కమీషన్‌ రాక పరేషాన్‌

ABN , First Publish Date - 2022-10-03T05:40:35+05:30 IST

ప్రభుత్వం ఏటా పీఏసీఎస్‌, ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి, వాటి నిర్వహణకుగాను నిర్వాహకుల కు కమీషన్‌ ఇస్తుంది. అయితే రెం డేళ్లుగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలుచేసిన ధా న్యం కమీషన్‌ డబ్బు లు నేటి వర కూ ప్రభుత్వం చెల్లించలేదు.

కమీషన్‌ రాక పరేషాన్‌

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కమీషన్‌ చెల్లించని ప్రభుత్వం

ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.30కోట్లు పెండింగ్‌

ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళా సంఘాలుభూదాన్‌పోచంపల్లి: ప్రభుత్వం ఏటా పీఏసీఎస్‌, ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి, వాటి నిర్వహణకుగాను నిర్వాహకుల కు కమీషన్‌ ఇస్తుంది. అయితే రెం డేళ్లుగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలుచేసిన ధా న్యం కమీషన్‌ డబ్బు లు నేటి వర కూ ప్రభుత్వం చెల్లించలేదు. దీం తో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ధాన్యం కొనుగోలు చేసిన మహి ళా సంఘాల నిర్వాహకులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.


కొనుగోలు కేంద్రంలో నిర్వహణకు అయ్యే ఖర్చులు ముందుగా నిర్వాహకులు భరించారు. ఆ తరువాత ప్రభుత్వం వాటిని నిర్వాహకుల బ్యాంకు ఖాతాలో జమచేస్తుంది. అయితే డబ్బు జమకాకపోవడంతో నిర్వాహకులు నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే త్వరలో వస్తాయని చెబుతున్నారని, కమీషన్‌ డబ్బు మాత్రం రావడంలేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2021 సంవత్సరానికి సంబంధించిన రెండు సీజన్లు, ఈ ఏడాది యాసంగి సీజన్‌కు సంబంధించిన కమీషన్‌ను రావల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.30కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టెంట్‌, కుర్చీల కిరాయి, తాగునీటి ఖర్చు, గోనె సంచులు తెచ్చేందుకు వాహనం కిరాయిలు చెట్లించేందుకు సొంత డబ్బు వ్యయం చేశామని ఇప్పటి వరకు వాటిని చెల్లించకపోతే కుటుంబం ఎలా గడవాలని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది వానాకాలానికి సంబంధించిన ధాన్యం నవంబరు, డిసెంబరు నెలలో వస్తుంది. వాటిని ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు మళ్లీ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నిర్వాహకులకు గత ఏడాది కమీషనే నేటికీ చెల్లించలేదు. గతంలో రావాల్సిన కమీషన్‌ వస్తేనే ఈ దఫా కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని, లేదంటే నిర్వహించలేమని నిర్వాహకులు చెబుతున్నారు. మరో రెండు నెలల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఉంది. అందుకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావల్సి ఉండగా, నిర్వాహకులు అయోమయంలో పడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కమీషన్‌ చెల్లించాలని కోరుతున్నారు.


హమాలీ చార్జీల చెల్లింపులోనూ జాప్యం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసి న హమాలీల చార్జీలను సైతం ప్రభుత్వం ఆరు పంటల సీజన్ల నుంచి చెల్లించడంలేదు. కేవలం యాదాద్రి జిల్లాలో సుమారు రూ.5.50లక్షల వరకు హమాలీ చార్జీలు చెల్లించాల్సి ఉంది. అప్పు చేసి నిర్వాహకులు కేంద్రాలను అతిభారంగా నిర్వహిస్తుండగా, ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హమాలీ చార్జీలు, కమీషన్‌ చెల్లించాలని కోరుతున్నారు.


వడ్డీకి తెచ్చాం : జి.లక్ష్మమ్మ,కొనుగోలు కేంద్రం నిర్వాహకురాలు,శివారెడ్డిగూడెం,పోచంపల్లి

గత ఏడాది రబీ, ఖరీ్‌ఫకు సంబంధించిన ధాన్యం కొనుగోలు నిర్వహణ ఖర్చులు నేటికీ అందలేదు. కొనుగోలు కేంద్రాల్లో రాత్రి సమయంలో కూడా ధాన్యాన్ని కాంటా వేశాం. రాత్రి పగలు పనిచేసినా ప్రభుత్వం మూడు సీజన్ల డబ్బు నేటికీ ఇవ్వలేదు. లక్షల రూపాయలు వడ్డీలకు తెచ్చి కొనుగోలు కేంద్రాలను నిర్వహించాం. ఇప్పటికే సుమారు రూ.20లక్షల మేర కమీషన్‌ రావల్సి ఉంది. త్వరగా ప్రభుత్వం కమీషన్‌ డబ్బు చెల్లించాలి.


నిర్వహణ డబ్బు ఇంకా మంజూరు కాలేదు : మందడి ఉపేందర్‌రెడ్డి, యాదాద్రి డీఆర్‌డీవో

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వం ఇచ్చే కమీషన్‌ ఇంకా మంజూరుకాలేదు. నిర్వాహకులకు గత ఏడాదికి సంబంధించి రెండు సీజన్లకు, ఈ ఏడాది యాసంగి సీజన్‌కు సంబంధించిన కమీషన్‌ రావల్సి ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలో బ్యాంకు ఖాతాలో డబ్బు జమయ్యేలా చూస్తాం. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను దశలవారీగా చెల్లించేలా చూస్తున్నాం.


ఈ ఏడాది యాసంగిలో ధాన్యం కొనుగోలు, రావల్సిన కమీషన్‌ ఇలా..

జిల్లా కొనుగోలు సేకరించిన రావ్వాల్సిన

కేంద్రాలు ధాన్యం (క్వింటాళ్లు) కమీషన్‌ (రూ.కోట్లు)

నల్లగొండ 128 13.76లక్షలు 4.12

సూర్యాపేట 168 14.3లక్షలు 4.29

యాదాద్రి 64 6.2లక్షలు 1.86

Read more