పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించాలి

ABN , First Publish Date - 2022-10-11T06:15:40+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పోషకాహారం అందించాలని జిల్లా పరిషత్‌ ఐదో స్థాయి సంఘం(మహిళ, శిశు సంక్షే మం) చైర్‌పర్సన్‌ చింతారెడ్డి చంద్రకళ అన్నారు.

పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించాలి
మాట్లాడుతున్న జిల్లా పరిషత్‌ ఐదోస్థాయి సంఘం కమిటీ చైర్‌పర్సన్‌ చింతారెడ్డి చంద్రకళ

సూర్యాపేట సిటీ, అక్టోబరు 10 : అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పోషకాహారం అందించాలని జిల్లా పరిషత్‌ ఐదో స్థాయి సంఘం(మహిళ, శిశు సంక్షే మం) చైర్‌పర్సన్‌ చింతారెడ్డి చంద్రకళ అన్నారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్థాయి సంఘాల సమావేశాల్లో ఆమె మాట్లాడారు. పిల్లలు శారీరక, మానసిక, సామాజిక ఎదుగుదలకు అధికారులు తోడ్పాటు అందించాలన్నారు. ప్రతి నెలా పిల్లల ఆరోగ్య పరిస్థితి, శారీరక ఎదుగుదలపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, రికార్డులను తనిఖీ చేయాలన్నారు. జిల్లా పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు జానీమియా మాట్లాడుతూ సదరం క్యాంప్‌లో ఒక్కోసారి అర్హత కోల్పోయిన వారికి మరోసారి అర్హత పరీక్షల కోసం అధికారులు అవకాశం ఇవ్వాలన్నారు. బీసీ హాస్టళ్లల్లో విద్యార్థులకు దొడ్డుబియ్యం, పురుగుల అన్నం పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పెన్‌పహాడ్‌ జడ్పీటీసీ సభ్యురాలు మామిడి అనిత అన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమం, వసతి గృహాల ఉన్నతాధికారులు హాస్టళ్లను తనిఖీ చేసి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. మూడో స్థాయీ సంఘం(వ్యవసాయం) చైర్‌పర్సన్‌ నల్లపాటి ప్రమీల మాట్లాడుతూ రైతులు అధికదిగుబడి, ఆదాయం పొందే ఆయిల్‌పామ్‌, డ్రాగన్‌ ప్రూట్‌ సాగుపై మక్కువ పెంచుకోవాలన్నారు. రైతులు వరి పంటల స్థానంలో మెట్టపంటలను సాగు చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు సిద్ధం చేయాలన్నారు. వర్షాలతో పంట నష్టం జరగకుండా రైతులు చేపట్టాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేయాలన్నారు. ఆయా సమావేశాల్లో జిల్లా పరిషత్‌ సీఈవో జి సురేష్‌, ఆయా శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Read more