రిజర్వేషన్లు ఉండాల్సిందే..

ABN , First Publish Date - 2022-09-08T09:11:24+05:30 IST

దేశంలో రిజర్వేషన్లు ఉండాల్సిందేనని.. అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా వాటిని అమలు చేయాలని సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు.

రిజర్వేషన్లు ఉండాల్సిందే..

సమన్యాయం కోసం అమలు చేయాలి: జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 (ఆంధ్రజ్యోతి): దేశంలో రిజర్వేషన్లు ఉండాల్సిందేనని.. అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా వాటిని అమలు చేయాలని సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టులో బుధవారం హైకోర్టు అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ‘రాజ్యాంగ హక్కులు - సామాజిక న్యాయం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ న్యాయవాదులు రాజ్యాంగాన్ని చదవాలని..  నిరంతర పఠనంతోనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని పేర్కొన్నారు. అంటరానితనం, కులం, మతం, లింగం, ప్రాంతం వంటి వివక్ష లేకుండా రాజ్యాంగంలో రిజర్వేషన్లను పెట్టారని చెప్పారు. వాటి కారణంగా మెరిట్‌ ఉన్న వారికి అవకాశాలు తగ్గుతున్నాయన్న భావన సరికాదని.. వెనుకబడిన వర్గాలు ఇతర వర్గాలతో సమానంగా ఎదిగేందుకే ఆ ఏర్పాటు చేశారని తెలిపారు. అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ హాల్‌లోకి రాగానే తనకు పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని.. ఈ అసోసియేషన్‌లో తాను కూడా పనిచేశానని పేర్కొన్నారు. దేశంలో 75 శాతం మంది ఖైదీలు అండర్‌ ట్రయల్‌ ఖైదీలుగా ఉన్నారని.. బెయిల్‌ ఇచ్చేవారు లేక వారు జైళ్లలో ఉండిపోతున్నారని తెలిపారు. ఇలాంటి వారికి బెయిల్‌ ఇప్పించేందుకు న్యాయవాదులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 


జస్టిస్‌ నాగేశ్వర్‌రావు మంచి క్రికెటర్‌, నటుడు: సీజేఐ

న్యాయవాదిగా ఉంటూ నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అయిన కొద్దిమందిలో జసి ్టస్‌ లావు నాగేశ్వర్‌రావు ఒకరని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ పేర్కొన్నారు. అనేక రాజ్యాంగ ధర్మాసనాల్లో పనిచేసిన ఆయన.. సామాన్య ప్రజల జీవితాలను ప్రభావితం చేసేలా అనేక తీర్పులు ఇచ్చారని తెలిపారు. ఆయన ఉత్తమ న్యాయవాది, న్యాయమూర్తి మాత్రమే కాదని.. మంచి క్రికెటర్‌ అని.. బాలీవుడ్‌లో కూడా నటింంచారని తెలిపారు. జస్టిస్‌ నాగేశ్వర్‌రావు ఇచ్చిన తీర్పులు ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీ రఘునాథ్‌ పేర్కొన్నారు.  

Read more