జిల్లాలో 268 కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-09-25T06:11:17+05:30 IST

జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో భారీగా గంజాయి పట్టుబడింది. వేర్వేరు ప్రాంతాల్లో సుమారు రూ.27లక్షల విలువైన 268 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఎస్‌. రాజేంద్రప్రసాద్‌ వెల్లడించారు.

జిల్లాలో 268 కిలోల గంజాయి పట్టివేత
విలేకరులతో మాట్లాడుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

సూర్యాపేట క్రైం, సెప్టెంబరు 24: జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో భారీగా గంజాయి పట్టుబడింది. వేర్వేరు ప్రాంతాల్లో సుమారు రూ.27లక్షల విలువైన 268 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఎస్‌. రాజేంద్రప్రసాద్‌ వెల్లడించారు. మోతె పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని మామిళ్లగూడెంలో శుక్రవారం మోతె ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఖమ్మం వైపునుంచి వస్తున్న కారును ఆపి తనిఖీ చేసే ప్రయత్నం చేయగా డ్రైవర్‌ ఆపలేదు. పోలీసులు కారును వెంబడించి పట్టుకున్నారు. కారులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రాజస్థాన్‌లోని సామంద్‌ జిల్లా అమేథ్‌ తాలూకా కాబరికి చెందిన ట్రక్‌ డ్రైవర్‌ శివలాల్‌చంద్‌, రాజ్‌పూర్‌ తాలూకా, బిల్‌వారా జిల్లా గల్యావారీ గ్రామానికి చెందిన మరో ట్రక్‌ డ్రైవర్‌ కిషన్‌లాల్‌ సులువుగా డబ్బు సంపాదించాలని సమీప ప్రాంతానికి చెందిన గంజాయి వ్యాపారి నారాయణ్‌తో కలిసి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. నాలుగు రోజుల క్రితం రాజస్థాన్‌ నుంచి ఏపీలెపి అనకాపల్లికి వెళ్లారు. అక్కడ నారాయణ్‌ ఓ దాబా వద్ద శివలాల్‌, కిషన్‌లాల్‌ను కూర్చోబెట్టాడు. నారాయణ్‌ ఒక్కడే వెళ్లి కిలో గంజాయి రూ.రెండువేల చొప్పున 138 కిలోలు కొనుగోలు చేసుకొని కారు డిక్కీలో వేసుకుని తిరిగి దాబా హోటల్‌ వద్దకు వచ్చాడు. గంజాయి ఉన్న కారును శివలాల్‌, కిషన్‌లాల్‌కు అప్పగించి రాజస్థాన్‌కు తీసుకురావాలని నారాయణ్‌ అక్కడినుంచి రాజస్థాన్‌ వెళ్లిపోయాడు. శివలాల్‌, కిషన్‌లాల్‌ కారుతో వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కారును తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నారు. నారాయణ్‌ పరారీలో ఉన్నాడు. 

వాహనాలు తనిఖీ చేస్తుండగా..

హుజూర్‌నగర్‌లో ఎస్‌ఐ వెంకటరెడ్డి కోదాడ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా, కోదాడ నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న కారును ఆపి తనిఖీ చేశారు. కారులో సుమా రు 93కిలోల గంజాయి లభ్యం కాగా, కారులో ఉన్న మధ్యప్రదేశ్‌ రాష్ట్రం దాటియా జిల్లా సోనగిర్‌ మండలం సినవాల్‌ గ్రామానికి చెందిన కమల్‌సింగ్‌ రాజ్‌పుత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం హమీర్‌పూర్‌ జిల్లా అకునా గ్రామానికి చెందిన మహేంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో కమల్‌సింగ్‌ రాజ్‌పుత్‌, మహేంద్రను కోర్టులో రిమాండ్‌ చేశారు. వ్యాపారి దినే్‌షశర్మ పరారీలో ఉన్నాడు. అదే విధంగా కోదాడ పోలీసులు 37కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టణ పోలీసులు కోదాడ శివారులోని దుర్గాపురం క్రాస్‌రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఈద్గావాజ్‌పాయ్‌ గ్రామానికి చెందిన సూరజ్‌యాదవ్‌, విదిశ పట్టణానికి చెందిన అభిషేక్‌ మాల్వియా, శవమ్‌ రఘువంశీల నుంచి 37కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని అనంతరం రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించారు. సమావేశంలో కోదాడ డీఎస్పీ జి. వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐలు కె. శివశంకర్‌, ఆంజనేయులు, రామలింగారెడ్డి ఉన్నారు.

Updated Date - 2022-09-25T06:11:17+05:30 IST