విషాదాంతమైన తీర్థయాత్ర

ABN , First Publish Date - 2022-09-14T04:54:38+05:30 IST

యాదగిరీశుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకేందుకు వచ్చిన భక్తుడు పుణ్యస్నానాలకు వెళ్లి మృతి చెందడంతో తీర్థయాత్ర విషాదాంతంగా మారింది.

విషాదాంతమైన తీర్థయాత్ర
భువనేశ్వర్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న శేఖర్‌, మల్లికార్జున్‌

పుణ్యస్నానం కోసం గండిచెరువులో దిగిన భక్తుడు మృతి

ఐదు రోజులుగా మరమ్మతు పనుల్లో లక్ష్మీపుష్కరిణి

యాదగిరిగుట్ట, సెప్టెంబరు 13 :  యాదగిరీశుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకేందుకు వచ్చిన భక్తుడు పుణ్యస్నానాలకు వెళ్లి మృతి చెందడంతో తీర్థయాత్ర విషాదాంతంగా మారింది. ఈ మంగళవారం ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో సికింద్రాబాద్‌ అల్వాల్‌కు చెందిన కరాటే మాస్టర్‌ తులసి కమల్‌శేఖర్‌, సునీత దంపతులు ఇద్దరు దత్తత కుమారులతో కలిసి వచ్చారు. కొండకింద తులసీకాటేజ్‌లో బస ఏర్పాటు చేసుకుని నిద్రచేశారు. మంగళవారం ఉదయం స్వామి క్షేత్రంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు గండిచెరువు సమీపంలోని లక్ష్మీపుష్కరిణి వద్దకు అంతా కలిసి వెళ్లారు. అయితే మరమ్మతుల కారణంగా పుష్కరిణిలో ఐదు రోజులుగా నీటిని నింపలేదు. దీంతో వీరంతా పక్కనే ఉన్న గండిచెరువుకు స్నానం చేసేందుకు వెళ్లారు. తండ్రి శేఖర్‌తో పాటు భువనేశ్వర్‌(19), తమ్ముడు మల్లికార్జున్‌లు ఉదయం 7గంటలకు గండిచెరువులోకి దిగారు. ఇక్కడ చెరువు సుమారు 20 అడుగుల వరకు లోతు ఉం టుంది. అయితే చెరువులోకి దిగిన సమయంలో ముగ్గురూ జారారు. అయితే మల్లికార్జున్‌, భువనేశ్వర్‌లకు ఈత రాకపోవడంతో చెరువులో జారిపడ్డారు. అప్రమత్తమైన కమల్‌శేఖర్‌ మల్లికార్జున్‌ను కాపాడి, పైకి చేర్చేలోగా భువనేశ్వర్‌ గల్లంతయ్యాడు. అతడి కోసం గాలించినా ఫలితం లేకుండాపోయింది. ఈ విషయాన్ని అక్కడే నిర్మాణ పనుల చేసుఉ్తన్న కూలీలు, స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది చెరువులో దిగి రెండుగంటలపాటు శ్రమించి ఉదయం 10 గంటల సమయంలో భువనేశ్వర్‌ను బయటకు తీయగా అప్పటికే మృతి చెందడంతో మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. 

కళ్ల ముందే కుమారుడు కానరాని లోకానికి

 అల్వాల్‌ ప్రాంతానికి చెందిన మదన్‌, అలవమ్మ దంపతుల ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో వారి కుమారులైన భువనేశ్వర్‌, మల్లికార్జున్‌లను ఒకరికి నాలుగేళ్లు, మరొకరికి ఐదేళ్ల వయస్సులో తులసి కమల్‌శేఖర్‌, సునీత దంపతులు దత్తత తీసుకుని సంరక్షిస్తున్నారు. కుమారులు ఇరువురికి చదువులు చెప్పిస్తున్నారు. భువనేశ్వర్‌ ఇంటర్‌ సెకండీయర్‌ చదువుతున్నాడు. తీర్థయాత్ర కోసం వచ్చిన తాము పుణ్యస్నానాలు ఆచరించే క్రమంలో పెద్ద కుమారుడైన భువనేశ్వర్‌ మృత్యుచెందడం తీవ్ర బాధకు గురిచేసిందని శేఖర్‌ కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహం వద్ద తల్లితండ్రులు, తమ్ముడు విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.

అధికారుల నిర్లక్ష్యం.. భక్తుడి పాలిట శాపం

లక్ష్మీనృసింహుడిని దర్శించుకునే ముందు లక్ష్మీపుష్కరిణిలో భక్తులు స్నానమాచరిస్తుంటారు. అయితే పుష్కరిణిలో నీరు మురికిగా మారిందని తొలగించిన అధికారులు ఈ నెల 8, 9వ తేదీల్లో భక్తులను అనుమతించలేదు. ఆ తర్వాత మరమ్మతు పనులు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఐదు రోజులుగా భక్తులకు పుష్కరిణిలో స్నానానికి అవకాశం లేక పక్కనే ఉన్న గండిచెరువుకు వెళ్తున్నారు. ఇలా వెళ్లి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు మంగళవారం మృత్యువాత పడ్డాడు. అక్కడ స్నానాలు చేస్తున్నారని తెలిసినా, ఆ ప్రాంతం ప్రమాదకరమని తెలిసినా అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా పెట్టలేదు. దీంతో లోతు తెలియకుండా వెళ్లి ప్రమాదబారిన పడ్డారు. 

Read more