దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలి..?

ABN , First Publish Date - 2022-06-07T09:09:39+05:30 IST

ఒక మతాన్ని లక్ష్యంగా చే సుకుని బీజేపీ నేతలు విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నందుకు ఆ పార్టీ అంతర్జాతీయ సమాజానికి క్షమాపణలు

దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలి..?

మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ 


హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఒక మతాన్ని లక్ష్యంగా చే సుకుని బీజేపీ నేతలు విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నందుకు ఆ పార్టీ అంతర్జాతీయ సమాజానికి క్షమాపణలు చెప్పాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ, నవీన్‌ కుమార్‌ జిందాల్‌లను పార్టీ నుంచి బీజేపీ తొలగించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మంత్రి కేటీఆర్‌ సోమవారం ప్రధాని మోదీకి ట్వీట్‌ చేశారు. బీజేపీ మతోన్మాదులు చేస్తున్న విద్వేషపూరిత ప్రసంగాలకు.. అంతర్జాతీయ సమాజానికి దేశమెందుకు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు. ప్రతి రోజూ విద్వేష ప్రసంగాలకు చేస్తున్నందుకు ముందుగా బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘మోదీజీ.. మీ పార్టీ నేతల విద్వేష ప్రసంగాలపై మీరు కొనసాగిస్తున్న మౌనం దేశానికి కోలుకోలేనంత నష్టం చేకూరుస్తుంది’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ హత్యను బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ ప్రశంసించినప్పుడు ప్రధాని మౌనం దిగ్ర్భాంత్రి కలిగించిందన్నారు. ఇలాంటి సందర్భాల్లో బీజేపీ అగ్రనేతల నుంచి వస్తున్న నిశ్శబ్ధ మద్దతు దేశంలో మతోన్మాదం, విద్వేషాన్ని పెంచుతోందని చెప్పారు. ఈ పరిణామాలు భారత్‌కు కోలుకోలేనంత నష్టాన్ని చేకూరుస్తాయని మంత్రి కేటీఆర్‌.. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2022-06-07T09:09:39+05:30 IST