సిట్టింగ్‌లకు సీఎం భరోసా

ABN , First Publish Date - 2022-11-16T00:41:54+05:30 IST

మునుగోడు ఉపఎన్నికలో శ్రమించి పార్టీ అభ్యర్థిని గెలిపించడంలో కీలకపాత్ర వహించిన మంత్రి జగదీ్‌షరెడ్డితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సీఎం కేసీఆర్‌ అభినందించారు.

సిట్టింగ్‌లకు సీఎం భరోసా

నల్లగొండ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మునుగోడు ఉపఎన్నికలో శ్రమించి పార్టీ అభ్యర్థిని గెలిపించడంలో కీలకపాత్ర వహించిన మంత్రి జగదీ్‌షరెడ్డితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సీఎం కేసీఆర్‌ అభినందించారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్‌ మరోసారి స్పష్టం చేశారు. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, పార్టీ నేతలకు, రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇచ్చారు. 2018లో మాత్రం ఉద్దేశపూర్వకంగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లామని కేసీఆర్‌ వివరించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఖాయమని, ఎన్నికలకు సరిగ్గా ఏడాది కాలం ఉన్నందున ఇక నుంచి అంతా క్షేత్రస్థాయిలోనే ఉండాలని సూచించారు. మునుగోడు ఉపఎన్నిక విజయంపై అధినేత ప్రశంసించడం, సిట్టింగ్‌లకు ఢోకాలేదని స్పష్టం చేయడంతో ఎమ్మెల్యేల్లో ఉత్సాహం కనిపించింది. ఉమ్మడి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని, టికెట్‌ దక్కుతుందో లేదో అన్న అనుమానాలు ఉన్నాయి. అయితే తాజాగా సీఎం ప్రకనటతో ఆ నలుగురు ఊపిరి పీల్చుకున్నారు. తాజా ఎమ్మెల్యేల పరిస్థితి సరిగా లేదు, ఈసారి తమకు టికెట్‌ ఖాయం, అధిష్ఠానం ఆశీస్సులు మెండుగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గంలో కీలక నేతలు ఎవరి అంచనాలో వారు ఉండగా సీఎం ప్రకటనతో ఆశావహులు పార్టీలో ఉంటారా? ఇతర పార్టీల నుంచి టికెట్‌ సాధిస్తారా? వేచి చూడాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నుంచి టికెట్‌ ఆశిస్తూ ఉన్న నేతలపై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓ కన్నేశారు. సాధారణ ఎన్నికల నాటికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు ఆయన కసరత్తు చేస్తున్నారు. త్వరలో ఆయన ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పర్యటనలు చేసేందుకు ప్రణాళిక ఖరారు చేసుకున్నారు.

Updated Date - 2022-11-16T00:41:54+05:30 IST

Read more