రైల్వేలో పెండింగ్‌ పనులను పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-04-05T05:56:26+05:30 IST

రైల్వేలో పెండింగ్‌ పనులను పూర్తి చేయాలి

రైల్వేలో పెండింగ్‌ పనులను పూర్తి చేయాలి

 మహబూబాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి) : మహబూబాబాద్‌ పార్లమెం టరీ నియోజకవర్గ పరిధిలో రైల్వేశాఖలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని స్థానిక పార్లమెంట్‌ సభ్యురాలు మాలోతు కవిత  విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి  అశ్వినివైష్ణవ్‌కు సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఎంపీ కవిత మానుకోట విలేకరులతో మాట్లాడుతూ... పాండురంగాపురం నుంచి భద్రాచలం వరకు 12 కిలోమీటర్ల మేర ఉన్న రైల్వే ట్రాక్‌ పనులను పూర్తి చేయాలని కోరారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయానికి దేశవ్యాప్తంగా భక్తులు వస్తుంటారని, వారి సౌకర్యార్థం ట్రాక్‌ను ఏర్పాటు చేసి రైల్వే సౌకర్యం కల్పించాలన్నారు. అదే విధంగా సింగరేణి కార్మికుల కోసం మణుగూరు నుంచి భూపాలపల్లిమీదుగా రామగుండం వరకు రైల్వేట్రాక్‌ నిర్మాణం చేపట్టాలని కోరారు. కొవిడ్‌ నేపథ్యంలో కొన్ని రైళ్ల హాల్టింగ్‌లను ఎత్తివేశారని, ప్రయాణికులు, ఉద్యోగుల సౌకర్యార్థం కోసం వాటిని పునరుద్దరించాలని కోరారు. మహబూబాబాద్‌లో రప్తిసాగర్‌, జీటీ, విశాఖపట్టణం సూపర్‌ఫాస్ట్‌, నర్సాపూర్‌ ఎక్సప్రెస్‌లు, డోర్నకల్‌లో మణుగూరు, చార్మినార్‌, పద్మావతి, గౌతమి ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్‌ సౌకర్యం కల్పించాలని మంత్రిని ఎంపీ విజ్ఞప్తి చేశారు. 


 

Read more