Munugode By-Election: మునుగోడులో భారీగా నేతల మోహరింపు

ABN , First Publish Date - 2022-09-25T02:20:29+05:30 IST

సాధారణ ఎన్నికల ముందు జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక (Munugode By-Election)ను రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌

Munugode By-Election: మునుగోడులో భారీగా నేతల మోహరింపు

నల్లగొండ: సాధారణ ఎన్నికల ముందు జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక (Munugode By-Election)ను రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP), తెలంగాణ రాష్ట్రం ఇచ్చి మూడోసారైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. రాష్ట్రంలో వరుస ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలు ఓటర్లను ఆకర్షించడంలో రాటుతేలి చివరికి బూత్‌ కమిటీనే టార్గెట్‌గా అంతా ప్రణాళికలు రూపొందించుకున్నారు. పార్టీలోని కీలక నేతలను బాధ్యులుగా చేసేందుకు కమిటీల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. మునుగోడు ఉప ఎన్నికకు ముందస్తుగా బహిరంగ సభ, అభ్యర్థి ప్రకటన చేసిన కాంగ్రెస్‌ బూత్‌ స్థాయి కమిటీల నియామకంలోనూ వేగంగా అడుగులు వేస్తోంది. నోటిఫికేషన్‌లో కొంత జాప్యం ఉంటుందన్న సమాచారంతో తన దళాన్ని సిద్ధం చేసినా క్షేత్రస్థాయికి పంపడంలో టీఆర్‌ఎస్‌ ఇంకా ముహూర్తం ఖరారు చేయలేదు. పాత, కొత్త పంచాయతీలతో కమిటీల ఏర్పాటులో బీజేపీలో కొంత జాప్యం జరగగా పలు దఫాలుగా చర్చల అనంతరం క్రమంగా కమిటీల ఏర్పాటు అంశం కొలిక్కి వచ్చింది. మొత్తంగా చూస్తే దసరా పండుగ తర్వాత ఈ మూడు ప్రధాన పార్టీల నేతలు స్థానికంగా మకాం వేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే సిద్దం చేశారు.


ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపి కాషాయం కండువా కప్పుకున్న తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిన్నటివరకు అన్నీ తానై వ్యవహరించారు. సాధారణంగా బీజేపీకి ప్రతి పని విషయంలో ఒక పద్ధతి, దానికి పెద్దల ఆమోదం వంటివి ఉంటాయి. అయితే ఇప్పటివరకు రాజగోపాల్‌రెడ్డి ఆ అంశాలను పక్కన పెట్టి స్థానికంగా ముందుకు వెళ్తున్నారు. అయితే తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన అమిత్‌షా వెనువెంటనే కమిటీల ఏర్పాటు, పాత, కొత్తల కలయికలపై స్పష్టమైన ఆదేశాలతో చకచకా సంస్థాగత నిర్మాణం ప్రారంభమయ్యాయి. దుబ్బాక, హుజూరాబాద్‌, హైదరాబాద్‌ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను సమీక్షించుకుని మునుగోడు ఉప ఎన్నికలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ముందుకెళ్లాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఒకరిద్దరి చేతుల్లో కీలక బాధ్యతలు పెట్టకుండా యంత్రాంగం మొత్తాన్ని మోహరించాలని నిర్ణయించారు. మంత్రి, ఎమ్మెల్యే అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఒక ఎంపీటీసీ పరిధి అంటే 800 నుంచి 1200ల మంది ఓటర్లకు మించి బాధ్యత ఇవ్వొద్దని నిర్ణయించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మండలాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఖరారు చేశారు.


Updated Date - 2022-09-25T02:20:29+05:30 IST