ప్రతిపక్షాలతోనే ఉంటాం

ABN , First Publish Date - 2022-07-18T09:04:16+05:30 IST

తాము ఇతర ప్రతిపక్షాలతో కలిసి ఉన్నామని, కలిసే ఉంటామని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవ రావు స్పష్టం చేశారు. అలాగని కాంగ్రెస్‌ పార్టీతో

ప్రతిపక్షాలతోనే ఉంటాం

కాంగ్రెస్‌తో దోస్తానా లేదు : ఎంపీ కేశవరావు 


న్యూఢిల్లీ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): తాము ఇతర ప్రతిపక్షాలతో కలిసి ఉన్నామని, కలిసే ఉంటామని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవ రావు స్పష్టం చేశారు. అలాగని కాంగ్రెస్‌ పార్టీతో తమకు దోస్తానా ఉండదని  చెప్పారు. మొత్తం ప్రతిపక్షంతో తాము ఉంటామని అన్నారు. 17 పార్టీలతో కూడిన విపక్షాల సమావేశానికి హాజరయ్యాయని, అందులో తామూ ఉంటామని వివరించారు. పార్లమెంటులో ఏదైనా ఒక బిల్లును కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తే... ఆ పార్టీ వ్యతిరేకిస్తుంది కాబట్టి తాము ఆ బిల్లును సమర్థించి బీజేపీకి మద్దతివ్వలేమని అన్నారు. ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయనున్న మార్గరెట్‌ అల్వాకు మద్దతిచ్చే అంశంపై సీఎం కేసీఆర్‌తో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆదివారం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు.


అనంతరం కేకే విలేకరులతో మాట్లాడుతూ...అఖిలపక్ష సమావేశం తంతుగా మారిందని ఆరోపించారు. ప్రతిపక్షం కొంచెం మాట్లాడినా అధికారపక్షం సహించలేక పోతుందని విమర్శించారు. ప్రజలకు సంబంధించిన అంశాలను చర్చకు చేపట్టాలని తాము చెప్పామని అన్నారు. పార్లమెంటులో ధర్నాలు చేయవద్దని ఉత్తర్వులు జారీ చేసినా తాము చేస్తామని ప్రకటించారు. అన్‌పార్లమెంటరీ పదాల పేరిట కొన్ని పదాలను తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కులాల వారీగా జనగణన చేపట్టాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. అధికార సమాచారం హిందీలోనే ఉండటంపై సమావేశంలో తమిళనాడు ఎంపీ వైగో అభ్యతరం చెబితే కేంద్ర మంత్రులు చులకనగా మాట్లాడారని, ఇది విభేదాలకు దారితీస్తుందన్నారు. నాలుగు సింహాల చిహ్నం డిజైన్‌ను మార్చడం చాలా తప్పని వ్యాఖ్యానించారు. వరద ప్రభావ ప్రాంతాల్లో గవర్నర్‌ పర్యటించడంలో తప్పేమి లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆదివాసీలకు ఇబ్బంది కలిగేలా అటవీ పరిరక్షణ బిల్లు ఉందని, దీన్ని తాము వ్యతిరేకిస్తామని ప్రకటించారు. అగ్నిపథ్‌ పథకం, ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్‌ జోక్యం, బొగ్గు దిగుమతి అంశాలపై చర్చకు పట్టుబడుతామని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-07-18T09:04:16+05:30 IST