ములాయం.. బడుగుల జీవి

ABN , First Publish Date - 2022-10-11T09:51:19+05:30 IST

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్‌ యాదవ్‌ మరణం పట్ల సీఎం కేసీఆర్‌..

ములాయం.. బడుగుల జీవి

  • ఆయన మృతి పట్ల కేసీఆర్‌ దిగ్ర్భాంతి
  • నేడు అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం
  • దేశ రాజకీయాల్లో ఓ శకం ముగిసింది: కేటీఆర్‌

హైదరాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్‌ యాదవ్‌ మరణం పట్ల సీఎం కేసీఆర్‌  తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ప్రముఖ సోషలిస్టు నాయకుడు రామ్‌ మనోహర్‌ లోహియా, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు రాజ్‌ నారాయణ్‌ వంటి నేతల స్ఫూర్తితో ములాయం సింగ్‌ రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పని చేసిన ములాయం తన జీవితాంతం నిరుపేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పని చేశారని అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా,  ఉత్తర ప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ములాయం స్వగ్రామం సైఫయ్‌లో మంగళవారం జరిగే అంత్యక్రియలకు సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు. ఆయన వెంట మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌కూడా వెళ్లనున్నారు. ములాయం మరణంతో భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ములాయం సింగ్‌ మృతితో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ, టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు పేర్కొన్నారు. 


బడుగు వర్గాలకు తీరని లోటు: కాంగ్రెస్‌ 

ములాయంసింగ్‌ యాదవ్‌ అకాల మరణం బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తీరనిలోటు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మల్లు రవి అన్నారు. ఆయన మృతికి వారు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. 


ములాయం మరణం బాధాకరం: సంజయ్‌ 

ములాయం సింగ్‌ మృతి బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ములాయం మృతి పట్ల బీజేపీ నేత ఈటల రాజేందర్‌, తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో, యూపీ అభివృద్ధిలో ములాయం తనదైన ముద్రవేశారని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి కొనియాడారు. బీజేపీకి వ్యతిరేకంగా ములాయం పనిచేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-11T09:51:19+05:30 IST