యాదగిరిక్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణం

ABN , First Publish Date - 2022-07-18T06:01:56+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి సాధారణంగా కనిపించింది. ఆషాఢమాసం, లష్కర్‌లో బోనాలు కొనసాగుతుండడంతో వారాంతమైనా భక్తుల కోలాహలం అంతగా కనిపించలేదు.

యాదగిరిక్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణం
స్వామివారికి నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

స్వామి వారికి ఘనంగా నిత్య పూజలు

హరేరామ హరేకృష్ణ మూమెంట్‌ సభ్యుల భజనలు


యాదగిరిగుట్ట, జూలై 17: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి సాధారణంగా కనిపించింది. ఆషాఢమాసం, లష్కర్‌లో బోనాలు కొనసాగుతుండడంతో వారాంతమైనా భక్తుల కోలాహలం అంతగా కనిపించలేదు. దర్శనానంతరం భక్తులు ఆలయ తిరువీధులు, ఘాట్‌రోడ్‌, పెద్దగుట్ట, రాయగిరి చెరువు ప్రాంతంలోని గార్డెన్లలో సేదతీరారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ భక్తుల సందడి తగ్గింది. కొండపైన భక్తులు సేదతీరేందుకు సరైన ప్రాంతాలు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. కాగా, వివిధ విభాగాల ద్వారా భక్తుల నుంచి రూ.26,17,410 ఆదాయం ఆలయ ఖజానాకు సమకూరింది.


స్వామికి ఘనంగా నిత్యారాధనలు

స్వయంభు పాంచనారసింహుడికి నిత్యపూజా కైంకర్యాలు ఆదివారం ఘనంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం, బిందెతీర్థంతో నిత్యారాధన, గర్భాలయంలోని స్వయంభువులకు, సువర్ణ ప్రతిష్టా అలంకారమూర్తులకు నిజాభిషేకం నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో తులసీ దళాలతో అర్చించారు. అష్టభుజిప్రాకార మండపంలో హోమం, నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు కొనసాగాయి. ముఖమండపంలో సువర్ణ పుష్పార్చనలు, అష్టోత్తరాలు నిర్వహించారు. అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరస్వామికి, ముఖమండపంలో స్ఫటికమూర్తులకు నిత్య పూజలు, కొండకింద గండి చెరువు సమీపంలోని దీక్షాపరుల మండపంలో సత్యనారాయణస్వామి వ్రతపూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. ఇదిలా ఉండగా, హరేరామ హరేకృష్ణ మూమెంట్‌ సంస్థకు చెందిన సభ్యులు గుట్ట ఆలయ తిరువీధుల్లో భజనలు, ఆటపాటలతో హోరెత్తించారు. వర్షం కురుస్తున్నా ఆలయ తిరువీధుల్లో వారి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా, ఆలయ ఉద్ఘాటన పూర్తయి మూడు నెలలైనా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొండకింద కల్యాణకట్ట, కొండపైన దర్శన క్యూకాంప్లెక్స్‌తో పాటు ప్రధానాయల తూర్పు రాజగోపురం ఎదుట వీవీఐపీ దర్శనం టికెట్‌ కౌంటర్లు ఉన్నాయి. కాగా, ఆదివారం మధ్యాహ్నం తూర్పు రాజగోపురం ఎదుట ఉన్న వీవీఐపీ టికెట్‌ కౌంటర్‌లో సిబ్బంది అందబాటులో లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. గుట్టకు వికారాబాద్‌ నుంచి వచ్చిన భక్తుడు చరణ్‌కు బస్‌బే వద్ద ఫిట్స్‌ వచ్చాయి. అతడు కుటుంబ సభ్యులు ఐదుగురితో కలిసి కొండపైకి ఆర్టీసీ బస్సులో రాగా, బస్సు దిగి దర్శనాలకు వెళ్తున్న సమయంలో ఫిట్స్‌ వచ్చాయి. బస్‌బే వద్ద విధులు నిర్వహిస్తున్న హోమ్‌గార్డు సత్యనారాయణ గమనించి 108కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది సకాలంలో కొండపైకి చేరుకుని క్షతగాత్రుడికి ప్రథమ చికిత్సచేసి భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే కొండపైన ప్రథమ చికిత్స చేసేందుకు ఆస్పత్రి లేకపోవడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

Read more