ప్రయోగాత్మకంగా అధిక సాంద్రత పత్తి

ABN , First Publish Date - 2022-07-18T06:00:14+05:30 IST

రాష్ట్రంలో ప్రభుత్వం అధిక సాంద్రత పత్తి సాగుకు శ్రీకా రం చుట్టింది. అధిక సాంద్రత పత్తి సాగుతో దిగుబడి ఎక్కు వ రావడంతో పాటు ఒకే సారి పంట (సింగిల్‌ పికింగ్‌) చేతికి రానుంది. ఈ సాగుకు పత్తి విత్తనాలు ఎక్కువగా వాడుతున్నందున ప్రభుత్వం ఎకరాకు రూ.4వేల ఆర్థిక సహాయం అందించి సాగును ప్రోత్సహిస్తోంది.

ప్రయోగాత్మకంగా అధిక సాంద్రత పత్తి
మోత్కూరు మండలం అనాజిపురంలో రైతు రోషిరెడ్డి సాగుచేసిన అధిక సాంద్రత పత్తి మొక్కలను పరిశీలిస్తున్న ఏఈవో గోపీనాథ్‌

ఉమ్మడి జిల్లాలో 4295 ఎకరాలు సాగుకు ఎంపిక

విత్తే సీజన్‌ ముగిసిందంటున్న రైతులు


మోత్కూరు:  రాష్ట్రంలో ప్రభుత్వం అధిక సాంద్రత పత్తి సాగుకు శ్రీకా రం చుట్టింది. అధిక సాంద్రత పత్తి సాగుతో దిగుబడి ఎక్కు వ రావడంతో పాటు ఒకే సారి పంట (సింగిల్‌ పికింగ్‌) చేతికి రానుంది. ఈ సాగుకు పత్తి విత్తనాలు ఎక్కువగా వాడుతున్నందున ప్రభుత్వం ఎకరాకు రూ.4వేల ఆర్థిక సహాయం అందించి సాగును ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే వానాకాలం సీజన్‌లో వర్షాలు కురవక ముందే రైతులు పొడి దుక్కి దున్ని పత్తి విత్తనాలు విత్తారు. వర్షాలకు అవి మొలకెత్తగా, ప్రభుత్వం ఆలస్యంగా ఈ సాగుకు శ్రీకారం చుట్టడంతో ఎంపిక చేసిన మండలాల్లో ఏఈవోలు అక్కడక్కడ రైతుల చేత ఒక ఎకరం చొప్పున అధిక సాంద్రత పత్తి సాగు చేయిస్తున్నారు.


ఉమ్మడి జిల్లాలో 4,295 ఎకరాల్లో అధిక సాంద్రత పత్తి సాగుకు ప్రభుత్వం నిర్ణయించింది.జిల్లాలో 100ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 3,895, సూర్యాపేట జిల్లాలో 300ఎకరాల చొప్పున సాగవుతోంది. జిల్లాలో వంద ఎకరాల్లో పత్తిసాగు చేసేందుకు మోత్కూరు,ఆలేరు, చౌటుప్పల్‌,భువనగిరి మం డలాలను ఎంపిక చేయగా, సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి,మోతె,మునగాల, ఆత్మకూరు (ఎస్‌), పెన్‌పహాడ్‌, నాగా రం మండలాలను,నల్లగొండ జిల్లాలో 18మండలాలను ఎం పిక చేశారు. మోత్కూరు మండలంలో అనాజిపురంలో రోషిరెడ్డి,వల్లందాసు వెంకటయ్య,యాదయ్య, మోత్కూరులో జిట్ట రాములు ఒక్కోఎకరంలో అధిక సాంద్రత పత్తి సాగు చేశారు.


ఎంపిక చేసిన విత్తనాలతోనే సాగు

అధిక సాంద్రత పత్తి సాగుకు ఎంపిక చేసిన కంపెనీల పత్తి విత్తనాలనే వాడుతున్నారు. నూజివీడు సీడ్స్‌కు చెం దిన రాశి-7788, ఆర్‌సీహెచ్‌-665 విత్తనాలనే ఎంపిక చేశా రు. అధిక సాంద్రత పత్తి సాగుకు ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడం, పత్తి విత్తనాలు విత్తే సీజన్‌ ముగియడంతో అధిక సాంద్రత పత్తి సాగుకు రైతులు అంతగా ముందుకు రాలేదని అధికారులు తెలిపారు.


సాగు ఇలా..

సాధారణంగా పత్తిసాగుకు 450గ్రాముల రెండు ప్యాకెట్ల విత్తనాలు వినియోగిస్తారు. దీంతో ఎకరాకు సుమారు 7,500 మొక్కలు వస్తాయి. అధిక సాంద్రత పత్తి సాగులో ఐదు ప్యాకెట్ల విత్తనాలు వాడుతున్నారు. ఎకరాకు సుమారు 25వేల మొక్కలు వస్తాయి. సాళ్ల మధ్య 80సెం.మీ దూరం, మొక్కల మధ్య 15సెం.మీ దూరం ఉండేలా, సాళ్ల మధ్య 90 సెం.మీ దూరం ఉంటే, మొక్కల మధ్య 15సె.మీ దూరం ఉండేలా విత్తనాలు విత్తాలి. మొక్కల ఎదుగుదల కోసం 45 రోజులకు ఒకసారి మెఫిక్వాట్‌క్లోరైడ్‌ లీటరు నీటికి 1.5 ఎంఎల్‌ చొప్పున కలిపి, 65 రోజులకు రెండో సారి లీటరు నీటికి 2ఎంఎల్‌ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఐదు నుంచి ఐదున్నర మాసాల్లో పంట చేతికి వస్తుంది. గులాబీ పురుగు ఆశించక ముందే పంట చేతికి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సాగుతో దిగుబడి పెరిగి రైతుకు అధిక లాభాలొస్తాయంటున్నారు. 


ఎకరాకు రూ.4వేలు సాయం

అధిక సాంద్రత పత్తి సాగులో మూడు ప్యాకెట్ల విత్తనాలు అదనంగా అవసరమవుతాయి. విత్తడానికి కూలీలు కూ డా ఎక్కువే కావాలి. దీంతో ఆర్థిక భారం రైతు పడకుండా ఎకరాకు రూ.4వేల సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ సాగు మంచి ఫలితాన్నిస్తే వచ్చే ఏడాది నుంచి రైతులంతా ఇదే పద్ధతిలో సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు భావిస్తున్నారు.


రైతులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు : అనురాధ, డీఏవో

అధిక సాంద్రత పత్తి సాగుతో అధిక దిగుబడి వస్తుంది. సాధారణ సాగుకంటే లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వం ఎకరాకు రూ.4వేల ఆర్థిక సహాయం ఇస్తోంది. పంట మొత్తం ఒకే సారి చేతికి (సింగిల్‌ పికింగ్‌) వస్తున్నందున పత్తి తీసే కూలీల ఖర్చుకూడా తగ్గుతుంది. జిల్లాలో 100ఎకరాల్లో ప్రయోగాత్మకంగా అధిక సాంద్రత పత్తి చేయాలన్నది లక్ష్యం, కాగా దీన్ని పూర్తిచేశాం. రైతులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు.


Read more