నిబంధనలు పాటించకుంటే చర్యలు

ABN , First Publish Date - 2022-09-28T06:06:36+05:30 IST

ప్రైవేట్‌ ఆస్పత్రులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో కొండల్‌రావు అన్నారు. మంగళవారం పట్టణం లో ఆస్పత్రులను తనిఖీ చేసిన అనంత రం ఆయన విలేకరులతో మాట్లాడారు.

నిబంధనలు పాటించకుంటే చర్యలు
మిర్యాలగూడలో పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో తనిఖీలు చేస్తున్న డీఎంహెచ్‌వో

డీఎంహెచ్‌వో కొండల్‌రావు

మిర్యాలగూడ అర్బన్‌, సెప్టెంబరు 27: ప్రైవేట్‌ ఆస్పత్రులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో కొండల్‌రావు అన్నారు. మంగళవారం పట్టణం లో ఆస్పత్రులను తనిఖీ చేసిన అనంత రం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 542 ప్రైవేటు ఆస్పత్రులున్నాయని, 10 రోజుల వ్యవధిలో వాటిన్నింటినీ తనిఖీ చేసి లోపాలను గుర్తిస్తామన్నారు. ఇప్పటివరకు తాము పరిశీలించిన ఆస్పత్రుల్లో పలు లోపాలు బయటపడ్డాయని, ఆస్పత్రి బోర్డుపై రాసిన వైద్యుల విద్యార్హతల్లో తేడాలను గుర్తించామని, ఆయుర్వేదం కోర్సు చేసిన వైద్యులు ఎంబీబీఎ్‌సగా, ఎండీలుగా చలామణి అవుతున్నట్లు తెలిపారు. డయాగ్నస్టిక్‌, ఎక్స్‌-రేల్యాబ్‌ టెక్నీషియన్లలో చాలామంది అనర్హులు పనిచేస్తున్నట్లు తేలిందన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే తనిఖీలను ప్రభుత్వ ఆదేశాలమేర కు నిరంతరాయంగా కొనసాగించే అవకాశం ఉందన్నారు. ఇప్పటివర కు జిల్లావ్యాప్తంగా రెండు ఆస్పత్రులు, ఐదు ల్యాబ్‌లు సీజ్‌చేయగా, మరో ఎనిమిది ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నోటీసులు అందుకున్న ఆస్పత్రుల యాజమాన్యం వారం రోజుల వ్యవధిలో వివరణ ఇవ్వాలని, లేదంటే వాటిని సైతం సీజ్‌చేస్తామని హెచ్చరించారు. మంగళవారం పట్టణంలో రెండు ఆస్పత్రులను తనిఖీ చేసిన అనంతరం అడవిదేవులపల్లి మండలకేంద్రంలో ఎలాంటి అనుమతులు పొందకుండా ఆర్‌ఎంపీలు నడిపిస్తున్న ఐదు డయాగ్నస్టిక్‌ సెంటర్లను సీజ్‌చేసి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఆయనవెంట జిల్లా అధికారులు రవిశంకర్‌, కేస రవి, వెంకయ్య, శ్రీధర్‌ తదితరులు ఉన్నారు. 

అడవిదేవులపల్లి: మండలకేంద్రంలోని రక్త నమూనా ల్యాబ్‌లను మంగళవారం డీఎంహెచ్‌వో కొండల్‌రావు ఆకస్మిక తనిఖీచేశారు. మండల కేంద్రంలోని ఆరు ల్యాబ్‌లను తనిఖీ చేయగా నాలుగింటికి తాళంవేసి ఉండడంతో వారికి నోటీసులు జారీ చేసి ల్యాబ్‌లకు సంబంధించిన పత్రాలను చూపి తెరవాలన్నారు. ల్యాబ్‌లు పరిశుభ్రంగా ఉండాలని, లేదంటే సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయనవెంట డిప్యూటీ డీఎంహెచ్‌వో కేస రవి తదితరులు పాల్గొన్నారు. 

Read more