‘అక్షర’ ఫైనాన్స్‌ బాధితుల ఆందోళన

ABN , First Publish Date - 2022-06-07T06:29:35+05:30 IST

చిట్టీ డబ్బుల కోసం నెలల తరబడి తిరుగుతున్నా చెల్లించడం లేదని అక్షర ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థ బాధితులు ఆందోళనకు దిగారు.

‘అక్షర’ ఫైనాన్స్‌ బాధితుల ఆందోళన
ఫైనాన్స్‌ కార్యాలయానికి తాళం వేస్తున్న బాధితులు

సంస్థ ప్రాంతీయ కార్యాలయానికి తాళం వేసిన సభ్యులు 

న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు

మిర్యాలగూడ అర్బన్‌, జూన్‌ 6: చిట్టీ డబ్బుల కోసం నెలల తరబడి తిరుగుతున్నా చెల్లించడం లేదని అక్షర ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థ బాధితులు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని సాగర్‌రోడ్డుపైగల సంస్థ ప్రాంతీయ కార్యాలయానికి సోమవారం తాళం వేశారు. పట్టణానికి చెందిన పలువురు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్షర ఫైనాన్స్‌ సంస్థ నిర్వహిస్తున్న రూ.5లక్షల నుంచి రూ.10లక్షల విలువైన చిట్టీల్లో పదుల సంఖ్యలో సభ్యులు ఉన్నారు. సంస్థ నిబంధనల మేరకు నెలవారీగా చిట్టీ డబ్బులు చెల్లిస్తున్నామని బాధితులు తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో సు మారు పదిమంది సభ్యులు చిట్టీపాట దక్కించుకున్నారు. అప్పట్లో వీరందరికీ సంస్థ ప్రతినిధులు వాయిదా తేదీతో కూడిన చెక్కులను జారీచేశారు. ఏడునెలలు గడిచిపోతున్నా నేటికీ చెక్కులు బ్యాంకుల్లో చెల్లకపోవడంతో తమ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఇబ్బందిపడాల్సి వస్తోందని బాధితులు వాపోయారు. పలుమార్లు ప్రాంతీయ కార్యాలయ సిబ్బందిని కలిసి సమస్య పరిష్కరించాలని కోరుతున్నా పట్టించుకోవడంతో వారిని నిలదీశారు. చిట్టీల వాయిదా చిట్టీడబ్బుల చెల్లింపులో ఆలస్యమైతే మాత్రం లీగల్‌ నోటీసులు ఎందుకు జారీ చేశారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిట్‌ఫండ్‌లో అనేకమంది దినసరి కార్మికులు, బడ్డీకొట్టు నిర్వాహకులు, చిరువ్యాపారులు సభ్యులుగా ఉన్నారు. అయితే చిట్టీపాట దక్కించుకున్న సభ్యులకు పూర్తి స్థాయిలో నగదు చెల్లించడం లేదని, కేవలం 25నుంచి 40శాతం మాత్రమే చెల్లింపులు జరిపి, మిగతా నగదు కోసం నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని బాధితులు తెలిపారు. నెలల తరబడి వాయిదా వేస్తున్న తమ చిట్టీడబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ప్రాంతీయ కార్యాల యానికి తాళం వేసి ఆందోళనకు దిగారు. అనంతరం పలువురు బాధితులు టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుపై విచారణ చేస్తున్నట్లు సీఐ నిగిడాల సురేష్‌ తెలిపారు. 

Read more