రేపటి నుంచి బయో ఆసియా సదస్సు

ABN , First Publish Date - 2022-02-23T08:19:39+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ‘బయో ఆసియా’ సదస్సుకు..

రేపటి నుంచి బయో ఆసియా సదస్సు

ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

ఏడు ప్యానల్స్‌ నుంచి 50 మంది వక్తల ప్రసంగం

బిల్‌ గేట్స్‌ - కేటీఆర్‌ మధ్య ఫైర్‌చాట్‌


(ఆంధ్రజ్యోతి-బిజినెస్‌ డెస్క్‌): రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ‘బయో ఆసియా’ సదస్సుకు రంగం సిద్ధమైంది. గురు, శుక్ర వారాల్లో (24, 25 తేదీల్లో) జరిగే ఈ అంతర్జాతీయ సదస్సును రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారు. కొవిడ్‌ నేపథ్యంలో గత ఏడాది లాగానే ఈసారి కూడా ఈ సదస్సును వర్చువల్‌గానే నిర్వహిస్తున్నారు. టెక్నాలజీ, హెల్త్‌కేర్‌ రంగాలకు చెందిన దాదాపు 50 మంది దేశ, విదేశీ ప్రముఖులు ఏడు ప్యానల్స్‌గా ఏర్పడి ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. కాగా.. గురువారం జరిగే ఫైర్‌చాట్‌లో కేటీఆర్‌, బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ కో చైర్మన్‌, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ మధ్య జరగనున్న సంభాషణపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. కొవిడ్‌ నేపథ్యంలో ఆరోగ్య రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు, నేర్చుకున్న అనుభవాలు, భవిష్యత్‌లో చెలరేగే అవకాశం ఉన్న వ్యాధులను ముందుగానే పసిగట్టి జాగ్రత్తపడడం ఎలా? అనే అంశాలు ఈ ఫైర్‌చాట్‌లో ప్రధానంగా చర్చకు వస్తాయని భావిస్తున్నారు.


వీటిపై చర్చ..

బయో ఆసియా 2022 సదస్సు తొలిరోజు ‘టూ ఇయర్స్‌ ఇన్‌ టు ది పాండమిక్‌’, ‘ఫార్మా అండ్‌ టెక్‌ కొలాబరేషన్‌-ఏ రెసిపీ ఫర్‌ సక్సెస్‌’,  ‘మెడ్‌టెక్‌ ఇండస్ట్రీ’ అనే మూడు కీలక అంశాలపై ప్రత్యేక చర్చ జరగనుంది. ‘టూ ఇయర్స్‌ ఇన్‌ టు ది పాండమిక్‌’ అనే అనే అంశంపై జరిగే చర్చలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌, నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌, భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా, బయోలాజికల్‌ ఈ సంస్థ ఎండీ దాట్ల మహిమ తదితరులు పాల్గొంటారు. గత అనుభవాలతో టీకాల అభివృద్ధిని త్వరితం చేయడం, ఆరోగ్య రంగాన్ని మరింతగా క్రమబద్ధీకరించడం వంటి అంశాలపై ఈ ప్యానల్‌ ప్రధానంగా చర్చిస్తుంది. 


రెండో రోజు..

రెండో రోజున.. ‘ఔషధ రంగంలో పరిశోధన, అభివృద్ధి-నిన్న, నేడు, రేపు’ అనే అంశంపై కీలక చర్చ జరగనుంది. బయోకాన్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ చైర్మన్‌ సతీష్‌ రెడ్డి తదితరులు ఈ చర్చలో పాల్గొంటారు. అదే రోజు జరిగే సీఈవో కాంక్లేవ్‌లో పిరామల్‌ గ్రూప్‌ చైర్మన్‌ అజయ్‌ పిరామల్‌, సన్‌ ఫార్మా ఎండీ దిలీప్‌ సంఘ్వీ, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ కోచైర్మన్‌, ఎండీ జేవీ ప్రసాద్‌ తదితరులు పాల్గొంటారు. ‘హైదరాబద్‌ ఇప్పటికే అంతర్జాతీయంగా జీవశాస్త్రాల ప్రధాన కేంద్రంగా ఎదిగింది. ఈ రంగానికి చెందిన అందరినీ ఒకే వేదిక మీదికి తీసుకువచ్చి చర్చలు జరపడానికి బయో ఆసియా సదస్సులు ఉత్ర్పేరకంలా పని చేస్తాయి’ అని కేటీఆర్‌ అన్నారు.

Updated Date - 2022-02-23T08:19:39+05:30 IST