అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-12-10T01:03:17+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్‌ చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్ట్‌
స్వాధీనం చేసుకున్న సొమ్మును చూపుతున్న డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు

మిర్యాలగూడ, డిసెంబరు 9: ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్‌ చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చీరాల మండలం నవాపేటకు చెందిన సయ్యద్‌ ఆల్తాఫ్‌ అలియాస్‌ నాజర్‌ గతంలో పీడీయాక్ట్‌ కింద అరెస్ట్‌ అయి నిజామాబాద్‌ జైలులో శిక్ష అనుభవించాడు. ఆ సమయంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వాటర్‌ట్యాంక్‌తండాకు చెందిన రమావత్‌ రమే్‌షతో ఆల్తాఫ్‌కు పరిచయం ఏర్పడింది. జైలునుంచి విడుదలై బయటకు వచ్చిన తర్వాత రమేష్‌ స్నేహితుడు సూర్యాపేట జిల్లా పెన్‌పహడ్‌ మండలం సైదాబాసుగూడెం లాల్‌సింగ్‌ తండాకు చెందిన ఆంగోతు నాగరాజుతో జత కలిసి సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో దొంగతనాలు చేయాలని ముఠాగా ఏర్పడ్డారు. పగలు ద్విచక్రవాహనంపై తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను ఎంపిక చేసుకుని రాత్రివేళల్లో ఇనుప రాడ్లతో ఇంటి తాళాలు ధ్వంసంచేసి వెండి, బంగారు నగలు చోరీ చేసేవారు. శుక్రవారం సాధారణ తనిఖీల్లో భాగంగా రాజీవ్‌చౌరస్తాలో వన్‌టౌన్‌ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా పై ముగ్గురు ద్విచక్రవాహనంపై వస్తూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. గమనించిన పోలీసులు వెంటనే వారిని పట్టుకుని విచారించడంతో చోరీచేసిన సొమ్మును విక్రయించేందుకు వెళ్తున్నట్లు చెప్పారు. వీరిపై నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని వివిధ పోలీ్‌సస్టేషన్లలో 10 చోరీ కేసులు నమోదైనట్లు తెలిపారు. వీరినుంచి 300 గ్రాముల బంగారు, ఏడు కిలోల వెండి, 2 కార్లు, ఒక ల్యాప్‌టాప్‌, స్కూటీ, బరువు కొలిచే యంత్రం, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటివిలువ సూమారు రు. 25.35లక్షలు ఉంటుందని చెప్పారు. కేసును ఛేదించిన సీఐ రాఘవేందర్‌, ఎస్‌ఐలు సుధీర్‌కుమార్‌, కృష్ణయ్య, నర్సింహులు, హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు నాగరాజు, శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, రామకృష్ణ, రవి, సోమ్లాను డీఎస్పీ అభినందించారు.

సొత్తు విలువ తెలుసుకునేందుకు..

ఈ దొంగలు చోరీ చేసే సొత్తును లెక్కించేందుకు బరువు కొలిచే యంత్రాన్ని కూడా వినియోగిస్తున్నారు. దొంగతనం జరిగిన సమయాల్లో యజమానులు పోయినదానికంటే ఎక్కువ సొత్తు చెబుతుండడంతో బంగారు, వెండిని కొలిచేందుకు వేయింగ్‌ మిషన్‌ వినియోగిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ వేయింగ్‌ మిషన్‌ను కూడా ఓ దుకాణంలో చోరీ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.

Updated Date - 2022-12-10T01:03:18+05:30 IST