బతుకమ్మ చీర.. మహిళలకు పుట్టింటి కానుక

ABN , First Publish Date - 2022-09-24T08:13:25+05:30 IST

రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు పుట్టింటి కానుకగా సీఎం కేసీఆర్‌ చీరలు అందజేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ...

బతుకమ్మ చీర..  మహిళలకు పుట్టింటి కానుక

తెలంగాణ ఏర్పాటు తర్వాతే బతుకమ్మకు గుర్తింపు: కవిత

కమ్మర్‌పల్లి, సెప్టెంబరు 23: రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు పుట్టింటి కానుకగా సీఎం కేసీఆర్‌ చీరలు అందజేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించుకునేందుకు రాజముద్ర పడిందన్నారు. నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లిలో శుక్రవారం బతుకమ్మ చీరలను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణకు మణిహారంగా నిలిచే బతుకమ్మ పర్వదినం గతపాలకుల హయాంలో నిరాదారణకు గురైందన్నారు. 


సంక్రాంతి పండుగకు ఇచ్చే ప్రాధాన్యం బతుకమ్మకు దక్కకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేని వారు.. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జై శ్రీరామ్‌ అంటే మనం కూడా జైజై శ్రీరామ్‌ అందామని, కానీ.. మతం పేరిట కుట్రలకు పాల్పడితే తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 22 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన బీజేపీ.. అధికారంలోకి వచ్చాక వాటిని భర్తీ చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసేలా ప్రధాని మోదీతో పాటు బీజేపీ ఎంపీలను ఎక్కడికక్కడ నిలదీయాలని యువతను కోరారు. ఎంపీ అర్వింద్‌ నిజామాబాద్‌ జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. బతుకమ్మ పండుగకు విశ్వవ్యాప్త గుర్తింపు సాధించి పెట్టిన ఘనత ఎమ్మెల్సీ కవితదేనని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. 

Read more