Munugodu TRS: మునుగోడు ఉప ఎన్నిక హీట్.. టీఆర్‌ఎస్‌‌కు పెద్ద సమస్యే వచ్చి పడిందే..

ABN , First Publish Date - 2022-08-13T01:06:00+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ చేస్తున్న వేళ అధికార టీఆర్‌ఎస్‌ వర్గపోరుతో సతమతమవుతోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా..

Munugodu TRS: మునుగోడు ఉప ఎన్నిక హీట్.. టీఆర్‌ఎస్‌‌కు పెద్ద సమస్యే వచ్చి పడిందే..

యాదాద్రి: మునుగోడు ఉప ఎన్నికపై (Munugodu By Poll) ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ చేస్తున్న వేళ అధికార టీఆర్‌ఎస్‌ (TRS) వర్గపోరుతో సతమతమవుతోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి (Ex MLA kusukuntla prabhakar reddy) వ్యతిరేకంగా స్థానిక టీఆర్‌ఎస్ నేతలు సమావేశం నిర్వహించారు. ఆంథోల్‌ మైసమ్మ దగ్గర ఓ ఫంక్షన్‌ హాల్‌లో టీఆర్‌ఎస్‌ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య నేతలు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు భారీగా హాజరయ్యారు. కూసుకుంట్లకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వొద్దని తీర్మానం చేశారు. వారిని బుజ్జగించేందుకు అధిష్టానం చేసిన ప్రయత్నాలు, బుజ్జగింపులు ఫలించలేదు. ఓ వైపు మునుగోడులో సీఎం సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వైపు కూసుకుంట్ల వ్యతిరేక కూటమి ఏకమవుతుండటం టీఆర్‌ఎస్‌ను కలవరపెడుతోంది. మునుగోడులో బహిరంగ సభ నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. గురువారం జరిగిన క్యాబినెట్‌ భేటీలో కూడా మునుగోడు ఉప ఎన్నికపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మంత్రివర్గ సహచరుల వద్ద ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం. తాజాగా చేయించిన సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని సీఎం అన్నట్టు తెలిసింది.



మునుగోడులో ఉన్న ప్రజాప్రతినిధులు, నేతలతోపాటు నల్లగొండ జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని, కలిసి శ్రమిస్తేనే విజయం వరిస్తుందని కేసీఆర్‌ సూచించినట్లు తెలిసింది. క్యాబినెట్‌ భేటీ ముగిసిన తర్వాత నల్లగొండ జిల్లాకు చెందిన నేతలతో కేసీఆర్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి జి.జగదీశ్వర్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలతో మునుగోడు ఉప ఎన్నికపై చర్చించారు. అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ఎలాంటి విభేదాలు, వివాదాల జోలికిపోవద్దని సీఎం సూచించినట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డే మరోసారి బరిలోకి దిగనున్నట్లు తెలిసింది. 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ప్రభాకర్‌రెడ్డికే టికెట్‌ ఇవ్వనున్నట్లు, ఆ పార్టీ అంతర్గతంగా కొందరు కీలక నేతలకు తెలిపింది.



అయితే ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు టికెట్‌ ఇవ్వొద్దంటూ అధిష్ఠానానికి ముందుగానే లేఖ రాశారు. అయినా ఆయననే అభ్యర్థిగా ఖరారు చేస్తున్నట్లు సంకేతాలు రావడంతో నేతల్లో అసంతృప్తి పెల్లుబికింది. దీంతో నల్లగొండ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి.. మునుగోడు నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో చర్చించారు. ఆ నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు తదితర నేతలతో మంత్రుల క్వార్టర్స్‌లోని తన నివాసంలో సమావేశమయ్యారు. అందరితోనూ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వారందరినీ తీసుకుని ప్రగతి భవన్‌కు వెళ్లారు. అక్కడున్న నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జి తదితరులతో కలిసి మళ్లీ చర్చలు జరిపారు. చివరకు అంతా కలిసి పనిచేయాలని, ఈ విజయం కీలకమని పేర్కొన్నారు. కానీ.. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇస్తే మాత్రం స్థానిక టీఆర్‌ఎస్ నేతల నుంచి కొంచెం కూడా సహకారం లభించే పరిస్థితి ప్రస్తుతానికైతే కనిపించడం లేదు.

Updated Date - 2022-08-13T01:06:00+05:30 IST