నిబంధనలు పాటించకపోతే చర్యలు

ABN , First Publish Date - 2022-09-25T06:10:09+05:30 IST

జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్‌, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, రక్త పరీక్షా కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కోటాచలం అన్నారు.

నిబంధనలు పాటించకపోతే చర్యలు
జిల్లాకేంద్రంలో నోటీసులు అందజేస్తున్న కోటాచలం

డీఎంహెచ్‌వో కోటాచలం 

సూర్యాపేట(కలెక్టరేట్‌), సెప్టెంబరు 24: జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్‌, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, రక్త పరీక్షా కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కోటాచలం అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రులను తనిఖీచేసి నిబంధనలు సరిగా లేనందున వారికి నోటీసులు జారీ చేశారు. అనంతరం డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ఆస్పత్రుల్లో వైద్య సేవలందించే వైద్యులు వారి పేర్లను బోర్డులో నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వహించే వైద్యులు ప్రభుత్వవేళల్లో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్య సేవలందించకూడదన్నారు. మెడికల్‌ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్న వైద్యులు మాత్రమే వైద్యం చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ కర్పూరపు హర్షవర్దన్‌, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ కళ్యాణ్‌చక్రవర్తి, అంజయ్య, సీహెచ్‌వో చెరుకు యాదగిరి, మేనేజర్‌ భాస్కర్‌రాజు పాల్గొన్నారు.  

హుజూర్‌నగర్‌, మఠంపల్లి: పట్టణంలో అనుమతులు లేని ఆస్పత్రులను సీజ్‌ చేస్తున్నట్లు కోటాచలం తెలిపారు. శనివారం హుజూర్‌నగర్‌ పట్టణంలో ఆక్సిజన్‌ ప్రైవేటు ఆసుపత్రిని సీజ్‌ చేశారు. ఆయనవెంట జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్‌ కళ్యాణ్‌ చక్రవర్తి, మాస్‌ మీడియా అధికారి అంజయ్యగౌడ్‌, భాస్కర్‌రాజు, కిరణ్‌కుమార్‌, గజగంటి ప్రభాకర్‌, ఇందిరాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మఠంపల్లిలో శివశంకర్‌ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలకు అనుమతులు లేవని, దీంతో సీజ్‌ చేశామన్నారు. 

Read more