BL Santosh: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నిందితుడిగా బీఎల్‌ సంతోష్‌

ABN , First Publish Date - 2022-11-25T04:21:00+05:30 IST

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తులో సిట్‌ దూకుడు మరింత పెంచింది.

BL Santosh: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..  నిందితుడిగా   బీఎల్‌ సంతోష్‌

శని లేదా సోమవారం

విచారణకు రావాలని నోటీసులు

తుషార్‌, జగ్గు, శ్రీనివాస్‌ కూడా

నిందితుల జాబితాలో...

ఏసీబీ కోర్టులో సిట్‌ మెమో

ఎంపీ రఘురామకు నోటీస్‌లు

తనకు అందలేదని ఎంపీ వ్యాఖ్య

నేడు సిట్‌ ముందుకు ప్రతాప్‌,

శ్రీనివాస్‌, చిత్రలేఖ

రామచంద్రభారతి, నందు,

సింహయాజి కస్టడీకి కోర్టు నో

ఏసీబీ కోర్టులో సిట్‌ మెమో దాఖలు

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తులో సిట్‌ దూకుడు మరింత పెంచింది. తమ ఎదుట విచారణకు హాజరుకాకుండా తప్పించుకుంటున్న వారిని ఏకంగా ఈ కేసులో నిందితులుగా చేర్చేందుకు సిద్ధమైంది. కేసులో మొదట్నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతో్‌షను సిట్‌ టార్గెట్‌ చేసింది. ఇప్పుడు ఆయన్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చేందుకు మరో అడుగు ముందుకేసింది. బీఎల్‌ సంతో్‌షతోపాటు తుషార్‌ వల్లెపల్లి, కేరళ వైద్యుడు జగ్గు, న్యాయవాది శ్రీనివా్‌సను నిందితులుగా చేరుస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు. ఈ కేసులో బీఎల్‌ సంతో్‌షకు మరోసారి నోటీ్‌సలు జారీ చేసిన సిట్‌ శని వారం లేదా సోమవారం విచారణకు రావాలని పేర్కొంది. అయితే ఆయన విచారణకు హాజరవుతారా లేక గడువు కోరుతూ లేఖ పంపుతారా అనేది తేలాల్సి ఉంది. బీఎల్‌ సంతో్‌షకు సీఆర్‌పీసీ 41(ఏ) కింద నోటీస్‌లు జారీ చేసేందుకు సిట్‌ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.

హైకోర్టు అనుమతితో, ఢిల్లీ పోలీ్‌సల సహకారంతో నోటీ్‌సలు చేరవేసినా, ఆయన విచారణకు హాజరుకాలేదు. ప్రస్తుతం గుజరాత్‌ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నందున విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరుతూ సంతోష్‌ సిట్‌ అధికారులకు లేఖ రాశారు. సంతో్‌షను విచారించాలని, అరెస్ట్‌ విషయంలో కోర్టు అనుమతి తీసుకోవాలని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా బీఎల్‌ సంతో్‌షను నిందితుడిగా చేరుస్తూ ఏసీబీ కోర్టులో సిట్‌ మెమో దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఈ కేసులో తుషార్‌, జగ్గుకు 41(ఏ) నోటీ్‌సలు జారీచేసినా ఇప్పటి వరకు వారు సిట్‌ విచారణకు రాలేదు. జగ్గుపై సిట్‌ ఏకంగా లుకౌట్‌ నోటీస్‌ జారీ చేసింది. ఇప్పుడు నిందితులుగా చేర్చింది.

ఎంపీ రఘురామతోపాటు మరికొందరికి...

ఈ కేసులో తాజాగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పేరు బయటకు వచ్చింది. దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు ఎంపీకి సిట్‌ సీఆర్‌పీసీ 41(ఏ) నోటీస్‌లు జారీ చేసింది. ఈ నెల 29న బంజారాహిల్స్‌లోని సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. రామచంద్ర భారతి, నందుతో రఘురామకు పరిచయం ఉన్నట్లు సిట్‌ గుర్తించింది. అలాగే అజ్ఞాతంలో ఉన్న కేరళ వైద్యుడు జగ్గుస్వామి సోదరుడు మనీలాల్‌, జగ్గు వద్ద పనిచేసే విమల్‌, ప్రశాంత్‌, శరత్‌లకు నోటీసులు వెళ్లాయి. వీరితోపాటు జగ్గుస్వామి పనిచేస్తున్న అమృత ఆస్పత్రి భద్రతా అధికారి ప్రతాపన్‌కు సిట్‌ సీఆర్‌పీసీ 160 కింద నోటీ్‌సలు జారీ చేసింది. కాగా.. ఇప్పటికే నోటీ్‌సలు అందుకున్న నందు భార్య చిత్రలేఖ, న్యాయవాది ప్రతాప్‌ గౌడ్‌ శుక్రవారం (నేడు) సిట్‌ ఎదుట విచారణకు హాజరుకానున్నారు.

లెక్కలు చెప్పండి..

ఈ కేసులో ఏ-2గా ఉన్న నందకుమార్‌ అలియాస్‌ నందుతో ఉన్న ఆర్థిక లావాదేవీలు, విమాన ప్రయాణాల వివరాలు చెప్పాలంటూ న్యాయవాది శ్రీనివా్‌సకు సిట్‌ మరోసారి నోటీ్‌సలు జారీ చేసింది. ఇప్పటికే శ్రీనివాస్‌ రెండు రోజులు సిట్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణలో వెల్లడించిన అంశాలు, దర్యాప్తులో లభించిన సమాచారం మేరకు శ్రీనివా్‌సకు సిట్‌ మరోసారి నోటీ్‌సలు జారీ చేసింది. దీంతో శుక్రవారం ఆయన సిట్‌ ముందుకు రానున్నారు. తన సెల్‌ఫోన్‌లో లభించిన సమాచారం మేరకు నందు, సింహయాజితో ఉన్న ఆర్థిక లావాదేవీల గురించి తెలపాలని నోటీ్‌సలో పేర్కొంది. నందు నుంచి శ్రీనివాస్‌ రూ.55 లక్షల అప్పు తీసుకుని ప్రతి నెలా రూ.1.10 లక్షలు వడ్డీగా చెల్లిస్తున్నట్లు ఆన్‌లైన్‌ లావాదేవీల ద్వారా సిట్‌ గుర్తించింది. నగదు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను వెంట తీసుకురావాలని కోరింది. నందు, సింహయాజీతో కలిసి పలు సందర్భాల్లో విమాన ప్రయాణాలు చేసినట్లు గుర్తించిన అధికారులు.. ఎక్కడికెళ్లారు, ఎవర్ని కలిశారనే వివరాలు తెలపాలని కోరారు. శ్రీనివాస్‌, ఆయన భార్య బ్యాంకు ఖాతాల వివరాలు, పాస్‌పోర్టు వెంట తీసుకురావాలని పేర్కొన్నారు.

కస్టడీ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్టయి జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజీ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో తాము విచారణ చేపట్టిన తర్వాత నిందితుల్ని విచారించలేదని, దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు వారి నుంచి కీలక సమాచారం రాబట్టాల్సి ఉన్నందున వారిని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో సిట్‌ పిటిషన్‌ దాఖలుచేసింది. అయితే గతంలో నిందితుల్ని రెండు రోజులు కస్టడీకి ఇచ్చామని, మరోసారి కస్టడీకి ఇవ్వలేమని పేర్కొంటూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

సిట్‌ బిజీ బిజీ

ఈ కేసులో రోజుకు 14 గంటలు పనిచేస్తున్న సిట్‌కు.. వచ్చే నాలుగు రోజులు మరింత కీలకం కానున్నాయి. శుక్రవారం ముగ్గురు విచారణకు హాజరవుతున్నారు. ఇప్పటికే అరెస్టయిన వారితో వీరికి అత్యంత సన్నిహిత సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు ఉండటంతో విచారణలో ఏం అడగాలి, ఏ సమాచారం రాబట్టాలనేదానిపై సిట్‌ ప్రత్యేక ప్రశ్నావళి సిద్ధం చేసింది. న్యాయవాది శ్రీనివా్‌సపై ప్రత్యేక దృష్టి సారించింది. సిట్‌ నోటీ్‌సల ప్రకారం శని, సోమవారాల్లో బీఎల్‌ సంతోష్‌, మంగళవారం ఎంపీ రఘురామకృష్ణరాజు విచారణకు హాజరు కావాల్సి ఉంది. మొత్తంగా ఈ నాలుగు రోజుల విచారణలో సిట్‌కు లభించే సమాచారం కేసు దర్యాప్తును కీలక మలుపు తిప్పే అవకాశం ఉంది. అదే సమయంలో అరె్‌స్టలు జరిగే అవకాశాలూ లేకపోలేదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2022-11-25T04:21:01+05:30 IST