బండ్రు శోభారాణి కాంగ్రెస్‌లో చేరిక

ABN , First Publish Date - 2022-05-30T06:47:09+05:30 IST

ఆలేరు నియోజకవర్గానికి చెందిన బండ్రు శోభారాణి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రె్‌సలో చేరారు. అమెరికాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నుంచి కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకొని శనివారం ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.

బండ్రు శోభారాణి కాంగ్రెస్‌లో చేరిక
అమెరికాలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం తీసుకుంటున్న బండ్రు శోభారాణి

అమెరికాలో రేవంత్‌ సమక్షంలో చేరిక

నల్లగొండ, మే 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఆలేరు నియోజకవర్గానికి చెందిన బండ్రు శోభారాణి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రె్‌సలో చేరారు. అమెరికాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నుంచి కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకొని శనివారం ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. విప్లవపార్టీ న్యూడెమోక్రసీ నుంచి ప్రారంభమైన శోభారాణి ప్రస్థానం, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌, టీడీపీ, బీజేపీలో పనిచేసి తాజాగా కాంగ్రెస్‌ గూటికి చేరారు. న్యూడెమోక్రసీ పార్టీ అనంతరం, ప్రత్యేక రాష్ట్ర సాధనపై ఆసక్తితో టీఆర్‌ఎ్‌సలో చేరారు. అక్కడ ఇమడలేక టీడీపీలో చేరారు. 17ఏళ్ల పాటు టీడీపీలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం స్థానికంగా టీడీపీ ప్రాబల్యం తగ్గడం, భవిష్యత్‌ రాజకీయాల్లో బీజేపీదే కీలక పాత్ర అవుతుందని వరంగల్‌, నల్లగొండ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు ఒకేసారి కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో బీజేపీ శోభారాణికి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా అవకాశం కల్పించింది. ఆలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆకాంక్ష ఉండగా, ఆ మేరకు బీజేపీ పెద్దల నుంచి అనుమతి లభించడంతో మూడేళ్లుగా స్థానికంగా ముందుకెళ్తున్నారు. అయితే స్థానికంగా జిల్లా నాయకత్వం తనను పనిచేసుకోనివ్వడం లేదని ఆమె పలుమార్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా బీజేపీ వ్యవహారాలను పర్యవేక్షించే మంత్రి శ్రీనివాస్‌, బంగారు శృతికి ఫిర్యాదు చేశారు. జిల్లా కమిటీ ఏర్పాటు, ఆలేరు నియోజకవర్గం నుంచి కమిటీల్లో ఎవరికి ప్రాధాన్యమివ్వాలనే అంశాల్లో తనకు కనీస సమాచారం లేకపోవడం, పార్టీ కార్యక్రమాల్లో సైతం ప్రోటోకాల్‌ పాటించడం లేదని పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తూ వచ్చారు. తాజాగా, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ కమలం గూటిలో చేరారు. ఆయన చేరికతో ఎమ్మెల్యే టికెట్‌ దక్కుతుందనే ఆశ లేకపోవడం, మొదటి నుంచి జిల్లా నాయకత్వం సహకరించడం లేదన్న కారణాలతో కొంత కాలంగా ఆమె మౌనంగా ఉంటూ వచ్చారు. వివిధ పార్టీల్లో పనిచేసిన శోభారాణిపై పలు సందర్భాల్లో పోలీసు కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల నిమిత్తం తరుచూ నాంపల్లి కోర్టుకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి సైతం కేసుల వాయిదాలకు వస్తుండగా, స్థానిక పరిస్థితులపై శోభారాణితో చర్చించినట్లు సమాచారం. బీజేపీలో ఎదురవుతున్న ఇబ్బందులు, మానసిక ఆందోళనను ఆమె రేవంత్‌రెడ్డితో పంచుకోగా టీడీపీలో పనిచేసిన కాలంలో ఉన్న పరిచయం ఆధారంగా కాంగ్రె్‌సలో చేరాలని గతంలో రేవంత్‌రెడ్డి కోరినట్లు తెలిసింది. ఉద్యమ పార్టీలో పనిచేయడం, వారి కుటుంబం అజ్ఞాతంలో గడపడం వంటి విషయాలు బీజేపీలో శోభారాణికి ప్రతిబంధకంగా మారినట్లు బీజేపీకి చెందిన ఓ నాయకుడు తెలిపారు. స్థానికంగా అనుకూల వాతావరణం లేకపోవడంతో అమెరికాలో ఉన్న పిల్లల వద్దకు శోభారాణి వెళ్లారు. ఈ సమయంలోనే అక్కడి తెలంగాణ కాంగ్రెస్‌ అనుంబంధ విభాగం ఆహ్వానం మేరకు రేవంత్‌ అమెరికా వెళ్లారు. రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించే నాయకులు మౌనంగా ఉండడం సరికాదని కాంగ్రెస్‌ పార్టీలో చేరి ప్రజలకు అందుబాటులో ఉండాలని రేవంత్‌రెడ్డి ఆహ్వానించగా, ఆమె కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్నారు.

బేషరతుగా కాంగ్రె్‌సలో చేరా : బండ్రు శోభారాణి

ఎలాంటి పదవులు, షరతులు లేకుండా కాంగ్రెస్‌ పార్టీలో చేరా. టీడీపీలో రేవంత్‌రెడ్డితో పనిచేసిన అనుభవం, ఆయన నాయకత్వంపై ఉన్న నమ్మకంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరా. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నాయకత్వంలో స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నా. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో కోమటిరెడ్డి విజయం కోసం టీడీపీ నేతలుగా కృషి చేశాం.

Updated Date - 2022-05-30T06:47:09+05:30 IST