అందరికీ బూస్టర్‌ డోస్‌

ABN , First Publish Date - 2022-08-31T06:11:05+05:30 IST

కరోనా నిర్మూలనకు జిల్లా లో బూస్టర్‌ డోస్‌ టీకాల పంపిణీ విస్తృతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 32.80శాతం మేర పంపిణీ పూర్తయిందని వైద్యాధికారులు తెలిపారు.

అందరికీ బూస్టర్‌ డోస్‌
బూస్టర్‌ డోస్‌లు పంపిణీ చేస్తున్న వైద్యసిబ్బంది

నూరుశాతం లక్ష్యం

ఇప్పటి వరకు 32.80శాతం పూర్తి


సూర్యాపేటటౌన్‌, ఆగస్టు 30: కరోనా నిర్మూలనకు జిల్లా లో బూస్టర్‌ డోస్‌ టీకాల పంపిణీ విస్తృతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 32.80శాతం మేర పంపిణీ పూర్తయిందని వైద్యాధికారులు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగం గా జూలై 16నుంచి సెప్టెంబర్‌ 12వతేదీ వరకు బూస్టర్‌ డోస్‌ లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు బూస్టర్‌ డోసు టీకా వేయించుకునేందుకు అర్హులు. ఇదిలా ఉండగా, బూస్టర్‌ డోస్‌ టీకాల పంపిణీలో రాష్ట్ర వ్యాప్తంగా సూర్యాపేట జిల్లా ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. అయితే అర్హులైన కొంత మంది బూస్టర్‌ డోస్‌ తీసుకునేందుకు ముందుకురావడం లేదు. జిల్లాలో ప్రస్తుతం 16వేల బూస్టర్‌ డోసులు అందుబాటులో ఉన్నాయి.


500మంది సిబ్బంది విధుల్లో

బూస్టర్‌ డోస్‌ టీకాల పంపిణీకి జిల్లా వ్యాప్తంగా ప్రతీ రోజు 500మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 22 పీహెచ్‌సీలు, నాలుగు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు సీహెచ్‌సీలు, ఒక ప్రాంతీయ ఆస్పత్రి, ఒక జనరల్‌ ఆస్పత్రితో కలపి మొత్తం 31 కేంద్రాల్లో బూస్టర్‌ డోస్‌ ఇస్తున్నా రు. 340 మంది ఏఎన్‌ఎంలకు 150మంది, 1,024 ఆశాకార్యకర్తలకు 300మందిని బూస్టర్‌ డోస్‌ టీకాల పంపిణీకి కేటాయిస్తున్నారు. బూస్టర్‌ డోస్‌తోపాటు 18ఏళ్లకు తక్కువ వయసు ఉన్నవారికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేస్తున్నారు.


ర్యాంకుల్లో ముందంజ

జిల్లాలో 18ఏళ్లు పైబడిన వారు 7,72,880 మంది ఉండగా, ఇప్పటి వరకు 2,53,310 మంది బూస్టర్‌ డోస్‌ వేయించుకున్నా రు. 18-59 వయసు వారు 6,28,296 మంది ఉండగా, 1,90,983మందికి బూస్టర్‌ డోస్‌ టీకా ఇచ్చారు. ఈ విభాగంలో జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మూడో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ములుగు జిల్లా, రెండో స్థానంలో సిద్ధిపేట ఉంది. అదేవిధంగా 60ఏళ్లకు పైబడిన వారు జిల్లాలో 1,29,651మంది ఉండగా, 7,358మందికి బూస్టర్‌ డోస్‌ ఇచ్చారు. ఈ విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి స్థానంలో జిల్లా ఉంది. వీరితో పాటు ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ 7,994 మంది, హెల్తాకేర్‌ సిబ్బంది 6,939 మంది బూస్టర డోస్‌ వేయించుకున్నారు. మొత్తంగా బూస్టర్‌డోస్‌ పంపిణీలో జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా రెండో స్థానంలో ఉంది. అదే విధంగా జిల్లాలో నాగారం మండల పీహెచ్‌సీ మొదటి స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా, ప్రతీ ఒక్కరు బూస్టర్‌ డోస్‌ టీకాలు వేయించుకోవాలని గ్రామాల్లో ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.


ప్రతీ ఒక్కరు బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలి : డాక్టర్‌ వెంకటరమణ, టీకాల పంపిణీ జిల్లా అధికారి

అర్హులైన ప్రతీ ఒక్కరు బూస్టర్‌ డోస్‌ టీకాలు వేయించుకోవాలి. ఇప్పటికే అన్నిఆరోగ్య కేంద్రాల్లో టీకాలను అందుబాటులో ఉంచాం. వైద్యసిబ్బంది పూర్తిస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు.కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రతీ ఒక్క రు భాగస్వాములు కావాలి. విధిగా కరోనా నిబందన లు పాటించడంతోపాటు బూస్టర్‌ డోస్‌ టీకా వేయించుకోవాలి.


Read more