మొక్కుబడి శిక్షణ

ABN , First Publish Date - 2022-09-22T05:50:07+05:30 IST

మొక్కుబడి శిక్షణ

మొక్కుబడి శిక్షణ

డబ్బు సంపాదనకే నిర్వాహకుల ప్రాధాన్యత

రోడ్డు భద్రతా నిబంధనలు గాలికి...

సిబ్బందిని మచ్చిక చేసుకుని అభ్యర్థులకు లైసెన్స్‌లు

క్షేత్ర స్థాయిలో నిలిచిపోయిన ఆర్టీఏ తనిఖీలు

కొరవడిన రవాణా శాఖ పర్యవేక్షణ


మట్టెవాడ(వరంగల్‌), సెప్టెంబరు 21 : నగరంలో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలా వాహనాలు నడుపుతున్న చాలా మందికి సరైన నైపుణ్యం ఉండడం లేదని, కొద్దిపాటి డ్రైవింగ్‌ అనుభవంతో రోడ్డు మీదుకు వచ్చి ప్రమాదాలకు కారకులవుతున్నారని పోలీసులు అంటున్నారు. వరంగల్‌ నగరంలో ఎక్కడపడితే అక్కడ డ్రైవింగ్‌ స్కూల్స్‌ వెలుస్తున్నాయి. ఎలాంటి శిక్షణ, నైపుణ్యం, అనుభవం లేని డ్రైవర్లు వాహనాలతో బయటికి వస్తున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌తో పాటు రాష్‌ డ్రైవింగ్‌తో కేసులు భారీగా నమోదవుతున్నాయి.


డ్రైవింగ్‌ స్కూల్స్‌లో కొత్తగా నేర్చుకోవడానికి వచ్చే అభ్యర్థులకు డ్రైవింగ్‌లో మెళకువలు, రోడ్డు భద్రతా నిబంధనలు తెలియజేయాలి. కానీ, డ్రైవింగ్‌ స్కూల్స్‌ నిర్వాహకులు ఇవేమి పట్టించుకోరు. డబ్బు సంపాదనకే అధిక ప్రాధాన్యత నిస్తున్నారు. డ్రైవింగ్‌లో శిక్షణ కన్నా లైసెన్స్‌ ఇప్పించడంలో ఎక్కువ ప్రాధాన్యత కనబరుస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గుర్తింపు పొందిన డ్రైవింగ్‌ స్కూల్స్‌ అన్నీ సంపాదనే ధ్యేయంగా మొక్కుబడిగా శిక్షణ ఇస్తున్నాయి. రవాణా శాఖ గుర్తింపు పొందిన డ్రైవింగ్‌ స్కూల్స్‌ నిబంధనలు పాటించేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. డ్రైవింగ్‌ స్కూల్స్‌ నిర్వాహకులు ఆర్టీఏ కార్యాలయంలోని సిబ్బందితో ఉన్న సత్సంబంధాలతో నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి రోజు రవాణా శాఖ కార్యాలయంలో వందల సంఖ్యలో కార్లు రిజిస్ర్టేషన్‌ అవుతున్నాయి. అంతకంటే రెట్టింపు స్థాయిలో కార్‌ డ్రైవింగ్‌ నేర్చుకునేందుకు యువతీ, యువకులు, మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఈ డిమాండ్‌ను గుర్తించిన కొందరు డ్రైవింగ్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసుకొని ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు.


నిబంధనలకు పాతర..

వరంగల్‌ నగరంలో డ్రైవింగ్‌ స్కూళ్ల నిర్వహణ ప్రహాసనంగా మారింది. ఎలాంటి మౌలిక సదుపాయాలు, సాంకేతిక నైపుణ్యం లేని వ్యక్తులకు రవాణాశాఖ అధికారులు ఎడాపెడా అనుమతిస్తున్నారు. డ్రైవింగ్‌ స్కూళ్ల అనుమతుల కోసం వేలల్లో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సాధారణంగా మోటారు వాహన ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి డ్రైవింగ్‌ స్కూల్‌ నిర్వహణను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాతనే అనుమతివ్వాలి. ఇందుకోసం డ్రైవింగ్‌ స్కూల్‌ నిర్వాహకులు రూ.10వేలు డిమాండ్‌ డ్రాఫ్ట్‌ను రవాణా శాఖకు చెల్లించాలి.

మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన వారే డ్రైవింగ్‌ స్కూల్‌కు అర్హత కలిగి ఉండాలి. మోటారు వాహనాలకు సంబంధించిన విద్యలో ఏదో ఒక సర్టిఫికెట్‌ పొంది ఉండాలి. అనుభవజ్ఞులైన ఇన్‌స్ట్రక్టర్‌ ఉండాలి.

డ్రైవింగ్‌ స్కూల్‌ కోసం నిర్వాహకులు ప్రత్యేకంగా రెండు తరగతి గదులతో కూడిన ఆఫీసులు కలిగి ఉండాలి. ట్రాఫిక్‌ నిబంధనలపై శాస్ర్తీయ బోధన జరగాలి. వాహనాలకు చిన్నపాటి మరమ్మతులను చేసుకునే మెకానిజంపై కూడా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. డ్రైవింగ్‌ స్కూళ్లలో రోడ్డు భద్రతా నిబంధనల సూచికలను ఏర్పాటు చేసి కనీసం మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వాలి.

వాహనాలకు సంబంధించిన విడిభాగాల ప్రదర్శన ఉంచాలి. వాటి పనితీరుపై శిక్షణ తరగతి నిర్వహించాలి. ఆ తర్వాతనే కార్లు నడిపేందుకు మైదానంలో శిక్షణ ఇవ్వాలి.

చాలా మంది డ్రైవింగ్‌ స్కూల్స్‌ నిర్వాహకులు ఎలాంటి కార్యాలయాలు లేకుండానే కారుపై డ్రైవింగ్‌ స్కూల్‌ బోర్డు ఏర్పాటు చేసుకొని కొంత మంది ఆర్టీఏ అధికారులు, సిబ్బంది సహాయంతో డ్రైవింగ్‌ స్కూల్‌ నిర్వహణకు కావాల్సిన ఫారం-11ను సంపాదిస్తున్నారు.


అడ్డగోలుగా వసూళ్లు..

ఎలాంటి నిబంధనలు పాటించకుండా అడ్డగోలు అనుమతులతో ఏర్పడుతున్న డ్రైవింగ్‌ స్కూళ్లు అభ్యర్థుల వద్ద రూ.5వేల నుంచి రూ.7వేల వరకు వసూలు చేస్తున్నాయి. వారికి 30 రోజులు కూడా శిక్షణ ఇవ్వకుండానే వదిలేస్తున్నారు. డ్రైవింగ్‌ పరీక్షకు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లినప్పుడు సహజంగా ఉండేటువంటి భయంతో కొంతమంది సరిగా వాహనాలు నడుపలేక పోతున్నారు. దీంతో డ్రైవింగ్‌ స్కూల్‌ నిర్వాహకులు ఆర్టీఏ సిబ్బందిని మేనేజ్‌ చేస్తూ లైసెన్స్‌ ఇప్పిస్తున్నారు. ఇలా కొద్దిపాటి శిక్షణ తీసుకున్న వారు డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకుని యథేచ్ఛగా కార్లతో రోడ్డుపైకి వస్తున్నారు.

Read more