుగోలు కేంద్రం

చేరుకోవడంలో అధికారులు తడబాటు

ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడమే కారణం

మార్కెట్లు, మిల్లులకు వెళ్తున్న రైతులు

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పినా పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్లకు జిల్లా అధికార యంత్రాంగం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. ముమ్మరంగా వరి కోతలు సాగుతున్న సమయంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో అధికారులు జాప్యం చేయడంతో రైతులు మిల్లుల బాటపట్టారు. అంతేగాక బయటి మార్కెట్‌లో ధాన్యానికి అధిక ధర వస్తుండటంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపైపు చూడటంలేదు.

- సూర్యాపేట సిటీ

వానాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా ఐకేపీ ఆధ్యర్యంలో 170, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 104 ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి అధికారులు తొలుత నిర్ణయించారు. చివరికి గతనెల జిల్లా వ్యాప్తంగా 259 కొనుగోలు కేంద్రాలు తెరిచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. ప్రారంభమైన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఈ నెల 6వ తేదీ నాటికి 32 కేంద్రాలను అధికారులు మూసివేశారు. మిగిలిన 227 కేంద్రాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ధా న్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 6,07,507 మెట్రిక్‌ టన్నులు సేకరించాలన్నది లక్ష్యంగా కాగా, ఈ నెల 6వ తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా 1,93,545 మెట్రిక్‌ టన్నులు మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేశారు. ప్రైవేటు మార్కెట్లలో ధాన్యానికి రూ.1,900 నుంచి రూ.2వేల వరకు ధర లభిస్తుండటంతో ఎక్కువమంది రైతులు అటే మొగ్గుచూపుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాల వైపు చూడటం లేదు.

11.89లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనా

వానాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా వరి సుమారు 4,86,833 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 11,89,807 మెట్రిక్‌ టన్నుల ధా న్యం దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. వచ్చిన దిగుబడి లో జిల్లా గ్రామీణాభివృద్ధి, సివిల్‌ సప్ల య్‌ శాఖల ఆధ్వర్యంలో ఐకేపీ, పీఏసీఎస్‌ కేంద్రాల ద్వారా 6,07,507 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించా రు. వ్యవసాయాధికారులు వేసిన అంచనాకు అనుగుణంగా దిగుబడి వచ్చిన, కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణలో మాత్రం అధికారులు లక్ష్యానికి దూరంగా ఉన్నారు.

వేగంగా ధాన్యం డబ్బులు చెల్లింపులు

ధాన్యం సేకరణలో వెనుకబడిన జిల్లా అధికార యంత్రాంగం ధా న్యం చెల్లింపుల విషయంలో మాత్రం ముందు వరసలో ఉంది. ఈ నెల 6వ తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా 32,174 మంది రైతుల నుంచి 1,93, 545.040 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసి న ధాన్యం విలువ రూ.397,43,07,888 వరకు ఉంది. 32,174 మంది రైతుల బ్యాంకు ఖాతాలో రూ.296,29,42,560 అధికారులు జమ చేశార ు. మిగిలిన రూ.101,13,65,328 ఆన్‌లైన్‌ చేయనున్నారు. నగదు చెల్లింపులు దాదాపు 74.55 శాతం పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

ఆలస్యంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

ఈ ఏడాది వానాకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో జిల్లా అధికార యంత్రాంగం కొంత జాప్యం చేసింది. సాధారణంగా జిల్లాలో అక్టోబరు మొదటి వారం నుంచే వరి కోతలు ముమ్మరంగా ప్రారంభమవుతాయి. కాగా, ఈ సారి వరికోతలు మొదలయ్యే నాటికి జిల్లాలో ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించలేదు. కోసిన పంటను రోజుల తరబడి ఇంటి వద్ద ఆరబెట్టుకునే పరిస్థితి రైతులకు లేకపోవడంతో, కోసిన ధాన్యాన్ని కోసినట్లే సమీపంలో ఉన్న మిల్లులకు, వ్యవసాయ మార్కెట్లకు తరలించారు. అక్టోబరు నెల మొత్తం పంట చేతికి వచ్చిన రైతులందరూ మిల్లుల వైపు మొగ్గు చూపారు. దీంతో జిల్లాలో 50శాతం పంట మిల్లులకు, మార్కెట్లకు తరలింది. జిల్లా అధికారుల నవంబరు మొదటి వారంలో నెమ్మదిగా ధాన్యం సేకరణ కేంద్రాలను ప్రారంభించడం మొదలు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా 274 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నవంబరు చివరినాటికి 259 కేంద్రాలు మాత్రమే ప్రారంభించారు. డిసెంబరు మొదటివారం నాటికి ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వైపు రైతులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 32 మూసివేశారు. మిగిలిన 227 ధాన్యం కొనుగోలు కేంద్రాలను రోజుకు పదుల సంఖ్యలో మూసివేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ప్రైవేటు మార్కెట్‌లో ధర ఉండటమే కారణం : రాంపతి నాయక్‌, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌

ప్రైవేటు మార్కెట్‌లో అధిక ధర లభిస్తుండటంతో ఎక్కువమంది రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు. ప్రైవేటు మిల్లుల వద్ద క్వింటాకు రూ.2వేలకు పైగా ధర వస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కంటే వ్యవసాయ మార్కెట్‌, మిల్లుల వద్దనే ఎక్కువ ధాన్యం కనిపిస్తోంది. ప్రైవేటులో ఎక్కువ ధర ఉండటంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో లక్ష్యం మేర ధాన్యం కొనుగోలు జరగడంలేదు.

Updated Date - 2022-12-10T00:52:57+05:30 IST