ఒక్క గింజా ఇవ్వలే!

ABN , First Publish Date - 2022-12-02T00:09:45+05:30 IST

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.55 కోట్లకు పైగా విలువైన ధాన్యాన్ని మిల్లర్లు దోచేశారు.

ఒక్క గింజా ఇవ్వలే!
సీజ్‌ చేయకుండా వదిలేసిన ఉషశ్విని రైస్‌మిల్లు గోదాం

రూ.55 కోట్ల సీఎంఆర్‌ ధాన్యం బుక్కేశారు

కోదాడ మండలంలో కోట్లలో అక్రమాలు

సీరియ్‌సగా తీసుకోని అధికారులు

ప్రతీ సీజనలో ఇదే తంతూ

కేంద్ర బృందం తనిఖీలతో వెలుగులోకి

కోదాడ రూరల్‌, డిసెంబరు 1 : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.55 కోట్లకు పైగా విలువైన ధాన్యాన్ని మిల్లర్లు దోచేశారు. కస్టమ్‌ మిల్లింగ్‌ చేసి ఇవ్వాలని ప్రభుత్వం మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వకుండానే అంతా బుక్కేశారు. రూ.కోట్లలో అక్రమాలు చోటుచేసుకుంటున్నా అధికారులు సీరియ్‌సగా తీసుకోలేదు. ఇటీవల కేంద్ర బృందం నిర్వహించిన రైస్‌మిల్లుల తనిఖీల్లో విషయం వెలుగుచూసినా వారిపై జరిమానాతో సరిపెట్టారు.

రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా సేకరించి రైస్‌మిల్లులకు తరలిస్తోంది. అక్కడ ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు(సీఎంఆర్‌) రైస్‌మిల్లులకు కమీషన కింద కొంత చెల్లిస్తుంది. ఉదాహరణకు 100 కిలోల ధాన్యాన్ని మరపట్టించి 68 కిలోల బియ్యాన్ని సివిల్‌ సప్లయిస్‌కు అందజేయాల్సి ఉంటుంది. ఇందుకు క్వింటాకు రూ.15 మిల్లర్లకు కమీషనతో పాటు ధాన్యాన్ని మరపట్టించగా వచ్చిన తవుడు, నూకలు వారికే ఇస్తుంది. ఇదిలా ఉండగా జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని సమీపంలో ప్రభుత్వం కేటాయించిన మిల్లులకు తరలిస్తుంటారు. ఈ ప్రక్రియ ప్రతీ సీజనలో కొనసాగుతుంది.అయితే ఈ సీఎంఆర్‌ ప్రక్రియ సరిగ్గా కొనసాగుతుందా లేదా అన్నది సివిల్‌ సప్లయ్‌ అధికారులు పరిశీలించాల్సి ఉంది.

మూడు సీజన్లుగా

కోదాడ సమీపంలోని రెండు మిల్లుల నిర్వాహకులు మూడు సీజన్లుగా సీఎంఆర్‌ కింద కేటాయించిన ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. ఒక్క గింజను తిరిగివ్వకుండానే మొత్తం ధాన్యాన్ని పక్క రాష్ట్రాలకు తరలించి విక్రయించారు.వీటి విలువ సుమారు రూ.55 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఇలా మూడు సీజన్లుగా మిల్లర్లు అక్రమాలకు పా ల్పడుతున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించారు. కోదాడ మండలం కొమరబండ దగ్గరలోని వెంకటేశ్వర రైస్‌మిల్లు మూడు సీజన్ల కిం ద సుమారు రూ.20 కోట్లకు పైగా ధాన్యం తీసుకున్నా ఇంతవరకు కస్టమ్‌ మిల్లింగ్‌ కింద బియ్యాన్ని సరఫరా చేయలే దు.దీంతోపాటు మరో రైస్‌మిల్లు గత వానాకాలం, యాసంగి లో సుమారు రూ.2 కోట్ల వరకు ధాన్యం తీసుకుని బియ్యం ఇవ్వలేదు. అదేవిధంగా కాపుగల్లులోని ఉషశ్విని రైస్‌మిల్లు కూడా మూడు సీజన్లుగా రూ.35 కోట్లకు పైగా ధాన్యం తీసుకుని కస్టం మిల్లింగ్‌ కింద బియ్యం ఇవాల్సి ఉంది.

గోదాంలను సీజ్‌ చేయకపోవడంతో

మిల్లర్ల అక్రమాలకు అధికారుల నుంచి సహకారం అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉషశ్విని రైస్‌మిల్లు యాజమాన్యం కాపుగల్లు గ్రామం దగ్గరలో రెడ్లకుంట గ్రామంలో రూ.2 కోట్లతో ధాన్యం నిల్వ చేసేందుకు గోదాంలు నిర్మించింది. ఇందులో పెద్దఎత్తున ధాన్యం నిల్వలు చేసింది. నెలరోజుల కిందట మిల్లులో అధికారుల తనిఖీకి వచ్చిన సమయంలోనూ పెద్దఎత్తున ధాన్యం నిల్వలు ఉన్నాయని గ్రామ రైతులు తెలిపారు. ప్రస్తుతం గోదాంలో నిల్వలు లేవు. రబీ సీజన సీఎంఆర్‌ ఇవ్వలేదని అధికారులు మిల్లును సీజ్‌ చేశారు. కానీ, ధాన్యం నిల్వ చేసిన గోదాంలను మాత్రం ముట్టుకోలేదు. ఇదే అదునుగా మిల్లు యజమాన్యం ధాన్యాన్ని పక్కదారి పట్టించింది. ఇదంతా పథకం ప్రకారమే చేసినట్లు తెలుస్తోంది. ఇందులో అధికారుల పాత్ర కచ్చితంగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. మిల్లు యజమానులకు అధికారులు పూర్తిస్థాయిలో సహకరించినట్లు స్పష్టంగా కనిపిస్తుందని, వారి సూచనల మేరకే రైస్‌మిల్లు యజమానులు ధాన్యాన్ని మొదట మిల్లు నుంచి గోదాంలకు, అక్కడి నుంచి లారీల ద్వారా సరిహద్దు దాటించారని పలువురు ఆరోపిస్తున్నారు.

అడ్డదారుల్లో ఇతర ప్రాంతాలకు

రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ముందుగా మిల్లులకు తరలిస్తారు. అక్కడినుంచి గోదాంలకు తరలించి, నిల్వ చేస్తారు. మిల్లు నిర్వాహకులు ప్రతి రోజూ మర పట్టించి బియ్యంగా మార్చి సివిల్‌ సప్లయిస్‌ శాఖకు అందజేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సీఎంఆర్‌ కింద తీసుకున్న ధాన్యాన్ని కోదాడ నుంచి ఆంధ్రప్రదేశతో పాటు ఇ తర ప్రాంతాలకు అధిక రేట్లకు విక్రయించి తరలించారు. ఉషశ్విని రైస్‌మిల్లు గోదాముల్లో నెల రోజుల కిందట ఉన్న ధాన్యం నిల్వలు ప్రస్తుతం కనిపించడం లేదు. గత 10 రోజుల వ్యవధిలో లారీల్లో ఆంధ్రప్రదేశలోని వివిధ ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఇలా కోదాడ సమీపంలోని రెండు మిల్లుల్లోనే రూ.కోట్లలో ధాన్యం బయటి ప్రాంతాలకు అక్రమంగా తరలిపోవడం చర్చనీయాంశమైంది. కొమరబండలోని ఓ రైస్‌మిల్లు నుంచి వారం రోజుల కిందట లారీల ద్వారా ఆంధ్రా ప్రాంతానికి ధాన్యం తరలిస్తుండగా, ఒంగోలు వద్ద పట్టుకుని అక్కడి అధికారులు సీజ్‌ చేసినట్లు తెలిసింది.

అక్రమాలు వారికి నిత్యకృత్యం

కోదాడ మండలం కొమరబండ సమీపంలోని వెంకటేశ్వర రైస్‌మిల్లు, కాపుగల్లు సమీపంలోని ఉషశ్విని రైస్‌మిల్లుల్లో అక్రమాలు నిత్యకృత్యమయ్యాయి. ముప్పై ఏళ్ల కిందట నెలకొల్పిన వెంకటేశ్వర రైస్‌మిల్లు యాజమాన్యంపై సీఎంఆర్‌ ఇవ్వకపోవడంతో ఐదేళ్ల కిందట కేసులు కూడా నమోదయ్యాయి. అలాగే కాపుగల్లు సమీపంలోని ఉషశ్విని రైస్‌మిల్లు ఈ మూడు సీజన్లకు కలిపి రూ.35 కోట్ల విలువైన ధాన్యాన్ని అక్రమంగా తరలించింది. ఈ మిల్లుపై కూడా కేసులు నమోదుతో పాటు జరిమానా విధించారు. మిల్లు నిర్వాహకులు ఒక సీజన పంటను మరో సీజనకు సంబంధించినది చూపిస్తూ తరుచూ అక్రమాలకు పాల్పడుతున్నారు.

మిల్లును సీజ్‌ చేసి..

సీఎంఆర్‌ ధాన్యాన్ని, బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్‌ నెలలో కేంద్ర ప్రభుత్వ బృందాలు రైస్‌మిల్లులను తనిఖీ చేశాయి. ఈ క్రమంలో ఏప్రిల్‌ 2వ తేదీన కోదాడ మండలంలోని వేంకటేశ్వర, ఉషశ్విని రైస్‌మిల్లులో ధాన్యం లెక్కల్లో తేడాలను బృందాలు గుర్తించాయి. ఏ మేరకు ధాన్యం నిల్వలు తేడా ఉన్నాయో వాటి వివరాలతో కూడిన నివేదికను జిల్లా అధికారులకు అందజేశారు. ఈ క్రమంలో నామమాత్రంగా రైస్‌మిల్లును సీజ్‌ చేసిన అధికారులు ధాన్యం నిల్వ చేసిన గోదాంలను వదిలేయడం గమనార్హం.

Updated Date - 2022-12-02T00:09:49+05:30 IST