కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి

ABN , First Publish Date - 2022-10-01T05:29:24+05:30 IST

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని జడ్పీ వైస్‌ చైర్మన్‌ ధనావత్‌ బీకూనాయక్‌ అన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ వైస్‌ చైర్మన్‌ బీకూనాయక్‌

 స్థాయీ సంఘం సమావేశంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ బీకూ నాయక్‌

భువనగిరి రూరల్‌, సెప్టెంబరు 30: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని జడ్పీ వైస్‌ చైర్మన్‌ ధనావత్‌ బీకూనాయక్‌ అన్నారు. శుక్రవారం జడ్పీ కార్యాలయంలో మూడో(వ్యవసాయం) స్థాయీ సంఘం సమావేశం బీకూనాయక్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 290 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని రైతులు పండించిన ధాన్యం కేంద్రాలకు తీసుకువచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు నష్టపోకుండా నిబంధనల మేరకు కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. ఆకస్మిక తనిఖీలు చేపట్టి జిల్లాలో అనుమతులు లేని క్రషర్లపై చర్యలు చేపట్టాలన్నారు. ఈ విషయంలో మైనింగ్‌ అధికారులు రెవెన్యూ, పోలీసుల సహకారం తీసుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాల్టాను ఉల్లంఘించి బోరుబావులు తవ్వుతున్నారని జడ్పీటీసీ సభ్యులు సుబ్బూరు బీరుమల్లయ్య సమావేశం దృష్టికి తీసుకురాగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భూగర్భజల శాఖ డీడీ జ్యోతికుమార్‌ అన్నారు. స్ర్తీ శిశుసంక్షేమ స్థాయీ సంఘం సమావేశం గోలి ప్రణీత పింగల్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అదనపు పోషక విలువలు కలిగిన పోషకాహారాన్ని అందిస్తోందన్నారు. మెనూ ప్రకారం కేంద్రాలలో ఆహారం పంపిణీ జరిగే విధంగా సీడీపీవోలు, సూపర్‌వైజర్లు చర్యలు తీసుకుని, కేంద్రాల నిర్వహణను మెరుగుపరచాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్‌ సదుపాయం కల్పించేందుకు కృషి చేయాలన్నారు. సఖి కేంద్రానికి అందుతున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సమావేశంలో జడ్పీ డిప్యూటీ సీఈవో బి.శ్రీనివా్‌సరావు, డీఏవో కె.అనురాధ, డీసీవో పరిమళదేవి, డీఎంవో సభిత, డీసీఎ్‌సవో శ్రీనివా్‌సరెడ్డి, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్‌ వి.కృష్ణ, ఐసీడీఎస్‌ పీడీ కేవీ.కృష్ణవేణి, సఖి కోఆర్డినేటర్‌ లావణ్య, మైనింగ్‌ ఏడీ వెంకటరమణ, భూగర్భజల శాఖ డీడీ జ్యోతికుమార్‌, పౌరసరఫరాల సూపరింటెండెంట్‌ శ్రీనివా్‌సరెడ్డి, రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఉదయం జరగాల్సిన సాంఘిక సంక్షేమం స్థాయీ సంఘం సమావేశం వాయిదాపడినట్లు జడ్పీ అధికారులు తెలిపారు.  


Updated Date - 2022-10-01T05:29:24+05:30 IST