పైసా వసూల్‌

ABN , First Publish Date - 2022-01-03T06:32:54+05:30 IST

నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ స్థానికత కలిగిన ఇద్దరు విద్యుత్‌ ఉద్యోగుల వసూళ్లదందా చర్చనీయాంశంగా మారింది.

పైసా వసూల్‌

 విద్యుత్‌ శాఖలో లైన్‌ఇన్‌స్పెక్టర్ల వసూళ్ల బాగోతం

 రాజకీయ పలుకుబడితో ఏళ్ల తరబడి అక్రమదందా 

 ఉన్నతాధికారులకు తెలిసినా చర్యలకు వెనకడుగు

మిర్యాలగూడ అర్బన్‌, జనవరి 2: నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ స్థానికత కలిగిన ఇద్దరు విద్యుత్‌ ఉద్యోగుల వసూళ్లదందా చర్చనీయాంశంగా మారింది. ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ఠవేసి, ఇటీవలే లైన్‌ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన వీరి వ్యవహారశైలి ఎప్పుడూ వివాదాస్పదమే. ఉన్నతాఽధికారుల మాట ఏనాడు ఖాతరుచేయకపోవడం, విధులకు సక్రమంగా హాజరుకాకుండానే పబ్బం గడుపుతూ ఠంచన్‌గా నెలవారీ జీతభత్యాలు అందిపుచ్చుకుంటున్నారు. సదరు ఉద్యోగుల పనితీరుపై వచ్చే ఫిర్యాదులపై ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే ‘బదిలీ చేయిస్తాం’ అంటూ బెదరగొడతారన్న ఆరోపణలున్నాయి. మాట వినకపోతే రాజకీయ పలుకుబడితో తమ దారిలోకి తెచ్చుకుంటారు. ఇదంతా తమకెందుకులే అన్న ధోరణితో ఉన్నతాధికారులు వారిని పట్టించుకోవడమే మరిచారంటే వారి వ్యవహారం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. డివిజన్‌లో వారి అరాచకాలకు అడ్డూ, అదుపు లేకుండాపోయింది. ఒకరు పట్టణంలో, మరొకరు సాగర్‌ నియోజకవర్గంలోని ఓ మండలకేంద్రంలో లైన్‌ఇన్‌స్పెక్టర్లుగా ఉద్యోగం చేస్తుండగా, మరో చిరు ఉద్యోగిని తోడ్కొని అక్రమ దందాకు తెరతీశారు. వీరంతా మొక్కుబడిగా విధులకు వెళ్తూ పైసా వసూల్‌కు అధిక సమయం కేటాయిస్తారని సొంత శాఖ ఉద్యోగులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

రాజకీయ ముసుగు 

ఉద్యోగ బాధ్యతలు మరిచి అక్రమార్జనకు అలవాటుపడిన ఆ ముగ్గురిలో ఇద్దరు లైన్‌ఇన్‌స్పెక్టర్లు సంఘం నాయకులుగా చెలామణి అవుతు మిర్యాలగూడలో ఓ ప్రజాప్రతినిధి, సాగర్‌ నియోజకవర్గంలోని ఒక సీనియర్‌ నాయకుడికి సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. సదరు రాజకీయ నేతలతో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌చేసి ట్యాగ్‌లైన్లతో ఊదరగొడతారు. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ ఇమేజ్‌పెంచుకునేందుకు వెంపర్లాడుతుంటారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలతో సత్సంబంధాలు ఉన్నాయని, ఏదైనా అవసరం ఉంటే తమతో చెబితే చేసి పెడతామని తోటి ఉద్యోగులకు చెబుతుంటారు. ఈ ముగ్గురు కలిసి చేసే దందాలు, మోసాలు ఆ ప్రజాప్రతినిధులు, నాయకులకు తెలియకపోవడంతో వారి పనులు నిరాటంకంగా సాగుతున్నాయని తోటి ఉద్యోగులు వాపోతున్నారు. సదరు ఉద్యోగుల ఆగడాలపై సమగ్రవిచారణ జరిపితే పలు అక్రమదందాలు వెలుగులోకి వస్తామని తోటి ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. 

అవసరానికో అవతారం

ఇద్దరిలో ఒకరు కుల సంఘానికి జిల్లా, మరొకరు డివిజన్‌ బాధ్యులుగా ఉన్నారు. ఏడాది మొత్తం  చేస్తున్న దందాతోపాటు డిసెంబర్‌లో ప్రత్యేకంగా సంఘం ఖర్చులపేరుతో ప్రత్యేకంగా దోచుకుంటున్నారు. రైస్‌ మిల్లుల నుంచి మొదలు.. చిన్న చిన్న పిండి మిల్లుల వరకు ఎవరినీ వదలరంతే..! విద్యుత్‌ వినియోగంలో తేడా ఉంటే మేం చూసుకుంటాం అంటూ భరోసా ఇస్తారు. అయినా వినకపోతే మాతో మీకు పనిపడదా, సంఘం కోసం అడుగుతున్నామంటూ స్వరంపెంచుతారు. డబ్బులు ఇచ్చే వరకూ కదలకపోవడంతో ఎంతో కొంత ముట్టజెప్పాల్సి వస్తుందని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. డివిజన్‌ పరిధిలోని ఏ మండలకేంద్రాన్ని, గ్రామాలను వదలకుండా ఉద్యోగహోదాలో సంచరిసస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. స్థానిక పరిస్థితులను బట్టి వేషభాషలు మారుస్తుంటారు. జిల్లా విద్యుత్‌ శాఖలో విజిలెన్స్‌ డీఈగా ఒకరు.. మరో ఇద్దరు విజిలెన్స్‌ ఏఈలుగా చెప్పుకుంటారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రతిఏటా సుమారు రూ.50లక్షల వరకు వసూళ్లకు పాల్పడుతూ, ఇద్దరు ఉద్యోగులు కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. కొందరు వ్యాపారులు ఆ ఇద్దరిని చూస్తేనే భయపడి పోతున్నారంటే వసూళ్లపర్వం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  

మాట వినకపోతే బదిలీనే

ఈ సంఘం నాయకుల మాట ఏ ఉన్నతాధికారి వినకపోయినా, చేసే దందాలను ప్రశ్నించినా తమ రాజకీయ పలుకుబడితో బదిలీ చేయిస్తారని సమాచారం. డివిజన్‌ స్థాయి అధికారులను బెదిరించడం.. తమను ప్రశ్నించిన సబ్‌ఇంజనీర్‌లను గతంలో బదిలీ చేయించామంటూ బెదరగొట్టడంలో ఆరితేరారు. తాము చెప్పినట్లు జరగకపోతే అంతే.. అంటూ తోటి ఉద్యోగలను హడలెత్తిస్తారు. 

Updated Date - 2022-01-03T06:32:54+05:30 IST