లక్ష్మీనృసింహుడికి శాస్త్రోక్తంగా నిత్యవిధి కైంకర్యాలు

ABN , First Publish Date - 2022-08-18T04:31:53+05:30 IST

యాదగిరిగుట్ట క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామికి బుధవారం నిత్యవిధికైంకర్యాలు వైభవంగా నిర్వహించారు.

లక్ష్మీనృసింహుడికి శాస్త్రోక్తంగా నిత్యవిధి కైంకర్యాలు
నిత్యతిరుకల్యాణ వేడుకలు నిర్వహిస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట, ఆగస్టు 17: యాదగిరిగుట్ట క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామికి బుధవారం నిత్యవిధికైంకర్యాలు వైభవంగా నిర్వహించారు. స్వయంభువులను, సువర్ణ ప్రతిష్టా అలంకారమూర్తులను పంచామృతాలతో అభిషేకించి, అర్చనలు జరిపారు. అష్టభుజి ప్రాకార మండపంలో స్వామికి గజవాహన సేవతో పాటు నిత్యతిరుకల్యాణోత్సవం, సుదర్శన నారసింహహోమ పూజలు నిర్వహించారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ నిత్యపూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రావణమాసం సందర్భంగా యాదగిరి కొండపై కోటి కుంకుమార్చన పూజలు కొనసాగాయి. ఆలయానికి వివిధ విభాగాల ద్వారా రూ.14,82,682 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.

తులసీకాటేజ్‌లో రక్తదాన శిబిరం

స్వాతంత్య్ర వజ్రోత్సోవాల్లో భాగంగా దేవస్థానం ఆధ్వర్యంలో తులసీకాటేజ్‌లో ఎమ్మెఎ్‌సఎన్‌ బ్లడ్‌ బ్యాంక్‌ సంస్థ రక్తదాన శిబిరం నిర్వహించింది. 18మంది సిబ్బంది రక్తదానం చేసినట్టు వైద్యుడు ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.  

అభివృద్ధి పనులపై వైటీడీఏ వైస్‌చైర్మన్‌ కిషన్‌రావు సమీక్ష

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులపై వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు సమీక్షించారు. ఇటీవల దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ దేవస్థానంలో భక్తులకు కల్పిస్తున్న మౌలిక వసతి సదుపాయాలపై ఆరా తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైటీడీఏ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులపై సమీక్షించినట్టు సమాచారం. అదేవిధంగా నిధుల దుర్వినియోగం అంశంపై కూడా చర్చించినట్టు తెలిసింది. సమీక్షలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వసంత్‌నాయక్‌, ఈఈలు, సిబ్బంది పాల్గొన్నారు. 

ద్వారపాలకుల ఆర్చి  బంగారు  తాపడానికి సన్నాహాలు

యాదగిరిగుట్ట ప్రధానాలయ గర్భగుడి ముందున్న ద్వారపాలకులు జయవిజయుల విగ్రహాల ఆర్చికి బంగారు తాపడం పనులకు వైటీడీఏ అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందుకోసం కలప స్కఫోల్డింగ్‌ పనులను ప్రారంభించారు. ముందుగా రాగి రేకుల పనులు పూర్తి చేసి, కొలతలు తీసుకుంటున్నారు. రాగి రేకులు తయారీ అనంతరం బంగారుతాపడం కోసం అవసరమయ్యే బంగారం వివరాలు వెల్లడించనున్నారు. 

ఆస్థాన విద్వాంసుడు నారాయణ మృతి

దేవస్థాన ఆస్థాన విద్యాంసుడు లింగంపల్లి నారాయణ(63) అనారోగ్యంతో బుధవారం సాయంత్రం మృతి చెందారు. ఆయన దేవస్థానంలో 30ఏళ్లకు పైగా ఆస్థాన విద్వాంసుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. డోలు విద్యాంసుడిగా పనిచేస్తున్న ఆయన ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. నారాయణ మృతికి దేవస్థాన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజవెల్లి రమేశ్‌బాబు, అర్చకబృందం, సిబ్బంది తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. 



Updated Date - 2022-08-18T04:31:53+05:30 IST