ఢిల్లీ పర్యటన పేరుతో సీఎం కేసీఆర్‌ డ్రామాలు: వి.హన్మంతరావు

ABN , First Publish Date - 2022-05-25T04:25:54+05:30 IST

ఢిల్లీ పర్యటన పేరుతో సీఎం కేసీఆర్‌ డ్రామాలు చేస్తున్నారని, టీపీసీసీ పీఏసీ(పొలిటికల్‌ ఆఫైర్స్‌కమిటీ) మెంబర్‌ వి.హన్మంతరావు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం, తిరుమలగిరిలో మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు.

ఢిల్లీ పర్యటన పేరుతో సీఎం కేసీఆర్‌ డ్రామాలు:  వి.హన్మంతరావు
సూర్యాపేటలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ హన్మంతరావు

రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఆర్థిక సహాయం చేయాలి

సైనికుడి భూమికి సైతం రక్షణ లేకుండా పోయింది

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు


సూర్యాపేటటౌన్‌, తిరుమలగిరి, మే 24: ఢిల్లీ పర్యటన పేరుతో సీఎం కేసీఆర్‌ డ్రామాలు చేస్తున్నారని, టీపీసీసీ పీఏసీ(పొలిటికల్‌ ఆఫైర్స్‌కమిటీ) మెంబర్‌ వి.హన్మంతరావు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం, తిరుమలగిరిలో మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. జైజవాన్‌, జైకిసాన్‌ కాంగ్రెస్‌ పార్టీ నినాదమన్నారు. కాంగ్రెస్‌ వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రతీ రైతుకు ఉపయోగకరంగా ఉందన్నారు. రాష్ట్రంలో రైతులకు ఉరితాడు బిగించే కార్పొరేట్‌ సంస్థలకు లాభాలు చేకూరేలా సీఎం కేసీఆర్‌ పాలన చేస్తున్నారి ఆరోపించారు. దళితబందు పథకం కేవలం టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే పరిమితమైందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ పూటకోసారి ఢిల్లీ వెళ్తూ రైతు సమస్యలపై పోరాటం చేస్తున్నానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పంజాబ్‌లో రైతులకు సీఎం కేసీఆర్‌ ఆర్థిక సహాయం అందజేయడాన్ని ఎవరూ కాదరని, కానీ ముందుగా తెలంగాణలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఎందుకు ఆర్థిక సహాయం అందజేయలేదో ప్రజలకు తెలపాలన్నారు. దేశం కోసం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్ల భూములకే రాష్ట్రంలో రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తంచేశారు. బోథ్‌ ఎమ్మెల్యే బాపురావు అండతో కొంతమంది నాయకులు జవాన్‌ మహ్మద్‌ అక్రమ్‌ భూమిని ఆక్రమించుకోగా జాతీయ జెండాతో ఆయన రోడ్డెక్కడం బాధకరమన్నారు. జవాన్‌కు న్యాయం చేయని పక్షంలో జూన్‌ 4వతేదీ నుంచి ఉద్యమాలు, దీక్షలు చేస్తానని హెచ్చరించారు. కాంగ్రెస్‌ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన భూములను అభిృవద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం లాక్కోవడం దారుణమన్నారు. కుల గణన చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యంచేస్తూ ప్రైవేట్‌ కంపెనీలను ప్రోత్సహిస్తున్నారన్నారు. దీంతో ప్రైవేట్‌ రంగాల్లో రిజర్వేషన్‌ లేకుండా పోతోందన్నారు. అల్లుడొస్తే రూం ఉండాలని మురిపించి నేటికీ ఒక్క డబుల్‌ బెడ్‌రూం ఇంటిని పేదలకు ఇవ్వలేదన్నారు. ఫ్రెండ్లీ పోలీస్‌ అంటే ఒక్క టీఆర్‌ఎస్‌ నాయకుల మాట వినడమే కాదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అందరి సంగతి చూస్తామని హెచ్చరించారు. మద్యం ధరలు విపరీతంగా పెంచారని, దీంతో భార్య మెడలో పుస్తెలతాడు అమ్మి తాగే పరిస్థితి ఏర్పడిందన్నారు. మహిళాలోకం ఆలోచించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలన్నారు. తిరుమలగిరిలో తొలుత అంబేడ్కర్‌, పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న, మహిళా అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ, మండల అధ్యక్షుడు వై.నరేష్‌, పీసీసీ సభ్యులడ గుడిపాటి నర్సయ్య, జ్ఞానసుందర్‌, కందుకూరి అంబేడ్కర్‌, దయాయాదవ్‌, హఫీజ్‌, వీరేష్‌, చకిలం రాజేశ్వర్‌రావు, అంజద్‌అలీ, వీరన్న నాయక్‌, కక్కిరేణి శ్రీనివాస్‌, చింతమల్ల రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Read more