ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలో మరిన్ని సంక్షేమ పథకాలు
ABN , First Publish Date - 2022-09-10T08:29:23+05:30 IST
ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రకటించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.

సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
హైదరాబాద్, సెప్టెంబరు9 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రకటించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఉద్యోగులు, అధికారులు అంకితభావంతో పని చేస్తుండటంతో సంస్థ ఇప్పుడిప్పుడే నష్టాలను తగ్గించుకుని లాభాలు సాధించే దిశగా పయనిస్తోందన్నారు. శుక్రవారం ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్లో ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి.. కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ.. తన జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి కాళోజీ అని కొనియాడారు. ఆర్టీసీ ఉద్యోగులు నిర్దేశిత లక్ష్యం మేరకు సంస్థకు ఆదాయాన్ని సమకూర్చేందుకు శక్తికి మించి శ్రమిస్తున్నారని ప్రశంసించారు. ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. లాభాలను సాధించేందుకు ఆర్టీసీ ఉద్యోగులు సైనికులలాగా కృషి చేయాలని సూచించారు.