అంబేడ్కర్‌ విగ్రహాన్ని అవమానించారని ఆందోళన

ABN , First Publish Date - 2022-09-11T06:00:04+05:30 IST

హుజూర్‌నగర్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి అవమానం జరిగింది. నిబంధనలు, అనుమతులు లేవనే సాకుతో ఆర్‌అండ్‌బీ అధికారులు అంబేడ్కర్‌ విగ్రహాన్ని హుజూర్‌నగర్‌లోని గోదాములో వేశారు.

అంబేడ్కర్‌ విగ్రహాన్ని అవమానించారని ఆందోళన
గోదాములో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం

విగ్రహాన్ని ఆర్‌అండ్‌బీ గోదాముకు తరలించిన అధికారులు 

హుజూర్‌నగర్‌, సెప్టెంబరు 10: హుజూర్‌నగర్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి అవమానం జరిగింది. నిబంధనలు, అనుమతులు లేవనే సాకుతో ఆర్‌అండ్‌బీ అధికారులు అంబేడ్కర్‌ విగ్రహాన్ని హుజూర్‌నగర్‌లోని గోదాములో వేశారు. ఈ విషయంపై పలు పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మఠంపల్లి మండలకేంద్రంలో అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా మెయిన్‌ రోడ్డులో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దీనికి కొంతమంది నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆర్‌అండ్‌బీ అధికారులు అనుమతులు లేవనే సాకుతో హుజూర్‌నగర్‌ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వెనుక ఉన్న గోదాముకు అంబేడ్కర్‌ విగ్రహాన్ని తరలించి, విగ్రహం కనబడకుండా పట్టాలు కప్పివేశారు. ఈ విషయంపై మూడు నెలలుగా చర్చ జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. విగ్రహాన్ని కిందపడవేయడంతో కొంతమంది నాయకులు, ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా హుజూర్‌నగర్‌లోని గెస్ట్‌హౌ్‌సలో బీఎస్పీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ గెస్ట్‌ హౌస్‌ వెనుక ఆర్‌అండ్‌బీ గోదాం ఉండగా, అక్కడ అంబేడ్కర్‌ విగ్రహాన్ని అవమానకర రీతిలో పడవేయడంతో బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు కొండమీది నర్సింహారావు, జిల్లా ఇన్‌చార్జి దాసరి శ్రీనివాస్‌, రాష్ట్ర ఈసీ సభ్యుడు పిల్లుట్ల రఘు అభ్యంతరం తెలిపారు. ఈ విషయాన్ని వారు మీడియాకు సమాచారం ఇచ్చారు. విగ్రహాన్ని అవమానకర రీతిలో పడవేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ స్వలాభాల కోసం కొంతమంది నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తే అంబేడ్కర్‌ విగ్రహాన్ని తొలగించడంతో పాటు గోదాములో కిందపడవేయడం సరైన విధానం కాదని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకుడు ఇరుగు పిచ్చయ్య అన్నారు. కాగా, మఠంపల్లి మండల కేంద్రంలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని కొంతమంది నాయకులు ఏర్పాటు చేశారని, దీనికి అనుమతులు లేకపోవడంతో హుజూర్‌నగర్‌ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సలోని గోదాముకు విగ్రహాన్ని తరలించామని, విగ్రహానికి కింద బేస్‌మెంట్‌ సరిగా లేకపోవడంతో పక్కన పెట్టామే తప్ప అవమానించలేదని, విగ్రహానికి గోడౌన్‌లో రక్షణ కల్పిస్తామని, హుజూర్‌నగర్‌ ఆర్‌అండ్‌బీ జేఈ శివకుమార్‌ తెలిపారు.

Updated Date - 2022-09-11T06:00:04+05:30 IST